Brahma
-
బ్రహ్మం అంటే..?
పూర్వం ఆరుణి అనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన కుమారుడు శ్వేతకేతువు. అతనికి పన్నెండు సంవత్సరాలు నిండగానే తండ్రి అతన్ని పిలిచి: ‘‘శ్వేతకేతూ! నువ్వు ఏదైనా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేయవలసిన సమయం వచ్చింది. వెళ్ళి విద్యావంతుడివి కా’’ అన్నాడు. అప్పుడు శ్వేతకేతువు ఒక గురువును ఆశ్రయించి వేదాలన్నింటినీ కంఠస్థం చేశాడు. ఈ చదువుకే తనకు సర్వం తెలుసును అన్న అహంకారంతో, దర్పంతో ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి అతని అవివేకాన్నీ, ఆత్మవంచననూ గుర్తించి–‘‘శ్వేతకేతూ! ఆత్మ తత్త్వాన్ని గురించి మీ గురువు గారు ఏమి బోధించారు?’ అని అడిగాడు.‘‘నాన్నగారూ! నా గురువర్యులకు మీరు చెబుతున్న జ్ఞానాన్ని గురించి తెలియదనుకుంటాను. ఒకవేళ వారికి తెలిస్తే నాకు చెప్పి ఉండేవారే. కాబట్టి మీరే నాకు ఆ జ్ఞానబోధ చేయండి’’ అని అడిగాడు. తండ్రి సరేనని ఇలా ప్రారంభించాడు:‘‘చెబుతున్నాను విను శ్వేతకేతూ! అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు – ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూ΄ాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట’’ అని చెప్పాడు.అప్పుడు శ్వేతకేతువు ‘‘నాన్నగారూ! నిద్రపోతున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడు ?’’ అని అడిగాడు. అందుకు ఉద్దాలకుడు, ‘‘నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మతో తాదాత్మ్యం పొందుతాడు.ఆ స్థితిలో గతాన్ని గురించి గానీ, వర్తమానాన్ని గురించి గానీ తెలియదు. అంతా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. అజ్ఞానం వల్ల యథార్థాన్ని గుర్తించడం జరగదు!! మరణ కాలంలో అతని వాక్కులు మనస్సునందు లీనమవుతాయి. అతని మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో కలిసి΄ోతుంది. చిట్టచివరకు అది పరమశక్తిలో లీనమవుతుంది. ఆ శక్తి అతిసూక్ష్మమైనది. అది విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నది. అదే సత్యం. అదే ఆత్మ. అదే నీవు!! అది సింహం రూపంలో ఉండనీ! పెద్దపులిగా ఉండనీ! ఏ జంతువైనా కానీ! మనిషి ఐనా కానీ అది అనంత చైతన్యమనే సముద్రంలో కలిసి΄ోయిన తరువాత తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. వాటి రూ΄ాలూ, వాటి నామాలూ ఎగరగొట్టుకు పోతాయి’’ అని వివరించాడు ఉద్దాలకుడు. బ్రహ్మం అంటే ఏమిటి నాన్నగారూ అని అడిగాడు శ్వేతకేతువు. అందుకు సమాధానంగా ‘‘సర్వవ్యాపకంగా ఉండే ఏ తత్త్వంలో సర్వమూ కలిసిపోతాయో అది బ్రహ్మం. అది అద్వితీయం. అది సూక్ష్మం. అది సర్వవ్యాపకం. అదే ఆత్మ. అదే నీవు తత్త్వమసిహేశ్వేతకేతో!’’ అని వివరించాడు.కొడుకు ద్విగుణీకృత ఉత్సాహంతో, ‘‘ఆ ఆత్మతత్త్వాన్ని గురించి ఇంకా వివరించండి నాన్నగారూ!’’ అని అడిగాడు.!!‘‘నదులు అన్నీ సముద్రంలోకే ప్రవేశిస్తాయి. ఒక సముద్రం నుండి మరో సముద్రానికి ఆ నీరు ప్రయాణిస్తూ ΄ోతుంది. సూర్యరశ్మి ఆ నీటిని ఆవిరిగా మార్చి మేఘంగా తయారు చేస్తుంది. ఆ మేఘం వర్షించి మరల లోకానికి బలాన్ని ప్రసాదిస్తుంది. నదులు సముద్రంలోకి ప్రవేశించగానే ఈ నీళ్ళు ఫలానా నదిలోనివి అని విడదీయడం అసాధ్యం. అలాగే భిన్నభిన్నంగా కనిపించే ఈ జీవరాశులు బ్రహ్మంలో అంతర్లీనమైతే వాటిని విడదీసి అర్థం చేసుకోవడం కష్టం. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలో అంతర్భాగాలే. అదే సత్యం. అదే నీవు.’’!! అన్న తండ్రి వివరణతో శ్వేతకేతువులో జ్ఞాననేత్రం తెరచుకుంది. పితృభక్తికి గురుభక్తి తోడై వినమ్రతతో నమస్కరించాడు. – డి.వి.ఆర్. భాస్కర్(చాందోగ్యోపనిషత్తులోని ఉద్ధాలక – శ్వేతకేతు సంవాదం ఆధారంగా) -
ధ్యానం.. ఆవాహనం
ఒత్తిడి సహా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే జ్ఞానం ఉన్నా ధ్యానమార్గం వైపు ప్రయాణించే తీరిక, సమయం లేక ఇబ్బంది పడుతున్నవారి సమక్షానికి ధ్యానమే తరలివస్తోంది. నగరంలోని ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, కళాశాల ప్రాంగణాల్లో ఉచితంగా ధ్యానాభిరుచిని పరిచయం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్‌కు శ్రీకారం చుట్టింది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ.. విహారం నుంచి ఆహారం దాకా కాదేదీ ఆ‘వాహనానికి’ అనర్హం అన్నట్టు సిటీలో ‘వీల్స్’ వీరవిహారం చేస్తున్నాయి. అదే క్రమంలో నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని నెలలుగా 3వేల మందికి పైగా తమ ధ్యాన చక్రాలు పలకరించాయని అంటున్నారు ఆధ్యాత్మిక వేదిక ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు. ధ్యాన మార్గం వైపు మళ్లించేందుకు..నగరంలో చదువుతో మొదలుపెడితే... ఉద్యోగాలు, వ్యాపకాల వంటివన్నీ ఒత్తిడి కారకాలుగా మారుతున్నాయి. ఈ ఒత్తిడి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. దీనికి అత్యుత్తమ పరిష్కారం ధ్యానం.. అయితే సమయాభావం కావచ్చు, తగినంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు... చాలా మంది ఈ పరిష్కారాన్ని అందుకోలేకపోతున్నారు. వారి కోసమే ఈ మెడిటేషన్ ఆన్ వీల్స్‌ను డిజైన్ చేశామని వీరు చెబుతున్నారు. ఆధ్యాత్మిక తోవ... ఈ వాహనంతో పాటు బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులు కొందరు ప్రయాణిస్తుంటారు. నగరవాసుల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న ప్రాంతానికే వెళ్లి వాహనం ద్వారా ధ్యానం చేసే అవకాశాన్ని కలి్పస్తారు. దీనికి ఎటువంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఆ వాహనానికి అవసరమైన పార్కింగ్ సమకూరిస్తే చాలు. కనీసం 2 గంటల నుంచి అత్యధికంగా 4 గంటల దాకా సేవలు అందిస్తారు. వాహనంలో ఒక్కో బ్యాచ్‌కు 10 మంది వరకూ హాజరు కావచ్చు. ధ్యానం అనంతరం వారి అనుభూతిని తెలుసుకుని, ఆసక్తి, అవసరాన్ని బట్టి వారికి ఆ తర్వాత ఉచిత ధ్యాన తరగతుల్లో పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తారు. ఐటీ కంపెనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ దాకా.. నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏ విద్యా సంస్థ అయినా, ఐటీ కంపెనీ అయినా, గేటెడ్ కమ్యూనిటీ అయినా కార్పొరేట్ సంస్థలైనా...ఏవైనా సరే ఈ ధ్యాన వాహన సేవలు కావాలంటే బ్రహ్మకుమారీస్ను సంప్రదించవచ్చు. అవసరమైతే మరికొన్ని అదనపు రోజులు కూడా వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు. కులమతాలకు అతీత సేవ... మెడిటేషన్ ఆన్ వీల్స్ అనేది దేశంలోనే తొలిసారి. ఈ వాహనం ద్వారా కులమతాలకు అతీతమైన «ఉచిత ద్యాన సేవ అందించనున్నాం. ఇప్పటికే గత 8నెలలుగా మూడు నుంచి నాలుగువేల మందికి మా వాహన సేవలు అందాయి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించాలని యోచిస్తున్నాం. –శివాణి, బ్రహ్మకుమారీస్ -
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం!
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసారయాత్ర కొనసాగిస్తూనే, జపతపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే, భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి, విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురూ చంటిబిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి, తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లడంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని, అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు. త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, ‘నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా?’ అని అడిగాడు. ‘స్వామీ! మన పుత్రులు ఇంకా పెద్దవాళ్లు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్లి, ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వానప్రస్థానానికి వెళ్లిపోదాం’ అని చెప్పింది. అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరడానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి, దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ, అతడికి సహాయంగా వెళ్లవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు. అత్రి మహర్షి అందుకు ‘సరే’నని సమ్మతించి, పృథు చక్రవర్తి కొడుకుతో కలసి యాగాశ్వం వెంట బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగవైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి, యాగాశ్వాన్ని అపహరించుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగాశ్వాన్ని అపహించుకుపోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు. అప్పుడు అత్రి మహర్షి, ‘కుమారా! యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిస్సంశయంగా నువ్వు ఇంద్రుడిని ఎదిరించు’ అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శరపరంపరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి, పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా, ఇంద్రుడు మాయరూపంలో మళ్లీ యాగాశ్వాన్ని అపహరించాడు. పృథుచక్రవర్తి కుమారునికి యాగాశ్వం ఎలా అదృశ్యమైందో అర్థంకాలేదు. కంగారు పడ్డాడు. అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్యదృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్లీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. ‘నాయనా! ఇంద్రుడే మళ్లీ యాగాశ్వాన్ని తస్కరించుకుపోయాడు’ అని రాకుమారుడితో చెప్పాడు. కోపోద్రిక్తుడైన పృథు కుమారుడు ఇంద్రుడిని తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టి, మళ్లీ పారిపోయాడు. ఈసారి పృథు కుమారుడు యాగాశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగినదంతా చెప్పాడు. యాగాశ్వ సరంక్షణలో అత్రి మహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి, కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ‘ఒక మానవమాత్రుడిని ఇంతగా పొగడటం తగదు’ అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ‘ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని, దీనిలోని ధర్మాధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు’ అన్నాడు. కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలను వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ‘ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణుః పృథివీపతిః అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే’ అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి, అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి, ఆయనకు కోరిన ధనరాశులనిచ్చి, సాదరంగా సాగనంపాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: అమ్మా, నాన్న ఆనంద విహారం -
‘బ్రహ్మ కన్ను’ గురించి తెలుసా.. ఆ శాపం గురించి ఎప్పుడైనా విన్నారా?
కోహినూర్.. ప్రపంచంలోనే ఫేమస్ వజ్రం. బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న ఈ వజ్రం మనకు తిరిగిచ్చేయాలన్న డిమాండ్లు ఎప్పటికప్పుడు వస్తునే ఉంటాయి. ఆ మధ్య రాణి చనిపోయినప్పుడు కూడా ఇవి వెల్లువెత్తాయి. ఇదే తరహాలో మన దేశం నుంచి తరలిపోయిన మరో పెద్ద వజ్రం ‘బ్రహ్మ కన్ను (ఐ ఆఫ్ బ్రహ్మ)’ గురించి మీకు తెలుసా? అది ఇచ్చిన ‘శాపం’ గురించి మీరెప్పుడైనా విన్నారా? లేదా.. అయితే.. ఈ వివరాలు మీ కోసమే.. అది అరుదైన నలుపు రంగు వజ్రం. ‘ది బ్లాక్ ఓర్లోవ్ డైమండ్’గా పిలుస్తున్న దీని బరువు 67.69 క్యారెట్లు. ప్రపంచంలోని నలుపు రంగులోని అతిపెద్ద వజ్రాల్లో దీనిది ఏడో స్థానం. పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి)లోని ఉన్న ఓ ఆలయంలో ఉన్న బ్రహ్మ దేవుడి విగ్రహం నుదుటిపై ఈ వజ్రం ఉండేదట. అందుకే దీనిని ‘బ్రహ్మ కన్ను’గా పిలిచేవారు. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఓ సన్యాసి బ్రహ్మ దేవుడి విగ్రహం నుంచి ఈ వజ్రాన్ని పెకలించి, దొంగిలించుకెళ్లాడు. దీనితో ఈ వజ్రం ఎవరివద్ద ఉంటే వారికి కీడు జరిగేలా బ్రహ్మ దేవుడు శపించాడన్నది అప్పటి కథనం. ఈ క్రమంలోనే వజ్రాన్ని దొంగిలించిన సన్యాసి కొంతకాలానికే హత్యకు గురయ్యాడని.. క్రమంగా ఇది రష్యాకు చేరిందని చెబుతారు. ముగ్గురి ఆత్మహత్యలతో.. భారతదేశం నుంచి రష్యాకు చేరిన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం చేతులు మారుతూ యూరప్‌కు చేరుకుంది. 1932లో యూరోపియన్ వజ్రాల డీలర్ జేడబ్ల్యూ పారిస్ ఈ వజ్రాన్ని కొని అమెరికాకు తీసుకెళ్లాడు. కొద్దిరోజులకే ఓ పెద్ద భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత రష్యా నుంచి ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు వచ్చి తలదాచుకుంటున్న రష్యా రాజకుమార్తెలు లియోనిలా బరియటిన్స్కీ, నదియా వ్యేగిన్ ఓర్లోవ్ల చేతికి ఈ వజ్రం చేరింది. ఈ ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వజ్రాన్ని చివరిగా ధరించిన రాజకుమార్తె పేరిటే దీనికి ‘బ్లాక్ ఓర్లోవ్’ అని పేరువచ్చింది. అది శాపగ్రస్తమైనదిగా ప్రచారమైంది. శాపం పోతుందని ముక్కలు చేసి 1950వ దశకంలో చార్లెస్ విల్సన్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అసలైన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం బరువు ఏకంగా 195 క్యారెట్లు. అయితే దీనికి ఉన్న శాపం పోతుందన్న ఉద్దేశంతో.. మూడు ముక్కలు చేయించాడు. అందులో పెద్ద ముక్క ఇప్పుడు ‘బ్లాక్ ఓర్లోవ్’ (67.69 క్యారెట్లు)గా చలామణీ అవుతోంది. మిగతా రెండు ముక్కలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. భయంతో ‘రేటు’ మారుతూ.. ‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రం శాపగ్రస్తమైన దన్న ప్రచారంతో దాని విలువ పెరు గుతూ తగ్గుతూ వచ్చింది. విల్సన్ 1969లో ‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రాన్ని గుర్తు తెలియని వ్యక్తికి రూ.2.45 కోట్లకు అమ్మాడు. తర్వాత చాలాకాలం ఎవరి కంటా పడ లేదు. 1990లో ఈ వజ్రం సదబీజ్ సంస్థలో వేలానికి వచ్చినప్పుడు రూ.80 లక్షలే పలికింది. కానీ 1995లో జరిగిన వేలంలో ఏకంగా రూ.12.25 కోట్లకు అమ్ముడైంది. ఆ వ్యక్తి నుంచి 2004లో అమెరికన్ ధనవంతుడు డెన్నిస్ పెటిమెజాస్ ఈ వజ్రాన్ని కొన్నా ధర ఎంతో బయటికి రాలేదు. 2006లో ఆయన దీనిని రూ.2.9 కోట్లకు అమ్మే శాడు. ఇటీవలే ఈ వజ్రాన్ని న్యూయార్క్, లండన్లలో జరిగిన నేచురల్ హిస్టరీ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. అయితే, భారత్‌లో ఇప్పటి వరకూ నల్ల వజ్రాలు దొరకనందున.. ‘బ్లాక్ ఓర్లోవ్’వజ్రం ఇక్కడిది కాదనే వాదనా ఉంది. వజ్రాల వ్యాపారంలో ఉన్న వారు మాత్రం ఇది భారత్ నుంచే వచ్చిందని చెబుతున్నారు. ఆ శాపమూ వాస్తవమే అని అంటున్నారు. -
శ్రీ గురుదత్తాత్రేయుడు
లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపజేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. ఈయన అవతార వర్ణన నారదపురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూతగీత, జీవన్ముక్తిగీత తదితరాలలో కనపడుతుంది. అత్రికుమారా.... దత్తాత్రేయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన సన్నివేశమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు! ‘దత్తా’ అనే పదానికి ‘సమర్పించిన’ అని అర్థం. త్రిమూర్తులు అత్రి–అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రిపుత్రుడు కాబట్టి ‘ఆత్రేయ’ అయింది. త్రిమూర్తులే శిరస్సులై... దిక్కులనే అంబరముగా చేసుకుని, భక్తులనుద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడుతలలలో నడిమి శిరస్సు విష్ణువుదికాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి–నిష్కామబుద్ధి దేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. ఒకానొక సందర్భంలో పద్మాసనుడై, ధ్యానముద్రలో ప్రకాశిస్తూ యోగవిద్యను సాంకృతిమహర్షికి ఉపదేశించి దానిని భోగ–విలాసాలకు ఉపయోగించకూడదని, పరబ్రహ్మను పొందడమే యోగం అంతిమలక్ష్యం అని వివరిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి, నిష్కామబుద్ధి, యోగవిద్య ఇవన్ని దత్తాత్రేయుని ఉపదేశాల్లో ప్రధానమైనవి. దత్తజయంతి దత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే దత్తజయంతిగా జరుపుకుంటారు.‘దిగంబరా దత్త దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూతగీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. త్రిపురారహస్యం పేరుతో పరశురాముడికి త్రిపురసుందరీ తత్త్వాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయుడు. ఉపాసకులకు ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ భిస్తుంది. దత్తుడి ఆరాధన పితృదోషాలను తొలగిస్తుంది. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే! – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
కాలభైరవం భజే
ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరనే సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే ఐదు ముఖాలు ఉంటాయి. ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘బ్రహ్మం ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మాన్ని కదా’ అన్నాడు. అపుడు బ్రహ్మ వినకుండా వితండ వాదన చేయడంతో ఈశ్వరుడి భృకుటి నుంచి ఒక వింతకాంతి బయల్దేరి, చూస్తుండగానే ఒక నల్లని, భయంకర దిగంబర రూపాన్ని సంతరించుకుంది. ఆ ఆకారమే కాలభైరవుడు. శివుడి ఆజ్ఞమేరకు భైరవుడు బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేశాడు. దాంతో బ్రహ్మలోని తామస గుణం నశించి, ‘ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి నన్ను కాపాడు’ అన్నాడు. శంకరుడు శాంతించాడు. అయితే బ్రహ్మ తల గిల్లేసిన కాలభైరవుని చేతినుంచి ఎంత యత్నించినా ఆ తల ఊడిపడక పోవడంతో విష్ణువు కాలభైరవునితో ‘‘కాలభైరవా! నీవు బ్రహ్మ తలను తెంపినందున నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. నీవు కాశీనగరానికి వెళ్లి, అక్కడి విశ్వనాథుని సేవించు’’ అని చెప్పాడు. ఈ మేరకు కాశీకి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే.. నేటి కాశీక్షేత్రంలోని ‘కపాల మోక్షతీర్థం’. కాశీలో కాలభైరవుడు విశ్వనాథుడిని భక్తితో పూజించి తరించాడు. శివుడు అతని భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. ‘‘కాలభైరవా! ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినపుడు ఎవరు నీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపాన్ని తీసేసే శక్తిని నేను నీకు ఇస్తున్నాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక ‘అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపాలను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్నసంతర్పణ చేయడం ఆనవాయితీ. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదం తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయానికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరాలను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. ‘మేము కాశీ వెళ్ళాము.. మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. వాళ్ళు శత్రుబాధ, పిశాచ బాధ లేకుండా ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉంటారు. -
కోరని వరం
ఎవరైతే కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని వైపుకు సాగుతారో.. సముద్రం వంటి విశాలమైన మనసున్న అటువంటి వారిని.. నదులు సముద్రంలో కలిసినట్లుగా నదులవంటి విషయభోగాలు వెతుక్కుంటూ వస్తాయి. ఒకసారి అన్నదమ్ములైన రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తనకు ఎవరి వలనా మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మ ‘అది అసాధ్యం. దీనికి బదులు వేరే ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. రావణుడు ఆలోచించాడు– నరులు, వానరాలు అల్పప్రాణులు, బలం లేని వారు కనుక వారి వలన మరణం ఎలాగూ రాదు. బలవంతులైన యక్షులు, రాక్షసులు, దేవతలు మొదలైన వారితోనే మరణం లేకుండా వరం కోరుకుంటే చాలు అనుకున్నాడు. బ్రహ్మని కూడా అదే కోరాడు. ‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు కూడా చావు లేని వరాన్ని పొందాలనే ఉద్దేశంతోనే తపస్సు చేసినా చివరకు బుద్ధి భ్రమించి ‘తనకు చక్కగా నిద్ర రావాలి’ అనే వరం కోరుకున్నాడు. మహా సాత్వికుడైన విభీషణుడు రావణ కుంభకర్ణులవలె తనకు ఎప్పుడూ మరణం రాకూడదని ఆశపడలేదు. ‘ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా నా బుద్ధి చెడు దారి పట్టకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని మరవకుండా ఉండునట్లు వరాన్ని ఇస్తే చాలు. ఇదొక్కటే నా కోరిక’ అన్నాడు. విభీషణుడి మాటలను విని సంతోషపడిన బ్రహ్మదేవుడు రాక్షసుడిగా జన్మించి ఉత్తమమైన సంస్కారం లేకపోయినా, నీ బుద్ధి మాత్రం అధర్మం వైపు సాగటం లేదు. నీలో ఉన్న ఈ సుగుణాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ‘నీవు అడగకపోయినా నిన్ను చిరంజీవిగా ఉండేట్లు వరం ఇస్తున్నానని’ అన్నాడు.అమరత్వం కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసినా రావణుడికి తాను కోరుకున్నది దక్కనేలేదు. తనకు చావు రాకూడదు అని ఎప్పటికీ కోరని విభీషణుడికి మాత్రం అమరత్వం దక్కింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట ఇదే. మానవుడు విషయభోగాల వెంటపడి పరిగెత్తినంత కాలం అతడు కోరుకున్న భోగాలు అతడి నుంచి మరింత దూరమవుతాయి. – డి.వి.ఆర్. -
జ్ఞానగర్భుడు... వేదముఖుడు
సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మ. ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. సకల చరాచర సృష్టి ఆయన పని. ఆయనకు పూజార్హత లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా ఆయన దర్శనమిస్తున్నాడు. వేదోద్ధారక గోవిందా అనే ఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠం తిరుమల గిరులకు పైన 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ఉంది. నిరంతర వేద ఘోషతో దానికి వేదగిరి అనే పేరు కూడా వచ్చింది. ఆ వేదపాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన బ్రహ్మ విగ్రహం కొలువు తీరి ఉంది. పద్మంపై ఆసీనుడై నాలుగు తలలతో, నాలుగు చేతులతో ముందు వైపు నలుగురు వేదఋషులతో దర్శనమిచ్చేస్వామి రూపం అతి సుందరంగా శిల్పకళతో ఒప్పారుతుంది. బ్రహ్మ కుడిచేతిలో చిన్ముద్ర చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి, అలాగే వెనుక చేతులలో కుడివైపు జపమాల, ఎడమవైపు కమండలం పట్టుకుని ఉంటాడు. చిన్ముద్రలో చూపుడువేలు, బొటనవేలు కలిపి ఉంటుంది. తాత్త్వికంగా ఆలోచిస్తే చూపుడు వేలు జీవాత్మకు, బొటనవేలు పరమాత్మకు ప్రతీక. వీటిని రెంటినీ కలిపి ఉంచాలనే విషయాన్ని చిన్ముద్ర ద్వారా తెలుసుకోవాలి.ç ³#స్తకం జ్ఞానరూపం. సమస్త వేదసంపద పుస్తకరూపంలో ఆయన ఎడమచేతిలో నిలిచి ఉంది. జపమాల ద్వారా నిరంతరం భగవన్నామ జపం చేయమనీ, కమండలం ద్వారా సమస్త సృష్టి నిర్మాణానికి జలం ఎంతో ప్రాముఖ్యమైనదనీ తెలుసుకోవాలి. ఆయన కర్ణకుండలాలతో, అనేక ఆభరణాలతో బ్రహ్మ సూత్రం ధరించి ఉదరబంధం అనే అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. ఈయన వాహనం హంస. బ్రహ్మ భార్యకు సరస్వతీ, గాయత్రీ, బ్రహ్మాణీ, సావిత్రి అనే పేర్లు ఉన్నాయి. సనత్కుమారుడు బ్రహ్మనిర్మాల్యధారి. బ్రహ్మకు ఎర్రటి పట్టు వస్త్రాలు ప్రియమైనవి. బ్రహ్మ ద్వారపాలకులు ఎనిమిది మంది. తెలుగునాట బ్రహ్మను ఆరాధించే సంప్రదాయం చాలా ప్రాచీనకాలం నుండి ఉంది.అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు అందుకు ప్రత్యక్షసాక్ష్యం. అథర్వవేద ఋషులు సాధించిన మనస్సంకల్పశక్తిని బ్రహ్మ అనే పేరుతో పిలిచారు. ధాత, విధాత, ప్రజాపతి అనే పేర్లతో ఆయనను పిలుస్తారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
మోదీ.. ఒక బ్రహ్మ, ఒక సృష్టికర్త
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక బ్రహ్మ, ఒక సృష్టికర్త.. ఆయనకు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసంటూ.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ప్రధాని కావాలనే శీతాకాల సమావేశాలను నిర్వహణను ఆలస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మోదీ హయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం, విశ్వాసం లేవని చెప్పారు. ’పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి పలువురు మంత్రులను సంప్రదించాను. లోక్‌సభ ప్రధానకార్యదర్శిని అడిగాను. అయినా ఏ ఒక్కరు సమావేశాల గురించిన స్పష్టమైన ఇవ్వలేదు‘ అని ఖర్గే చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే శీతాకాల సమావేశాలు ఏప్పుడు జరుగుతాయో తెలుసని.. ఆయన మాత్రమే సృష్టికర్త అంటూ వ్యంగ్యంగా అన్నారు. -
తండ్రికి నిరంతరం కొడుకు ధ్యాసే!
మహానుభావుడు, ధర్మవేత్త, గొప్ప ఆచార్యుడు, మహా పరాక్రమవంతుడయిన ద్రోణుడు–చేతిలో ఆయుధం ఉన్నంతసేపు యుద్ధరంగంలో ఆయనను ఆపగలిగిన వాడు లేడు. అంత విలువిద్యను పొందిన అర్జునుడే సాక్షాత్తూ ఎదురుగా నిలబడినా ఆపడం అసాధ్యం.అంతటి ద్రోణాచార్యుడు ఒక్కమాటకి పడిపోయాడు. కారణజన్ముడైన ధృష్టద్యుమ్యుడు యుద్ధరంగంలో ఎదురుగా కాచుకుని ఉన్నాడు, ఆయనని చంపడానికి. కుదరడం లేదు. కారణం–ద్రోణుడి చేతిలో ఆయుధం ఉంది. అది విడిచిపెడితే తప్ప చంపడం కుదరదు. అసలు ద్రోణాచార్యుల వారితో యుద్ధమంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి.. ఆహా...ఎంత వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు... ధర్మజుణ్ణి పట్టిస్తానని మాటిచ్చాడు దుర్యోధనుడికి. ద్రోణాచార్యులవారు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరూ నిలబడలేక పోతున్నారు. ఇక ఇది సాగకూడదనుకున్న శ్రీకష్ణ భగవానుడు ధర్మం నిలబడాలి కనుక వ్యూహరచన చేసాడు. భీముడి చేత అశ్వత్థామ అనే ఏనుగుని పడగొట్టించేసాడు. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నాడు. చచ్చిపోయింది అశ్వత్థామ అనే ఏనుగయితే, ఏనుగు చచ్చిపోయిందని చెప్పకుండా ’అశ్వత్థామ చనిపోయాడు’ అన్నాడు. ద్రోణుడి కుమారుడి పేరు కూడా అశ్వత్థామ. అంతే! ద్రోణాచార్యుల వారు ముందు నమ్మలేదు. నిరుత్తరుడై పోయాడు. అయినా ఆయుధం ఇంకా చేతిలోనే ఉంది. అది నిర్ధరణ చేసుకోవడానికి ధర్మరాజువంక తిరిగాడు. ’నిజమా !’ అని అడిగాడు శిష్యుణ్ణి. ఎంత సంఘర్షణో !!! ఎదురుగా ఉన్నవాడు గురువు. గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పడానికి నోరురావడం లేదు. నిన్నెవరు అబద్ధం చెప్పమన్నారయ్యా, నిజమే చెప్పు’ అన్నాడు శ్రీకష్ణ పరమాత్మ. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అను. కుంజరః అన్నప్పుడు మేం భేరీలు మోగిస్తాం’ అన్నాడు. ఎంతయినా గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. పైగా గురువుగారి మరణానికి కారణమవుతోందది. అయినా ధర్మరాజు ’అశ్వత్థామ హతః..కుంజరః’ అన్నాడు. ’కుంజరః’ అన్నప్పుడు భేరీలు మోగించారు. ’ అశ్వత్థామ హతః’ అన్నంత వరకే వినబడింది, కుంజరః అన్నది వినపడలేదు – ద్రోణా చార్యుల వారికి. అంతే ఆయుధం వదిలి పెట్టేసాడు. ఆయన ఎంతటి యోగమూర్తో తెలుసా! ఆయన ఆచార్య అనిపించుకున్నాడంటే కేవలం విలువిద్య ఒక్కటే కాదు ఆయన విశిష్టత. ఆయన ధర్మం అటువంటిది. ధర్మానికి నిలబడ్డవాడే ఆచార్యుడు తప్ప ప్రతి వాళ్లూ పేరు ముందు అసంబద్ధంగా తగిలించుకున్నంత మాత్రాన ఆచార్యులు కాలేరు. ఆయన అనుష్ఠానం అటువంటిది. ఆయుధాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మూలాధార చక్రం దగ్గర్నుంచీ యోగవిద్యతో ప్రాణవాయువును పైకి లేపి బ్రహ్మరంధ్రంగుండా నిష్కమ్రింప చేసాడు. అప్పుడు ధృష్ట్టద్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుడిని చంపాడు. అర్జునుడు ఎంత బాధపడ్డాడో, ధర్మరాజు ఎంత ఏడ్చాడో ! అంతటి మహానుభావుడు, అంతటి పరాక్రమశీలి, అంతటి ఆచార్యుడు కేవలం కొడుకు పడిపోయాడన్న మాటకూడా వినలేకపోయాడు. ఆ ఒక్క చిన్న పలుకు చంపేసిందంతే. కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటి వాడెంత నైరాశ్యానికి లోనయిపోతాడో, ఎంత బాధ పడిపోతాడో.. కొడుకు అంటే ప్రాణం వదిలి పెట్టేస్తాడు తండ్రి. సర్వకాలాల్లో కొడుకుకు రక్షణ కలిగించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో మరొక ఆలోచన లేకుండా ఉండేవాడు ఎవడో ఆయనే తండ్రి. కొడుకు సంతోషం తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే తండ్రి – బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలుగా ప్రత్యక్ష దైవంగా ఉంటాడు. -
అమ్మ పరబ్రహ్మమే!
