అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.
‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు.
రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–
‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..
‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.
మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి.
ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది.
‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.
ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.
‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు.
‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు.
‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు.
మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.
‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.
‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment