వేదాంతం అనే మాట తెలుసు అందరికీ, అర్థం సరిగ్గా తెలిసినా లేకపోయినా. ఇంతకీ ఈ మెట్టవేదాంతం ఏమిటి? కాని, ఈ మాటని చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. మాగాణి వేదాంతం మరొకటి ఉందా? దీనికీ, దానికీ తామరకి, మెట్టతామరకి మధ్య ఉన్నంత తేడా ఉంటుందా? తామర, మెట్టతామర రెండూ పూలు. అంతే వాటి సంబంధం. ఒకటి నీళ్ళలో, మరొకటి నేల మీద పెరుగుతాయి. కాని, వేదాంతానికి మెట్ట వేదాంతానికి ఉన్నది మరొక రకమైన సంబంధం.
వేదాంతం ఒక శాస్త్రం. అన్ని వేదాలు క్షుణ్ణంగా చదివిన తరువాత గురువు సమీపంలో కూర్చుని వేదాలలోని మర్మాలు తెలుసుకుంటాడు శిష్యుడు. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఆ సంభాషణలని ఉపనిషత్తులు అని అంటారు. వేదాధ్యయనం అయిన తరువాత తెలుసుకునే భాగాలు కనుక వేదాంతంగా పరిగణించబడినాయి.
సమస్తం భగవంతుడి స్వరూపంగా భావించ గలగటం అప్పటికి అభ్యాసం అయి ఉంటుంది. అందువల్ల వేదాంతం వంటపట్టిన వారు సామాన్య భక్తులలాగా పూజాదికాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం సర్వవ్యాపి అయిన పరబ్రహ్మతత్త్వాన్ని ధ్యానం చేస్తూ, వివేచన చేస్తూ, అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అటువంటి వారు చెప్పే మాటలని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒకటి, రెండు మాటలని పట్టుకుని తమకి అనుకూలంగా వాడుకుంటారు కొంతమంది. కొంతమంది తెలియక కూడా ఆ విధంగా చేస్తారు. అంటే వేదాంత పరిభాషని తన ప్రవర్తనని సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు మనకి అడుగడుగునా, కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి.
‘‘అన్నమైతేనేమిరా? మరి, సున్నమైతే నేమిరా?’’ అని అన్నానికి సున్నానికి తేడా లేదని అంతా సమానమేనని ఇంటిముందు అడుక్కునేందుకు వచ్చిన సన్న్యాసి పాడుతాడు. ‘అబ్బా ఎంత వైరాగ్యం!’ అని అనుకుంటూ ఉంటే ఇట్లా కొనసాగిస్తాడు – ‘‘అందుకే ఈ పాడు పొట్టకి అన్నమే వేదాము రా! పప్పన్నమే వేదాము రా! నెయ్యన్నమే వేదామురా! పెరుగన్నమే వేదాము రా!’’ అంటాడు.
అంతటితో ఆగడు. ‘‘చీరలైతేనేమిరా? మరి, నారలైతే నేమిరా? అందుకే ఈ పాడు ఒంటికి చీరలే కడదామురా! పట్టుచీరలే కడదామురా!’’ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ పాట. ఇటువంటి వాటిని తత్త్వాలు అంటారు. తన శక్తిమేరకు పనిచేసి ఫలితం ఏమైనా పట్టించుకోకపోవటం వేదాంతి అయిన వాడు చేసే పని. కాని, వేదాంత ప్రసంగాలు విని, విని కొన్ని ఊతపదాలు మనకి అలవాటై పోయాయి.
‘‘మన చేతుల్లో ఏముంది?’’,‘‘ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది’’ అంటూ చేతులు ముడుచుకుని కూర్చునేవారు, తమ బద్ధకానికి, చేతకానితనానికి వేదాంతపు ముసుగు వేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి వల్లనే మన ధర్మానికి, వేదాలకి, వేదాంతానికి చెడ్డపేరు వస్తోంది. మనం మెట్టవేదాంతులం కాకుండా ఉంటే చాలు. అటువంటి వారి నుండి దూరంగా ఉండటం మంచిది.
అన్నానికి సున్నానికి తేడా లేదనటం వేదాంతం. అందుకని రకరకాల అన్నాలు వేద్దామనే నిర్ణయానికి రావటం మెట్టవేదాంతం. ఈ రెండింటికి తేడా లేదని చెప్పటం దంతవేదాంతం. ఆచరణలో చూపటం అసలైన వేదాంతం. రుచికరమైన ఆహారం తినకూడదని కాదు దీని అర్థం. అది కావాలని కోరకూడదు. దొరికినది ఏది అయినా ఒకే భావనతో తినగలగాలి. అట్లాగే ఎట్లాగైనా ఉండగలగాలి. అంటే పట్టుపరుపులైనా, నేలమీదైనా ఒకే రకం గా నిద్రించటం వేదాంతి లక్షణం అయితే, రెండూ ఒకటే కనుక పట్టుపరుపులే కావాలనుకోవటం మెట్టవేదాంతం.
– డా.ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment