టైటిల్: డ్రింకర్ సాయి (బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్)
నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, స్‌ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి,తదితరులు
నిర్మాణ సంస్థలు: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి
సంగీతం: శ్రీవసంత్
లిరిక్స్: చంద్రబోస్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
విడుదల తేది: డిసెంబర్ 27, 2024
ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బూతు డైలాగ్స్‌తో పాటు మంచి ఎమోషన్‌తో కూడా ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘డ్రింకర్ సాయి’పై బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 27) వచ్చిన ఈ చిన్న చిత్రం ఎలా ఉంది? ‘డ్రింకర్ సాయి’దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మత్తు ఎక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
సాయి అలియాస్ డ్రింకర్ సాయి(ధర్మ) బాగా ధనవంతుడు. పెరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం..అరెస్ట్ అయితే అతని అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగిఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగీ(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగీనే అని తెలుసుకుంటాడు. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు? తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా? అనేదే మితగా కథ.
ఎలా ఉందంటే..
హీరో తాగుతూ జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం..ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం..ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్‌ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివరిలో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమకథను ప్లస్ పాయింట్.
అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇదొక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా..ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివరిలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు.
హీరో హీరోయిన్ వెంబడి పడడం.. ఆమె ఛీకొట్టడం.. చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. సాఫీగా సాగుతున్న లవ్‌స్టోరీకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పిల్లోడితో చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ సాగుతుంది. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథ, కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్‌ని ఊగించేవాడు.
ఎవరెలా చేశారంటే..
ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. పాటలు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment