THimapur
-
అమ్మమ్మ తోడుగా..
తిమ్మాపూర్ : ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బారె చంద్రమణికి ఎల్ఎండీ రిజర్వాయర్ శివారులోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆర్థిక స్థితి బాగాలేనందున, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేమని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి సమక్షంలో రామకృష్ణకాలనీ సర్పంచ్ సారయ్య, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. కొంతకాలంగా రామకృష్ణకాలనీలో ఉంటున్న బారె చంద్రమణి, పొరండ్లకు చెందిన నీలం భాస్కర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చంద్రమణి మరణించిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి ఆమె తల్లిగారి ఊరైన కాటారం మండలం దామెరకుంటకు పోలీ సులు సమాచారంమందించారు. చంద్రమణికి ఏడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉండగా రామకృష్ణాకాలనీ గ్రామస్తులే ఆలనాపాలనా చూశారు. మృతురా లి తల్లి మధునమ్మ, కుటుంబసభ్యులు బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకోగా ఆమె ఫిర్యాదు మేరకు గురువారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దామెరకుంటకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ ఆర్థికస్థితి బాగాలేదని చెప్పడంతో రామకృష్ణాకాలనీ సర్పంచ్ కిన్నెర సారయ్యతోపాటు గ్రామస్తులు కలి సి ఎల్ఎండీ శివారు లో ఖననం చేశారు. అప్పటి దాకా గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న మృతురాలి పిల్లలు మనోహర్(5), రమ్య(7)ను అంత్యక్రియల సమయంలో అక్కడికి తీసుకురాగా అమ్మమ్మను, మామయ్యను చూసి పిల్లలు విలపించారు. పిల్లల పరిస్థితి చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అంత్యక్రియల అనంతరం పిల్లలిద్దరూ అమ్మమ్మతో వెళ్లిపోయారు. జీవితంపై విరక్తిచెంది... భాస్కర్ ఇంట్లో గొడవల కారణంగా అతనితోపాటు తన కూతురు చంద్రమణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మధునమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రమణికి 2007 లో పోచమల్లుతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు. గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటినుంచి పిల్లలిద్దరినీ చంద్రమణి తీసుకుని పొరండ్లకు వచ్చి కూలీ పని చేసుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పొరండ్లకే చెందిన నీలం భాస్కర్‌తో కలిసి రెండేళ్ల నుంచి రామకృష్ణకాలనీలో ఉంటోందని, ఇదే సమయంలో భాస్కర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలియడంతో జీవితంపై విరక్తి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని, తన కూతురు చికిత్స పొందుతూ మరణించిందని మధునమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. -
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్ : పోలీసుల భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకరపట్నం మండలం మొలంగూర్ వద్ద ముత్తారానికి చెందిన రాజేందర్ ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో తిమ్మాపూర్ మండలం మక్తపల్లెకు చెందిన మైలారం శంకర్‌ను పోలీసులు అనుమానించారు. సోమవారం సాయంత్రం శంకరపట్నం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మక్తపల్లెకు వచ్చి శంకర్‌ను, ఆయన భార్యను, స్నేహితులను విచారించారు. అనంతరం ఇంటివరకు అతడిని తీసుకుని పోలీసులు వెళ్లగా బాత్రూంకు వెళ్లివస్తానని ఇంటి వెనుకకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. పోలీసులు వెనక్కి వెళ్లి చూడగా శంకర్ గొంతును కత్తితో కోసుకున్నాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో శంకర్ గొంతుకు శస్త్ర చికిత్స జరిగిందని, ఏమీ మాట్లడలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు తెలిపారు. -
టోల్ వసూల్
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : రాజీవ్ ఫోర్‌లేన్ రహదారిపై శనివారం అర్ధరాత్రి నుంచి టోల్‌టాక్స్ వసూలు ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అనుమతివ్వడంతో.. ఒకటో తేదీ ప్రారంభమైన తర్వాత రాత్రి 12.01 గంటలకు హెచ్‌కేఆర్ రోడ్ వేస్ ఆధ్వర్యంలో టోల్‌టాక్స్ వసూళ్లు మొదలుపెట్టారు. శనివారం రాత్రి 10 గంటలకు ఫోర్‌లేన్‌పై బసంత్‌నగర్, రేణికుంట, దుద్దెడ వద్దనున్న మూడు టోల్గేట్ల వద్ద ఒకేసారి పూజలు ప్రారంభించారు. రేణికుంటలో హెచ్‌కేఆర్ సీజీఎం రామకృష్ణ, గాయత్రి కన్స్ట్రక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ కోటి లింగం, ప్రతినిధి విజయభాస్కర్ పాల్గొన్నారు. అన్ని టోల్గేట్ల వద్ద వాహనాల కోసం రెండు లేన్లు పోవడానికి, మరో రెండు లేన్లు రావడానికి ఏర్పాటు చేశారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్ల రాకపోకల కోసం అదనంగా మరో రెండు లేన్లను ఏర్పాటు చేశారు. టోల్గేట్ వద్ద అంబులెన్స్, క్రేన్‌తోపాటు పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. రేణికుంట టోల్ ప్లాజా వద్ద కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 94910 60033, పెట్రోలింగ్ వాహనం ఫోన్ నంబర్ 94910 60044 అందుబాటులో ఉంటుందని హెచ్‌కేఆర్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదాలు జరిగితే కంట్రోల్ రూమ్ నంబర్‌కి ఫోన్ చేస్తే అంబులెన్స్‌ను, వాహనాలు రోడ్డుపై చెడిపోతే పెట్రోలింగ్ వాహనానికి ప్రయాణికులు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. టోల్ రేట్లు రెండేళ్లకోసారి మారుతాయని, మొత్తం 22 సంవత్సరాలు టోల్‌టాక్స్ వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. -
సీవోఈలో కరీంనగర్ టాప్
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) పాఠశాలల్లో కరీంనగర్‌లోని అల్గునూర్ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో కరీంనగర్, కడప, వైజాగ్ సీవోఈలు ఏర్పాటుచేశారు. అల్గునూర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు. ఎంపీసీ విభాగంలో యు.అమృత 974 మార్కులతో ప్రథమ, బి.హరిత(973)ద్వితీయ, నల్ల గంగాధర్(966) తృతీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో 957మార్కులతో టీ.శివకుమార్ ప్రథమ, జి.హరిత940, దీరావత్ శివ 934మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌కి అల్గునూర్ సీవోఈకి చెందిన 62మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 13 మంది అర్హత సాధించారు. వారిని సీవోఈ ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి, లెక్చరర్లు అభినందించారు. ప్రొఫెసర్ అవుతా.. నాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామం. తల్లి లలిత మరణించగా.. తండ్రి యాదయ్య వ్యవసాయం చేస్తున్నాడు. నేను మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివా. సీవోఈలో సీటు రావడమే సంతోషమనిపించింది. ఇప్పుడు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రొఫెసర్ కావడమే నా లక్ష్యం. -అమృత డాక్టర్ లక్ష్యం.. నాది మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్. తల్లిదండ్రులు వెంకటస్వామి, సాలమ్మ కూలీ పని చేస్తుంటారు. నేను ఇంటర్లో 956 మార్కులు సాధించిన వయసు లేకపోవడంతో మెడిసిన్‌లో సీటు వచ్చే పరిస్థితిలేదు. ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఇస్తే లాంగ్‌టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. - శివకుమార్ ఇంజినీర్‌నవుతా.. అల్గునూర్ సీవోఈ ద్వారా ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. నాది ధర్మపురి మండలం జైన్ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీ, లక్ష్మణ్ చనిపోయారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించి కష్టపడి చదివి ఎరోస్పేషన్ ఇంజినీర్ కావాలనేది నాలక్ష్యం. - ఎన్.గంగాధర్ -
మృగాళ్లు
మగాళ్లు మృగాళ్లలా మారారు. మద్యం మత్తులో మానవత్వం మరిచి పైశాచికంగా వ్యవహరించారు. జిల్లాలో బుధవారం జరిగిన సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారుు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో... జీవితాంతం తోడూనీడగా ఉంటానని బాస చేసిన భర్తే వంద రూపాయల కోసం భార్యతో ఘర్షణ పడి ఆమెను హతమార్చాడు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో మద్యం తాగడానికి డబ్బులివ్వడం లేదని భార్యాబిడ్డలను చితకబాదాడో ప్రబుద్ధుడు. తిమ్మాపూర్ మండలం రేణికుంటలోఓ మానవమృగం మహిళా చెవులు కొరికి, వికృత చేష్టలకు పాల్పడి సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వీరందరికీ స్థానికులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారి వారి కాపురంలో చిచ్చు పెట్టింది. రూ.100 కోసం ఆలినే కడతేర్చాడు. తండ్రి చేసిన పనికి తల్లి పరలోకాలకు వెళ్లగా తండ్రి జైలుపాలు కావడంతో వారి కుమారుడు బిక్కుబిక్కుమంటూ తాతమ్మ దగ్గర విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అక్కన్నపేటలో శ్రీనివాస్ చేతిలో హతమైన భార్య రేణుకను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ మల్లమ్మ పెంచి పెద్దచేసింది. రేణుకకు ఆమె గ్రామస్తుల వద్ద విరాళాలు సేకరించి ఆమెకు మేన బావ అయిన శ్రీనివాస్‌తో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు నాగచైతన్య(6) ఉన్నాడు. శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ నిత్యం తాగి వచ్చి రేణుకను వేధించడం సాధారణమైపోయింది. చివరకు మంగళవారం రాత్రి అతడి చేతిలోనే కడతేరగా సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులే మళ్లీ విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐ సదన్‌కుమార్, ఎస్సై మహేందర్‌రెడ్డి సైతం రూ.2 వేలు అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సిరిసిల్ల రూరల్ : మద్యం మహమ్మారి మరో కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. తాగేందుకు డబ్బులివ్వలేదని సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన నగేశ్ భార్యాబిడ్డలను చితకబాదగా గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. -
మన్నించండయ్యా..!
‘పెద్దలూ మన్నించండి. మీ ఉత్తర క్రియలను సరిగ్గా చేయలేకపోతున్న అసక్తులం. ఎంతో గౌరవ ప్రదమైన మీ పార్థివ దేహాలను పంచభూతాల్లో కలపలేక పోతున్నాం. విగత జీవులైన మిమ్మల్ని పుడమి తల్లి ఒడిలో శాశ్వతంగా నిద్ర పుచ్చాలనే మాకున్నా ఆరడుగుల నేలా కరువై పోతోంది. పల్లెల్లో మరుభూమి కానరాకుంది. ఉన్నవాటిని కబ్జాదారులు నొక్కేశారు. కొనాలంటే స్థోమత చాలడం లేదు. కాటి సీను ఖరీదై పోతోంది. ఏం చేస్తాం...గుండెలవిశేలా రోదిస్తాం..క్షమించమని మీ ఆత్మలను వేడుకుంటున్నాం...’ ఇదీ ప్రస్తుతం గ్రామాల్లోని దుస్థితి. అమరులైన వారి అంత్యక్రియలకు ఎదురవుతున్న పాట్లు...అగచాట్లు. అడ్డాకుల, న్యూస్‌లైన్: ఎంత ఘనంగా బతికినా మనిషికి చివరి మజిలీ సజావుగా సాగితేనే ఆ జీవితం ధన్యత చెందిందిగా భావిస్తాం. తనువు చాలించాక శాస్త్రోక్తంగా ఈ లోకంనుంచి సాగనంపుతాం. దీనికోసం ఎన్నో తంతులు. వ్యవహారాలు. కానీ ఇవన్నీ ఇప్పుడు సాగించేందుకు పల్లెల్లో దుర్భరస్థితి ఎదురవుతోంది. విగతజీవుడిగా మారిన వ్యక్తికి పూడ్చేందుకో, ఇతర ఉత్తరక్రియలు జరిపేందుకో కనీసం ఆరడగుల జాగా దొరకడం లేదు. గత్యంతరం లేక పూడ్చినచోటే మళ్లీ మరొక శవాన్ని పూడ్చడం వంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ శ్మశానవాటికలకు ఇవ్వడంల లేదు. కొన్ని చోట్ల ఉన్నవి కబ్జాకోరల్లోనలుగుతోంది. ఒకవేళ శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి వద్దకు వెళ్లే దారులు మాత్రం ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు అవస్థలు ఎదురవుతున్నాయి. ఆరడుగుల స్థలానికి.... కొన్ని గ్రామాల్లో సొంత భూములు లేని వారు ఆరడుగుల స్థలాన్ని రూ.3వేలకో నాలుగు వేలకో కొనుగోలు చేసి సంస్కార క్రియలు జరుపుతున్నారు. మండల పరిధిలోని శాఖాపూర్, దాసర్పల్లి, వేముల, గాజులపేట, సంకలమద్ది, మూసాపేట, నిజాలాపూర్, చక్రాపూర్, పొన్నకల్, రాచాల గ్రామాల్లో శ్మశానవాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్మశానవాటికల స్థలాల కోసం అధికారులకు ఆర్జీలు