‘‘ఆబ్రహ్మ పీపీలికాది పర్యంతం’’ అని సమస్తం అనే అర్థంలో ఉపయోగించటం చూస్తాం. చీమ అంటే అల్పజీవి అనే అర్థం ఇక్కడ. అంతేకాదు, చాలా చులకనగా చూడబడే జీవి, చిన్నప్రాణి. చీమ, దోమ అని కలిపి ఒకటిగా పరిగణించటం కూడా ఉంది. కానీ, మనిషి చీమ నుండి నేర్చుకో వలసినది చాలా ఉంది. అసలు చీమలు ఎన్ని రకాలో తెలుసా? ఎర్ర చీమలు, నల్లచీమలు, గండుచీమలు, బెదురు చీమలు, గబ్బుచీమలు, రెక్కలచీమలు... వీటి అన్నింటికీ సామాన్య లక్షణాలూ ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలూ ఉన్నాయి. సామాన్య లక్షణాలు ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయాలు.
అవిశ్రాంతంగా పని చేయటం చీమల సహజగుణం. నిరంతరం ఆహారాన్వేషణ చీమల లక్షణం. తిన్నంత తిని మిగిలినది జాగ్రత్త చేస్తాయి. చీమల పుట్టలని తవ్వి చూస్తే ధాన్యాగారంలో ఉన్నంత ధాన్యం ఉంటుందని చెపుతారు. అంత ధాన్యం తానే తిందామని దాచి పెట్టిందా? తన కోసమో, తన వారి కోసమో అంటే భవిష్యత్తు కోసం భద్రం చేయటం అనే సహజ గుణం అది. అందుకే కొద్ది కొద్దిగా కూడ పెడితే చీమలాగా కూడపెట్టారని అంటారు. అందుకే చిన్న మొత్తాల పొదుపుకి ఆదర్శం చీమలే.
చీమలకి ఉన్న ఘ్రాణశక్తి అమోఘం. బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు చీమలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరు చెప్పి ఉంటారు? అవి వాసనతో పసి గడతాయి. ఒక్కటి పసిగడితే చాలు. స్వార్థరహితంగా తన వారందరికీ తీపివార్తని అందిస్తుంది అది. ఇది కూడా అనుసరించ తగిన లక్షణమే కదా! ఏదైనా తీపి పలుకుని ఒక చీమ మోయ లేకపోయినా, ఒక చీమ చనిపోయినా దానిని తీసుకు వెళ్ళటానికి మిగిలినవి అన్నీ సహాయ పడతాయి. కలిసికట్టుగా ఉండటం చీమలని చూసి మనిషి నేర్చుకోవాలేమో!
క్రమశిక్షణ అంటే వెంటనే గుర్తు వచ్చేది చీమలే. చీమలు రెండు అయినా నాలుగు అయినా, వందలూ వేలూ అయినా ఒక వరుసలో మాత్రమే వెళ్ళటం గమనించవచ్చు. పైగా ఒక దానితో మరొకటిపోటీ పడవు, దారి తప్పవు. చీమలు నడచిన దారి కాలిబాట లాగా స్పష్టంగా కనపడుతుంది. చీమల క్రమశిక్షణ నడక లోనే కాదు, నడత లోనూ కనపడుతుంది. చీమలదండులో ఒకటి మిగిలిన వాటికన్న పెద్దదిగా ఉంటుంది. అదే ఆ దండుకి నాయకుడు. చీమలదండు తమ నాయకుని మాటనిపాటిస్తుంది.
చీమల గృహనిర్మాణశక్తి అద్భుతం. అంత చిన్నప్రాణులు భూమిని తొలిచి, దారి చేసుకుని, భూమి లోపల ఆశ్చర్యకరమైన నివాసస్థలాలని తయారు చేసుకుంటాయి. వాటి ప్రవేశం భూమి పైన ఉన్నా, వెళ్ళేది లోపలికి. రంధ్రంలోపలికినీళ్ళువెళ్ళటం సహజం. కానీ, చీమలు పెట్టిన పుట్ట ద్వారంలోకి నీటిచుక్క కూడా వెళ్ళదు. జాగ్రత్తగా చీమల పుట్టని అనుసరించి తవ్వుకుంటే వెడితే, లోపల ఎంతో శుచిగా, హాయిగా, చల్లగా ఉంటుందిట!గోడలు నున్నగా ఉంటాయి. అందుకేనేమోపాములు ఆ పుట్టలని తమ నివాసస్థానాలుగా చేసుకుంటాయి. ‘‘చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు ..’’ అనే మాటలు వినే ఉంటాం.
చీమలు తయారు చేసుకున్న నివాసాన్ని ఆక్రమించినపాములని అవకాశం చూసుకుని, అవే చీమలు పట్టి బాధిస్తాయి. చంపి వేయవచ్చు కూడా! చీమలు తలుచుకుంటే ఎంతటి పదార్థాన్ని అయినా గంటల్లో మాయం చేయగలవు. ఉదాహరణకి, మనిషిప్రాణంపోయిన తరువాత అట్లాగే ఉంచితే తెల్లవారే సరికి చీమలు ఎముకలని మాత్రమే మిగులుస్తాయి. వాటికి మనిషి మాంసం చాలా ఇష్టమట! బతికి ఉన్నా కదలిక లేకపోతే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి. అందుకే మంచంలో ఉన్నవాళ్ళని, శవాలని జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతారు. చీమతోపోలిస్తే సంతోషించాలి సుమా! – డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment