upanishads
-
బ్రహ్మం అంటే..?
పూర్వం ఆరుణి అనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన కుమారుడు శ్వేతకేతువు. అతనికి పన్నెండు సంవత్సరాలు నిండగానే తండ్రి అతన్ని పిలిచి: ‘‘శ్వేతకేతూ! నువ్వు ఏదైనా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేయవలసిన సమయం వచ్చింది. వెళ్ళి విద్యావంతుడివి కా’’ అన్నాడు. అప్పుడు శ్వేతకేతువు ఒక గురువును ఆశ్రయించి వేదాలన్నింటినీ కంఠస్థం చేశాడు. ఈ చదువుకే తనకు సర్వం తెలుసును అన్న అహంకారంతో, దర్పంతో ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి అతని అవివేకాన్నీ, ఆత్మవంచననూ గుర్తించి–‘‘శ్వేతకేతూ! ఆత్మ తత్త్వాన్ని గురించి మీ గురువు గారు ఏమి బోధించారు?’ అని అడిగాడు.‘‘నాన్నగారూ! నా గురువర్యులకు మీరు చెబుతున్న జ్ఞానాన్ని గురించి తెలియదనుకుంటాను. ఒకవేళ వారికి తెలిస్తే నాకు చెప్పి ఉండేవారే. కాబట్టి మీరే నాకు ఆ జ్ఞానబోధ చేయండి’’ అని అడిగాడు. తండ్రి సరేనని ఇలా ప్రారంభించాడు:‘‘చెబుతున్నాను విను శ్వేతకేతూ! అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు – ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూ΄ాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట’’ అని చెప్పాడు.అప్పుడు శ్వేతకేతువు ‘‘నాన్నగారూ! నిద్రపోతున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడు ?’’ అని అడిగాడు. అందుకు ఉద్దాలకుడు, ‘‘నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మతో తాదాత్మ్యం పొందుతాడు.ఆ స్థితిలో గతాన్ని గురించి గానీ, వర్తమానాన్ని గురించి గానీ తెలియదు. అంతా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. అజ్ఞానం వల్ల యథార్థాన్ని గుర్తించడం జరగదు!! మరణ కాలంలో అతని వాక్కులు మనస్సునందు లీనమవుతాయి. అతని మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో కలిసి΄ోతుంది. చిట్టచివరకు అది పరమశక్తిలో లీనమవుతుంది. ఆ శక్తి అతిసూక్ష్మమైనది. అది విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నది. అదే సత్యం. అదే ఆత్మ. అదే నీవు!! అది సింహం రూపంలో ఉండనీ! పెద్దపులిగా ఉండనీ! ఏ జంతువైనా కానీ! మనిషి ఐనా కానీ అది అనంత చైతన్యమనే సముద్రంలో కలిసి΄ోయిన తరువాత తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. వాటి రూ΄ాలూ, వాటి నామాలూ ఎగరగొట్టుకు పోతాయి’’ అని వివరించాడు ఉద్దాలకుడు. బ్రహ్మం అంటే ఏమిటి నాన్నగారూ అని అడిగాడు శ్వేతకేతువు. అందుకు సమాధానంగా ‘‘సర్వవ్యాపకంగా ఉండే ఏ తత్త్వంలో సర్వమూ కలిసిపోతాయో అది బ్రహ్మం. అది అద్వితీయం. అది సూక్ష్మం. అది సర్వవ్యాపకం. అదే ఆత్మ. అదే నీవు తత్త్వమసిహేశ్వేతకేతో!’’ అని వివరించాడు.కొడుకు ద్విగుణీకృత ఉత్సాహంతో, ‘‘ఆ ఆత్మతత్త్వాన్ని గురించి ఇంకా వివరించండి నాన్నగారూ!’’ అని అడిగాడు.!!‘‘నదులు అన్నీ సముద్రంలోకే ప్రవేశిస్తాయి. ఒక సముద్రం నుండి మరో సముద్రానికి ఆ నీరు ప్రయాణిస్తూ ΄ోతుంది. సూర్యరశ్మి ఆ నీటిని ఆవిరిగా మార్చి మేఘంగా తయారు చేస్తుంది. ఆ మేఘం వర్షించి మరల లోకానికి బలాన్ని ప్రసాదిస్తుంది. నదులు సముద్రంలోకి ప్రవేశించగానే ఈ నీళ్ళు ఫలానా నదిలోనివి అని విడదీయడం అసాధ్యం. అలాగే భిన్నభిన్నంగా కనిపించే ఈ జీవరాశులు బ్రహ్మంలో అంతర్లీనమైతే వాటిని విడదీసి అర్థం చేసుకోవడం కష్టం. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలో అంతర్భాగాలే. అదే సత్యం. అదే నీవు.’’!! అన్న తండ్రి వివరణతో శ్వేతకేతువులో జ్ఞాననేత్రం తెరచుకుంది. పితృభక్తికి గురుభక్తి తోడై వినమ్రతతో నమస్కరించాడు. – డి.వి.ఆర్. భాస్కర్(చాందోగ్యోపనిషత్తులోని ఉద్ధాలక – శ్వేతకేతు సంవాదం ఆధారంగా) -
'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..'
ఢిల్లీ: భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమున్నాయని చెప్పారు. ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న ఆయన.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...One Family, One Earth, One Future - this phrase is inspired by the Maha Upanishad and finds profound resonance in today's world not just as a timeless ideal but as an indictment of our times. If we are… pic.twitter.com/cW6qwELreb — ANI (@ANI) September 8, 2023 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు, ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం' అని గుటెరస్ అన్నారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...Let me begin by expressing my gratitude to India for the warm welcome and my hope that India's presidency at the G20 will help lead to the kind of transformative change our world so desperately needs in line… pic.twitter.com/7VFzfJWDA5 — ANI (@ANI) September 8, 2023 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ.. "భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని సభ్య దేశాలది. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ప్రపంచంలో భారతదేశ పాత్ర గొప్పది. వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ అవసరమని నేను నమ్ముతున్నాను.' అని గుటెరస్ అన్నారు. ఇదీ చదవండి: భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్ -
మెట్ట వేదాంతం..?
వేదాంతం అనే మాట తెలుసు అందరికీ, అర్థం సరిగ్గా తెలిసినా లేకపోయినా. ఇంతకీ ఈ మెట్టవేదాంతం ఏమిటి? కాని, ఈ మాటని చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. మాగాణి వేదాంతం మరొకటి ఉందా? దీనికీ, దానికీ తామరకి, మెట్టతామరకి మధ్య ఉన్నంత తేడా ఉంటుందా? తామర, మెట్టతామర రెండూ పూలు. అంతే వాటి సంబంధం. ఒకటి నీళ్ళలో, మరొకటి నేల మీద పెరుగుతాయి. కాని, వేదాంతానికి మెట్ట వేదాంతానికి ఉన్నది మరొక రకమైన సంబంధం. వేదాంతం ఒక శాస్త్రం. అన్ని వేదాలు క్షుణ్ణంగా చదివిన తరువాత గురువు సమీపంలో కూర్చుని వేదాలలోని మర్మాలు తెలుసుకుంటాడు శిష్యుడు. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఆ సంభాషణలని ఉపనిషత్తులు అని అంటారు. వేదాధ్యయనం అయిన తరువాత తెలుసుకునే భాగాలు కనుక వేదాంతంగా పరిగణించబడినాయి. సమస్తం భగవంతుడి స్వరూపంగా భావించ గలగటం అప్పటికి అభ్యాసం అయి ఉంటుంది. అందువల్ల వేదాంతం వంటపట్టిన వారు సామాన్య భక్తులలాగా పూజాదికాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం సర్వవ్యాపి అయిన పరబ్రహ్మతత్త్వాన్ని ధ్యానం చేస్తూ, వివేచన చేస్తూ, అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు చెప్పే మాటలని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒకటి, రెండు మాటలని పట్టుకుని తమకి అనుకూలంగా వాడుకుంటారు కొంతమంది. కొంతమంది తెలియక కూడా ఆ విధంగా చేస్తారు. అంటే వేదాంత పరిభాషని తన ప్రవర్తనని సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు మనకి అడుగడుగునా, కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘‘అన్నమైతేనేమిరా? మరి, సున్నమైతే నేమిరా?’’ అని అన్నానికి సున్నానికి తేడా లేదని అంతా సమానమేనని ఇంటిముందు అడుక్కునేందుకు వచ్చిన సన్న్యాసి పాడుతాడు. ‘అబ్బా ఎంత వైరాగ్యం!’ అని అనుకుంటూ ఉంటే ఇట్లా కొనసాగిస్తాడు – ‘‘అందుకే ఈ పాడు పొట్టకి అన్నమే వేదాము రా! పప్పన్నమే వేదాము రా! నెయ్యన్నమే వేదామురా! పెరుగన్నమే వేదాము రా!’’ అంటాడు. అంతటితో ఆగడు. ‘‘చీరలైతేనేమిరా? మరి, నారలైతే నేమిరా? అందుకే ఈ పాడు ఒంటికి చీరలే కడదామురా! పట్టుచీరలే కడదామురా!’’ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ పాట. ఇటువంటి వాటిని తత్త్వాలు అంటారు. తన శక్తిమేరకు పనిచేసి ఫలితం ఏమైనా పట్టించుకోకపోవటం వేదాంతి అయిన వాడు చేసే పని. కాని, వేదాంత ప్రసంగాలు విని, విని కొన్ని ఊతపదాలు మనకి అలవాటై పోయాయి. ‘‘మన చేతుల్లో ఏముంది?’’,‘‘ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది’’ అంటూ చేతులు ముడుచుకుని కూర్చునేవారు, తమ బద్ధకానికి, చేతకానితనానికి వేదాంతపు ముసుగు వేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి వల్లనే మన ధర్మానికి, వేదాలకి, వేదాంతానికి చెడ్డపేరు వస్తోంది. మనం మెట్టవేదాంతులం కాకుండా ఉంటే చాలు. అటువంటి వారి నుండి దూరంగా ఉండటం మంచిది. అన్నానికి సున్నానికి తేడా లేదనటం వేదాంతం. అందుకని రకరకాల అన్నాలు వేద్దామనే నిర్ణయానికి రావటం మెట్టవేదాంతం. ఈ రెండింటికి తేడా లేదని చెప్పటం దంతవేదాంతం. ఆచరణలో చూపటం అసలైన వేదాంతం. రుచికరమైన ఆహారం తినకూడదని కాదు దీని అర్థం. అది కావాలని కోరకూడదు. దొరికినది ఏది అయినా ఒకే భావనతో తినగలగాలి. అట్లాగే ఎట్లాగైనా ఉండగలగాలి. అంటే పట్టుపరుపులైనా, నేలమీదైనా ఒకే రకం గా నిద్రించటం వేదాంతి లక్షణం అయితే, రెండూ ఒకటే కనుక పట్టుపరుపులే కావాలనుకోవటం మెట్టవేదాంతం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
సర్వాంతర్యామితో అభేదాన్ని సాధించవచ్చు
ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఈశ్వరుడు సర్వాంతర్యామి. మరో రకంగా చెప్పుకోవాలంటే ఆ శక్తి అఖండమైనది. ఎక్కడ కూడా ఖండనలు కానీ, ఖాళీలు కానీ లేకుండా నిండుగా వ్యాప్తి చెంది ఉన్నది. సర్వాంతర్యామి అనడానికి, అఖండమైనదని చెప్పడానికి తేడా ఏంటంటే నాలో, నీలో, అన్నింట్లో ఆయనే ఉన్నాడనడంలో భౌతిక పదార్థాలు లేని ప్రాంతంలో సాధకుడు ఈశ్వరుడిని సులభంగా గమనించలేడు. శూన్యంలోనూ, మనలోనూ అప్రతిహతంగా ఆ శక్తి ఏలాంటి వ్యవధి లేకుండా ఉన్నదనే విషయం అంత సులభంగా అర్థంకాదు. ఆ శక్తి అఖండమైనదని తెలపడం వల్ల కంటికి కనిపించిన ప్రాంతం నుండి, కనిపించని ప్రాంతమంతా నిరంతరంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆ శక్తి అత్యంత సాంద్రతను కలిగి ఉంటుంది. ఆ సాంద్రతను కొలవడానికి పరికరాలు గానీ, కొలతలు గాని లేవు. ఆ అనంతశక్తిలో నుండి ఉద్భవించిన పదార్థాలు ఎంత బరువైనవైనా, ఎంతటి సాంద్రతను కలిగి ఉన్నా ఆ సాంద్రత ముందు దిగదుడుపే. కాబట్టే, ఆ శక్తితో పోలిస్తే అత్యంత తేలికైన గ్రహాలు, నక్షత్రాలు తదితర ఖగోళ పదార్థాలన్నీ తమతమ స్థానాలలో ఏ ఆధారం లేకుండా తేలుతూ తిరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని మనం సముద్రంలో పుట్టి, పెరిగి, ఈదులాడి అందులోనే మరణించే సముద్ర జీవులతో పోల్చవచ్చు. సముద్ర జీవుల కన్నా సముద్రం ఎంతో సాంద్రత కలిగి ఉన్నది కాబట్టి, ఆ జీవులు సముద్రజలాల్లో స్వేచ్ఛగా, అలవోకగా ఈదగలుగుతున్నాయి. ఆ విషయాన్ని సాధకుడు గుర్తెరగాలి. తాను ఆ అఖండత్వంలో ఊపిరి పోసుకున్న ఒకానొక చిన్న భాగమని, తనలాగే ఈ కనిపించే ప్రకృతి కూడా ఒకానొక భాగమేనని అర్థం చేసుకోవాలి. ఆ అఖండశక్తిలో పుట్టిన పదార్థాల భౌతిక రూపాలు వేరైనా, ఆ భౌతిక రూపాలలో, వాటి నడుమ, చుట్టూ నిరంతర ప్రవాహినిగా విరాజిల్లుతున్న చైతన్యమే అన్నింటికీ హేతువని గుర్తెరగాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మస్తిష్కంలో సుస్థిరమైతే మానసిక వైకల్యాలు నశించిపోయి, మనసునిండా ఏకత్వం సాకారమవుతుంది. ఏ జీవినందైనా, నిర్జీవి నందైనా లేక శూన్యమందైనా ఆ అనంతశక్తి అఖండత్వమే గోచరిస్తుంది. దృష్టిలో భేదభావం ఉండదు. వాక్కులో అపశబ్దం దొర్లదు. చేతలో అధర్మం కలగదు. నడతలో తడబాటు కలగదు. వర్ణమనీ, కులమనీ, మతమనీ ఆలోచనలు రావు. ఏ జీవి పట్లా నిర్లక్ష్యధోరణి తలెత్తదు. ప్రకృతిపై అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. మోములో, ఆలోచనలలో ఆనందం విస్తరించి, స్థిర పడుతుంది. గీతలో చెప్పినట్టుగా ఆత్మను శస్త్రాలు ఖండించలేవు, అగ్ని దహింపలేదు, వర్షం తడపలేదు. కానీ, భేదభావాలు, అరిషడ్వర్గాలు దహింపగలుగుతాయి, ఖండించగలుగుతాయి. అందుకే, నిరంతర అఖండ ప్రవాహిని అయిన ఆ చైతన్యాన్ని మన మనసుల నిండుగా నింపుకున్నట్లయితే ఈ భేదభావాలు నశించిపోతాయి. తల్లి, తన పురిటి బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు, సాధకుడు ఈ చరాచర ప్రపంచం మొత్తాన్ని తన ఆలోచనలతో సొంతం చేసుకోగలుగుతాడు. ఏ కొంత భూమికో అధిపతిగానో లేక ఏ కొద్దిమందికో చెందిన వాడుగా కాకుండా, ఈ జగత్తు మొత్తం తనదేనని, అంతా తానేననే ఆనందంతో బ్రహ్మమై వెలుగొందుతాడు. సర్వాంతర్యామితో అభేదాన్ని సాధిస్తాడు. – గిరిధర్ రావుల -
ఉపనిషత్లతో సమాజానికి దిశానిర్దేశం
ఏలూరు(ఆర్ఆర్పేట) : భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఉపనిషత్లపై అవగాహన కలిగి ఉండాలని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు అన్నారు. ఆదివారం స్థానిక పత్తేబాద శ్రీ సాయిమందిరంలో ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ వైహెచ్ రామకృష్ణ రచించిన ‘ఉపనిషత్ ఉద్యానవనం’ అనే గ్రంథావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపనిషత్లు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. అనంతరం గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం జీఎస్వీ కృష్ణారావు, సీహెచ్ పూర్ణచంద్రరావు, డి.జయప్రకాష్ టి.వెంకట సుబ్బారావు, పసుమర్తి రత్తయ్య శర్మ, ఎం.గోపాల కృష్ణయ్య పాల్గొన్నారు.