పెట్టుకుంటున్నారు. తిమ్మాపూర్‌లో ముస్లీంల శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన దారి లేదు. వేములలో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువులోనే శవాలను పూడ్చి వేస్తున్నారు. దాని పక్కనే తాగునీటి బోరుంది. అయినా తప్పడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోల్కంపల్లిలో హిందు శ్మశానవాటిక లేదు. ఇక్కడ వాగు పరిసరాల్లో శవాలను పూడుస్తున్నారు. జానంపేటలో ఉన్న శ్మశానవాటిక కబ్జాకు గురవుతోంది. కొనుగోలుకు ప్రతిపాదనలున్నా... శ్మశానవాటికల కోసం శాఖాపూర్‌లో 2 ఎకరాలు, వేములలో 2ఏకరాల 4గుంటలు, దాసర్పల్లి, గాజులపేటలో రెండె కరాల ప్రైవేటు వ్యక్తుల భూమిని కొనుగోలు చేసేందుకు రెవెన్యూ అధికారులు ఇంతకు ముందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే వాటికి అనుమతి రాలేదు. ఇదిలా ఉండగా మండలంలో ఎక్కువ గ్రామాలకు సమీపంలో జాతీయ రహదారి విస్తరించి ఉండటంతో భూముల విలువ లక్షల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలకు స్థలాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది. కాగా గ్రామాల్లో శ్మశానవాటికల స్థలాల సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చస్తే ఎక్కడ పూడ్చాలి..! మా గ్రామంలో హిందు శ్మశానవాటికకు స్థల సమస్య ఏర్పడింది. ఎవరైనా చనిపోతే స్థలం కోసం వెతకాల్సిన దుస్థితి దాపురించింది. సొంత పొలాలు ఉన్న వారికి సమస్య లేకపోయినా లేని వారికే ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం చెరువు వాగు పరిసరాల్లో శవాలను పూడ్చిపెట్టే దుస్థితి ఉంది. -ప్రవీన్‌రెడ్డి, పోల్కంపల్లి చెరువులోనే పూడుస్తున్నాం..! మా గ్రామంలో శ్మశానవాటికకు స్థలం కొరత ఉంది. చాలా ఏళ్ల నుంచి గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువులోనే శవాలను పూడ్చుతున్నారు. సమాధుల పక్కనే గ్రామానికి తాగునీరందించే బోరు కూడా ఉంది. అయినా తప్పడం లేదు. -వెంకటేష్, వేముల -
యూటీలు అధ్వానం..
కాకతీయ దిగువ కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. గరిష్టంగా 8 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కాకతీయ కాలువలను డిజైన్ చేసినా ప్రస్తుతం 3 వేలకు మించి నీటినందించలేని పరిస్థితి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : కాలువ లైనింగ్ దెబ్బతిన్న చోట ఇసుక సంచులుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులకు యూటీలు పరీక్ష పెడుతున్నాయి. ఎల్ఎండీ దిగువన ఉన్న నాలుగు యూటీలు లీకేజీ అవుతున్నాయి. గతంలో కాలువ 149వ కిలోమీటర్ వద్ద మరమ్మతు చేసిన యూటీకి మళ్లీ లీకేజీ ఏర్పడింది. నీరు విడుదల చేస్తే ఆ తాకిడికి లీకేజీలు మరింత పెద్దవిగా మారే ప్రమాదముంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరున్నా కాలువ పరిస్థితి బాగా లేనందున మూడు వేల క్యూసెక్కులు వదిలితే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు భావిస్తున్నారు. రబీలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, 3 వేల క్యూసెక్కులే వదిలితే చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా లేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తేనే మేలని పేర్కొంటున్నారు. 149వ కిలోమీటర్ యూటీ మరమ్మతు సమయంలో వేసిన ఇసుక బస్తాలు కాలువలోనే దర్శనిమివ్వడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. అక్కడ లైనింగ్ సైతం చేయలేదని రైతులు పేర్కొంటున్నారు. యూటీల లీకేజీలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి పెద్దవిగా మారి బుంగ పడితే రైతులే బాధ్యులంటూ కేసులు నమోదు చేస్తున్నారని సమీప చేల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెలాఖరులోగా నీటి విడుదల చేసే అవకాశముండగా... అంతకుముందే అధికారులు ఒకసారి కాలువలను, యూటీలను పరిశీలించి మరమ్మతు చేయిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు కోరుతున్నారు. రబీ తర్వాతే మరమ్మతు ఎల్ఎండీ దిగువన కాకతీయ కాలువల లైనింగ్, యూటీల లీకేజీ కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్సారెస్పీ సీఈ శంకర్ తెలి పారు. మరమ్మతుకు 45 రోజుల సమయం అవసరమని.. రబీలో సాగుకు, స్టేజ్ 2కి తాగునీటికి ఏప్రిల్ ఆఖరు వరకు నీటిని విడుదల చేసిన తర్వాత పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్పా రు. కాలువల మొదట ఉన్న రైతులు నీటిని వృథా చేయకుండా కింద రైతులకు పంపిస్తే ఇబ్బంది ఉండదని సూచించారు. -
