మగాళ్లు మృగాళ్లలా మారారు. మద్యం మత్తులో మానవత్వం మరిచి పైశాచికంగా వ్యవహరించారు. జిల్లాలో బుధవారం జరిగిన సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారుు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో... జీవితాంతం తోడూనీడగా ఉంటానని బాస చేసిన భర్తే వంద రూపాయల కోసం భార్యతో ఘర్షణ పడి ఆమెను హతమార్చాడు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో మద్యం తాగడానికి డబ్బులివ్వడం లేదని భార్యాబిడ్డలను చితకబాదాడో ప్రబుద్ధుడు. తిమ్మాపూర్ మండలం రేణికుంటలోఓ మానవమృగం మహిళా చెవులు కొరికి, వికృత చేష్టలకు పాల్పడి సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వీరందరికీ స్థానికులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు.
హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారి వారి కాపురంలో చిచ్చు పెట్టింది. రూ.100 కోసం ఆలినే కడతేర్చాడు. తండ్రి చేసిన పనికి తల్లి పరలోకాలకు వెళ్లగా తండ్రి జైలుపాలు కావడంతో వారి కుమారుడు బిక్కుబిక్కుమంటూ తాతమ్మ దగ్గర విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అక్కన్నపేటలో శ్రీనివాస్ చేతిలో హతమైన భార్య రేణుకను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ మల్లమ్మ పెంచి పెద్దచేసింది. రేణుకకు ఆమె గ్రామస్తుల వద్ద విరాళాలు సేకరించి ఆమెకు మేన బావ అయిన శ్రీనివాస్‌తో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు నాగచైతన్య(6) ఉన్నాడు. శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ నిత్యం తాగి వచ్చి రేణుకను వేధించడం సాధారణమైపోయింది.
చివరకు మంగళవారం రాత్రి అతడి చేతిలోనే కడతేరగా సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులే మళ్లీ విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐ సదన్‌కుమార్, ఎస్సై మహేందర్‌రెడ్డి సైతం రూ.2 వేలు అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సిరిసిల్ల రూరల్ : మద్యం మహమ్మారి మరో కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. తాగేందుకు డబ్బులివ్వలేదని సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన నగేశ్ భార్యాబిడ్డలను చితకబాదగా గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేశారు.
మృగాళ్లు
Published Thu, Jan 2 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement