‘పెద్దలూ మన్నించండి. మీ ఉత్తర క్రియలను సరిగ్గా చేయలేకపోతున్న అసక్తులం. ఎంతో గౌరవ ప్రదమైన మీ పార్థివ దేహాలను పంచభూతాల్లో కలపలేక పోతున్నాం. విగత జీవులైన మిమ్మల్ని పుడమి తల్లి ఒడిలో శాశ్వతంగా నిద్ర పుచ్చాలనే మాకున్నా ఆరడుగుల నేలా కరువై పోతోంది. పల్లెల్లో మరుభూమి కానరాకుంది. ఉన్నవాటిని కబ్జాదారులు నొక్కేశారు. కొనాలంటే స్థోమత చాలడం లేదు. కాటి సీను ఖరీదై పోతోంది. ఏం చేస్తాం...గుండెలవిశేలా రోదిస్తాం..క్షమించమని మీ ఆత్మలను వేడుకుంటున్నాం...’ ఇదీ ప్రస్తుతం గ్రామాల్లోని దుస్థితి. అమరులైన వారి అంత్యక్రియలకు ఎదురవుతున్న పాట్లు...అగచాట్లు.
అడ్డాకుల, న్యూస్‌లైన్: ఎంత ఘనంగా బతికినా మనిషికి చివరి మజిలీ సజావుగా సాగితేనే ఆ జీవితం ధన్యత చెందిందిగా భావిస్తాం. తనువు చాలించాక శాస్త్రోక్తంగా ఈ లోకంనుంచి సాగనంపుతాం. దీనికోసం ఎన్నో తంతులు. వ్యవహారాలు. కానీ ఇవన్నీ ఇప్పుడు సాగించేందుకు పల్లెల్లో దుర్భరస్థితి ఎదురవుతోంది. విగతజీవుడిగా మారిన వ్యక్తికి పూడ్చేందుకో, ఇతర ఉత్తరక్రియలు జరిపేందుకో కనీసం ఆరడగుల జాగా దొరకడం లేదు.
గత్యంతరం లేక పూడ్చినచోటే మళ్లీ మరొక శవాన్ని పూడ్చడం వంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ శ్మశానవాటికలకు ఇవ్వడంల లేదు. కొన్ని చోట్ల ఉన్నవి కబ్జాకోరల్లోనలుగుతోంది. ఒకవేళ శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి వద్దకు వెళ్లే దారులు మాత్రం ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు అవస్థలు ఎదురవుతున్నాయి.
ఆరడుగుల స్థలానికి....
కొన్ని గ్రామాల్లో సొంత భూములు లేని వారు ఆరడుగుల స్థలాన్ని రూ.3వేలకో నాలుగు వేలకో కొనుగోలు చేసి సంస్కార క్రియలు జరుపుతున్నారు. మండల పరిధిలోని శాఖాపూర్, దాసర్‌పల్లి, వేముల, గాజులపేట, సంకలమద్ది, మూసాపేట, నిజాలాపూర్, చక్రాపూర్, పొన్నకల్, రాచాల గ్రామాల్లో శ్మశానవాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
శ్మశానవాటికల స్థలాల కోసం అధికారులకు ఆర్జీలు పెట్టుకుంటున్నారు. తిమ్మాపూర్‌లో ముస్లీంల శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన దారి లేదు. వేములలో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువులోనే శవాలను పూడ్చి వేస్తున్నారు. దాని పక్కనే తాగునీటి బోరుంది. అయినా తప్పడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోల్కంపల్లిలో హిందు శ్మశానవాటిక లేదు. ఇక్కడ వాగు పరిసరాల్లో శవాలను పూడుస్తున్నారు. జానంపేటలో ఉన్న శ్మశానవాటిక కబ్జాకు గురవుతోంది.
కొనుగోలుకు ప్రతిపాదనలున్నా...
శ్మశానవాటికల కోసం శాఖాపూర్‌లో 2 ఎకరాలు, వేములలో 2ఏకరాల 4గుంటలు, దాసర్‌పల్లి, గాజులపేటలో రెండె కరాల ప్రైవేటు వ్యక్తుల భూమిని కొనుగోలు చేసేందుకు రెవెన్యూ అధికారులు ఇంతకు ముందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే వాటికి అనుమతి రాలేదు. ఇదిలా ఉండగా మండలంలో ఎక్కువ గ్రామాలకు సమీపంలో జాతీయ రహదారి విస్తరించి ఉండటంతో భూముల విలువ లక్షల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలకు స్థలాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది. కాగా గ్రామాల్లో శ్మశానవాటికల స్థలాల సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చస్తే ఎక్కడ పూడ్చాలి..!
మా గ్రామంలో హిందు శ్మశానవాటికకు స్థల సమస్య ఏర్పడింది. ఎవరైనా చనిపోతే స్థలం కోసం వెతకాల్సిన దుస్థితి దాపురించింది. సొంత పొలాలు ఉన్న వారికి సమస్య లేకపోయినా లేని వారికే ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం చెరువు వాగు పరిసరాల్లో శవాలను పూడ్చిపెట్టే దుస్థితి ఉంది.
-ప్రవీన్‌రెడ్డి, పోల్కంపల్లి
చెరువులోనే పూడుస్తున్నాం..!
మా గ్రామంలో శ్మశానవాటికకు స్థలం కొరత ఉంది. చాలా ఏళ్ల నుంచి గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువులోనే శవాలను పూడ్చుతున్నారు. సమాధుల పక్కనే గ్రామానికి తాగునీరందించే బోరు కూడా ఉంది. అయినా తప్పడం లేదు.
-వెంకటేష్, వేముల
మన్నించండయ్యా..!
Published Sat, Dec 28 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement