పూర్వం ఆరుణి అనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన కుమారుడు శ్వేతకేతువు. అతనికి పన్నెండు సంవత్సరాలు నిండగానే తండ్రి అతన్ని పిలిచి: ‘‘శ్వేతకేతూ! నువ్వు ఏదైనా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేయవలసిన సమయం వచ్చింది. వెళ్ళి విద్యావంతుడివి కా’’ అన్నాడు.
అప్పుడు శ్వేతకేతువు ఒక గురువును ఆశ్రయించి వేదాలన్నింటినీ కంఠస్థం చేశాడు. ఈ చదువుకే తనకు సర్వం తెలుసును అన్న అహంకారంతో, దర్పంతో ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి అతని అవివేకాన్నీ, ఆత్మవంచననూ గుర్తించి–‘‘శ్వేతకేతూ! ఆత్మ తత్త్వాన్ని గురించి మీ గురువు గారు ఏమి బోధించారు?’ అని అడిగాడు.
‘‘నాన్నగారూ! నా గురువర్యులకు మీరు చెబుతున్న జ్ఞానాన్ని గురించి తెలియదనుకుంటాను. ఒకవేళ వారికి తెలిస్తే నాకు చెప్పి ఉండేవారే. కాబట్టి మీరే నాకు ఆ జ్ఞానబోధ చేయండి’’ అని అడిగాడు.
తండ్రి సరేనని ఇలా ప్రారంభించాడు:
‘‘చెబుతున్నాను విను శ్వేతకేతూ! అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు – ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూ΄ాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట’’ అని చెప్పాడు.
అప్పుడు శ్వేతకేతువు ‘‘నాన్నగారూ! నిద్రపోతున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడు ?’’ అని అడిగాడు. అందుకు ఉద్దాలకుడు, ‘‘నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మతో తాదాత్మ్యం పొందుతాడు.
ఆ స్థితిలో గతాన్ని గురించి గానీ, వర్తమానాన్ని గురించి గానీ తెలియదు. అంతా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. అజ్ఞానం వల్ల యథార్థాన్ని గుర్తించడం జరగదు!! మరణ కాలంలో అతని వాక్కులు మనస్సునందు లీనమవుతాయి. అతని మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో కలిసి΄ోతుంది. చిట్టచివరకు అది పరమశక్తిలో లీనమవుతుంది. ఆ శక్తి అతిసూక్ష్మమైనది. అది విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నది. అదే సత్యం. అదే ఆత్మ. అదే నీవు!! అది సింహం రూపంలో ఉండనీ! పెద్దపులిగా ఉండనీ! ఏ జంతువైనా కానీ! మనిషి ఐనా కానీ అది అనంత చైతన్యమనే సముద్రంలో కలిసి΄ోయిన తరువాత తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. వాటి రూ΄ాలూ, వాటి నామాలూ ఎగరగొట్టుకు పోతాయి’’ అని వివరించాడు ఉద్దాలకుడు.
బ్రహ్మం అంటే ఏమిటి నాన్నగారూ అని అడిగాడు శ్వేతకేతువు. అందుకు సమాధానంగా ‘‘సర్వవ్యాపకంగా ఉండే ఏ తత్త్వంలో సర్వమూ కలిసిపోతాయో అది బ్రహ్మం. అది అద్వితీయం. అది సూక్ష్మం. అది సర్వవ్యాపకం. అదే ఆత్మ. అదే నీవు తత్త్వమసిహేశ్వేతకేతో!’’ అని వివరించాడు.
కొడుకు ద్విగుణీకృత ఉత్సాహంతో, ‘‘ఆ ఆత్మతత్త్వాన్ని గురించి ఇంకా వివరించండి నాన్నగారూ!’’ అని అడిగాడు.!!
‘‘నదులు అన్నీ సముద్రంలోకే ప్రవేశిస్తాయి. ఒక సముద్రం నుండి మరో సముద్రానికి ఆ నీరు ప్రయాణిస్తూ ΄ోతుంది. సూర్యరశ్మి ఆ నీటిని ఆవిరిగా మార్చి మేఘంగా తయారు చేస్తుంది. ఆ మేఘం వర్షించి మరల లోకానికి బలాన్ని ప్రసాదిస్తుంది. నదులు సముద్రంలోకి ప్రవేశించగానే ఈ నీళ్ళు ఫలానా నదిలోనివి అని విడదీయడం అసాధ్యం. అలాగే భిన్నభిన్నంగా కనిపించే ఈ జీవరాశులు బ్రహ్మంలో అంతర్లీనమైతే వాటిని విడదీసి అర్థం చేసుకోవడం కష్టం. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలో అంతర్భాగాలే. అదే సత్యం. అదే నీవు.’’!! అన్న తండ్రి వివరణతో శ్వేతకేతువులో జ్ఞాననేత్రం తెరచుకుంది. పితృభక్తికి గురుభక్తి తోడై వినమ్రతతో నమస్కరించాడు.
– డి.వి.ఆర్. భాస్కర్
(చాందోగ్యోపనిషత్తులోని ఉద్ధాలక – శ్వేతకేతు సంవాదం ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment