
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది.
‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’
ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది.
చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా.
‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’
మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి.
ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?
‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి.
‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్‌లో ఏర్పాటైంది.
అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్‌లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్‌లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది.
బ్రిటన్‌లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్‌లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్‌ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి.
(చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..)
Comments
Please login to add a commentAdd a comment