తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) పాఠశాలల్లో కరీంనగర్‌లోని అల్గునూర్ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో కరీంనగర్, కడప, వైజాగ్ సీవోఈలు ఏర్పాటుచేశారు. అల్గునూర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు.
ఎంపీసీ విభాగంలో యు.అమృత 974 మార్కులతో ప్రథమ, బి.హరిత(973)ద్వితీయ, నల్ల గంగాధర్(966) తృతీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో 957మార్కులతో టీ.శివకుమార్ ప్రథమ, జి.హరిత940, దీరావత్ శివ 934మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌కి అల్గునూర్ సీవోఈకి చెందిన 62మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 13 మంది అర్హత సాధించారు. వారిని సీవోఈ ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి, లెక్చరర్లు అభినందించారు.
ప్రొఫెసర్ అవుతా..
నాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామం. తల్లి లలిత మరణించగా.. తండ్రి యాదయ్య వ్యవసాయం చేస్తున్నాడు. నేను మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివా. సీవోఈలో సీటు రావడమే సంతోషమనిపించింది. ఇప్పుడు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రొఫెసర్ కావడమే నా లక్ష్యం.
-అమృత
డాక్టర్ లక్ష్యం..
నాది మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్. తల్లిదండ్రులు వెంకటస్వామి, సాలమ్మ కూలీ పని చేస్తుంటారు. నేను ఇంటర్‌లో 956 మార్కులు సాధించిన వయసు లేకపోవడంతో మెడిసిన్‌లో సీటు వచ్చే పరిస్థితిలేదు. ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఇస్తే లాంగ్‌టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం.
- శివకుమార్
ఇంజినీర్‌నవుతా..
అల్గునూర్ సీవోఈ ద్వారా ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. నాది ధర్మపురి మండలం జైన్ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీ, లక్ష్మణ్ చనిపోయారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించి కష్టపడి చదివి ఎరోస్పేషన్ ఇంజినీర్ కావాలనేది నాలక్ష్యం.
- ఎన్.గంగాధర్
సీవోఈలో కరీంనగర్ టాప్
Published Sun, May 4 2014 2:34 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement