కాట్రోత్ సుమలత
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది.
ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.
మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా
హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది.
ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
జెన్‌కో ఇంజనీర్లకు పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్‌హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్‌ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్‌ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment