కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : ఏసీబీ వలలో మరో అవినీతి జలగ చిక్కింది. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో ఎస్సారెస్పీ వరదకాలువ-1 డివిజన్-3లో డీఈఈగా పనిచేస్తున్న పాలకుర్తి రవి తన కార్యాలయంలోని అద్దె వాహనదారుడి నుంచి గురువారం రూ.5,500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు.
కరీంనగర్‌లోని కాపువాడకు చెందిన శ్రావణ్ తన ఇండికా కారును ఈ ఏడాది ఫిభ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు అద్దె ప్రతిపాదికన కార్యాలయంలో పెట్టాడు. ఇందుకు ఆయనకు ప్రతి నెల రూ.24 వేలు చెల్లిస్తున్నారు. మార్చి నెల బిల్లు బకాయి ఉండడంతో శ్రావణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లు చెల్లించాలంటే తనకు రూ.8 వేలు లంచం ఇవ్వాలని డీఈఈ పాలకుర్తి రవి డిమాండ్ చేశారు. ఇప్పుడు తనవద్ద డబ్బులు లేవని శ్రావణ్ ఎన్నిసార్లు బతిమిలాడినా వినలేదు. లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తామని రవి తేల్చిచెప్పడంతో శ్రావణ్ ఏసీబీని ఆశ్రయించాడు.
ఇంట్లోనే చిక్కిన వైనం
రవి డిమాండ్ మేరకు శ్రావణ్ కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో అద్దెకు ఉంటున్న సదరు అధికారి ఇంటికి గురువారం ఉదయం రూ.5,500 తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆయన చేతికి డబ్బు అందించగానే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యం లో సిబ్బంది దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తీసుకున్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఐఎఫ్‌ఎఫ్‌సీలో పని చేస్తున్న సూపరింటెండెంట్ ఫయీమొద్దీన్ చెబితేనే డబ్బులు తీసుకున్నానని రవి తెలిపా రు.
తాను కారు బిల్లు ఇచ్చేందుకు ఫైల్‌పై సంతకాలు కూడా చేశానని, పై అధికారుల సూచన మేరకే డబ్బులు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అవినీతి మూలాలు వెలికితీస్తామని, అవసరమైతే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. రవిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామన్నారు.
సమాచారం ఇవ్వాలి లంచం అడిగిన అధికారి ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా నిర్భయంగా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. లంచాలకు అలవాటుపడిన శాఖలపై దృష్టిసారించామని, సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. చాలామంది మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లంచాలు తీసుకుంటున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై కూడా దాడులు చేస్తామన్నారు. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్న అధికారులను కూడా వదలబోమని స్పష్టం చేశారు.
రికార్డులు స్వాధీనం
తిమ్మాపూర్ : ఏసీబీకి పట్టుబడిన డీఈఈ పాలకుర్తి రవి పనితీరుపై ఎల్‌ఎండీలోని ఆయన కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ విచారణ జరిపారు. కారు అద్దె బిల్లుకు సంబంధించిన ఫైళ్లు కార్యాలయంలో సూపరింటెండెంట్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని డీఈఈ తెలుపగా డీఎస్పీ వచ్చి వాటిని తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ లేకపోవడంతో కారు అద్దెకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి రవి 2004లో ఏఈగా చింతగట్టులో పనిచేశారు. తర్వాత డీఈఈగా పదోన్నతి పొంది కాగజ్‌నగర్‌లోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం గతేడాది జూలైలో ఇక్కడికి బదిలీపై వచ్చారు.
అవినీతి జలగ
Published Fri, Sep 27 2013 3:12 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement