అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.
రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.
పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.
పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.
ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్
ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
Comments
Please login to add a commentAdd a comment