అవినీతి జలగ
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : ఏసీబీ వలలో మరో అవినీతి జలగ చిక్కింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఎస్సారెస్పీ వరదకాలువ-1 డివిజన్-3లో డీఈఈగా పనిచేస్తున్న పాలకుర్తి రవి తన కార్యాలయంలోని అద్దె వాహనదారుడి నుంచి గురువారం రూ.5,500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. కరీంనగర్‌లోని కాపువాడకు చెందిన శ్రావణ్ తన ఇండికా కారును ఈ ఏడాది ఫిభ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు అద్దె ప్రతిపాదికన కార్యాలయంలో పెట్టాడు. ఇందుకు ఆయనకు ప్రతి నెల రూ.24 వేలు చెల్లిస్తున్నారు. మార్చి నెల బిల్లు బకాయి ఉండడంతో శ్రావణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లు చెల్లించాలంటే తనకు రూ.8 వేలు లంచం ఇవ్వాలని డీఈఈ పాలకుర్తి రవి డిమాండ్ చేశారు. ఇప్పుడు తనవద్ద డబ్బులు లేవని శ్రావణ్ ఎన్నిసార్లు బతిమిలాడినా వినలేదు. లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తామని రవి తేల్చిచెప్పడంతో శ్రావణ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇంట్లోనే చిక్కిన వైనం రవి డిమాండ్ మేరకు శ్రావణ్ కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో అద్దెకు ఉంటున్న సదరు అధికారి ఇంటికి గురువారం ఉదయం రూ.5,500 తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆయన చేతికి డబ్బు అందించగానే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యం లో సిబ్బంది దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తీసుకున్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఐఎఫ్ఎఫ్సీలో పని చేస్తున్న సూపరింటెండెంట్ ఫయీమొద్దీన్ చెబితేనే డబ్బులు తీసుకున్నానని రవి తెలిపా రు. తాను కారు బిల్లు ఇచ్చేందుకు ఫైల్‌పై సంతకాలు కూడా చేశానని, పై అధికారుల సూచన మేరకే డబ్బులు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అవినీతి మూలాలు వెలికితీస్తామని, అవసరమైతే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. రవిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామన్నారు. సమాచారం ఇవ్వాలి లంచం అడిగిన అధికారి ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా నిర్భయంగా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. లంచాలకు అలవాటుపడిన శాఖలపై దృష్టిసారించామని, సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. చాలామంది మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లంచాలు తీసుకుంటున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై కూడా దాడులు చేస్తామన్నారు. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్న అధికారులను కూడా వదలబోమని స్పష్టం చేశారు. రికార్డులు స్వాధీనం తిమ్మాపూర్ : ఏసీబీకి పట్టుబడిన డీఈఈ పాలకుర్తి రవి పనితీరుపై ఎల్ఎండీలోని ఆయన కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ విచారణ జరిపారు. కారు అద్దె బిల్లుకు సంబంధించిన ఫైళ్లు కార్యాలయంలో సూపరింటెండెంట్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని డీఈఈ తెలుపగా డీఎస్పీ వచ్చి వాటిని తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ లేకపోవడంతో కారు అద్దెకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి రవి 2004లో ఏఈగా చింతగట్టులో పనిచేశారు. తర్వాత డీఈఈగా పదోన్నతి పొంది కాగజ్‌నగర్‌లోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం గతేడాది జూలైలో ఇక్కడికి బదిలీపై వచ్చారు.