బ్రహ్మ, విష్ణు అంశలతోపాటూ అమ్మలో శివాంశ కూడా ఉంటుందనీ, అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుందనీ, పరమ శివుడిలా నిత్య ప్రళయం చేస్తుందనీ తెలుసుకుంటున్నాం. అమ్మ పరమేశ్వరుడిలా ఆత్యంతిక ప్రళయం కూడా చేస్తుంది. అంటే జ్ఞానమివ్వడం. శిశువు పెరుగుతున్న దశలో అమ్మ వాడిని ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చడానికి జోలపాట పాడుతుంది. ఏవో నోటికొచ్చిన పాటలు పాడుతుంటే వాడవి వింటూ నిద్రలోకి జారుకుంటాడు. ఎంత పాటలు రాని తల్లయినా... ళొలబళొల... హాయీ అంటూ ఏవో శబ్దాలు చేస్తూ పాడుతుంది. ఏమిటా పాట? ‘‘ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు. నీకు ఈ తిరగడం (ఒక జన్మనుంచి మరొక జన్మకు) అలవాటయి పోయిందిరా. ప్రయోజనం లేని తిరుగుడు. పునరపి జననం, పునరపి... అక్కడ వదిలిపెట్టి ఇక్కడ పుట్టడం, ఇలా వెళ్ళడం... అలా రావడం.. ఇదే బాగుందని పడుకుని సుఖపడుతుండడం... ఇది కాదురా ళొలబళొలబ... హాయి...’’ అంటూ తొలి గురువై మొదటి వేదాంతం చెబుతుంది అమ్మ. బిడ్డ ఇంకొంచెం పెద్దయ్యాక... గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెబుతుంది. అమ్మ అన్నం పెట్టినట్లుగా పెట్టగల వ్యక్తి ఈ సృష్టిలో మరొకరుండరు. ఒకసారి అమ్మ వెళ్ళిపోతే... ఇక అలా అన్న పెట్టడం కట్టుకున్న భార్యకు కూడా సాధ్యంకాదు. భార్యగా తనబిడ్డలకు పెట్టగలదేమో గానీ భర్తకు అలా పెట్టలేదు. అమ్మే పెట్టాలి అలా ఎందుచేతంటే... బిడ్డకు అన్నం పెడుతున్నప్పుడు ఎవరూ చూడక పోయినా చూశారేమోననే అనుమానంతో... ఎందుకైనా మంచిదని ఇంత ముద్ద తీసి గిరగిరతిప్పి అవతల పారేస్తుంది. ఎంత భయమంటే... ఈవేళ ఇంత అన్నం తిన్నాడని నేననుకున్నట్లే ఎవరైనా అనుకుంటారేమోనని భయం, తను కూడా అలా అనుకున్నందుకు భయం..ఈ లక్షణం కేవలం అమ్మలో మాత్రమే ఉంటుంది. అమ్మచేతి అన్నం అమృతంతో సమానం. అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు కూడా ఏవో కథలు చెబుతుంటుంది. పెద్ద పెద్ద కథలు చెప్పక్కర్లేదు. అవి రామాయణ, భారత, భాగవతాల కథలే కానక్కరలేదు.. ఏవో నోటికొచ్చిన మాటలను కథలుగా అల్లి... అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ముసిలవ్వ ఉండేది రోయ్.. అని మొదలుపెడుతుంది... నిజంగా ఉండేదా ?... ఏమో.. వాడు మాత్రం అవి పరమ ఆసక్తిగా వింటూ ఊ..ఊ.. అంటూ ఊకొడుతూ.. తింటూంటాడు. ఇలా కథలు చెప్పే ఏ అమ్మ అయినా.. చివరన ఒక మాటంటుంది. ‘‘కథ కంచికి మనం ఇంటికి’’... అంటుంది. అంటే ??? అందులో అమంగళత్వాన్ని అమ్మ పలకదు. చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత మంగళప్రదంగా చెబుతుందో! ‘‘ఎన్నోసార్లు పుట్టావు. ఎన్నోసార్లు పెరిగావు. ఎన్నోసార్లు శరీరం విడిచిపెట్టావు. లోపల జీవుడలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈసారి నీ కథ కంచికి చేరిపోవాలి. అంటే నీవు ఈ జన్మలో కామాక్షిలో ఐక్యమయిపోవాలి. నీవు మళ్ళీ రాకూడదు’’ అని చెప్పాలి. కానీ ఈ మాట నోటివెంట ఎలా పలుకుతుంది? తల్లి కనుక... అలా చెప్పలేని కథను కంచికి పంపుతుంది. చివరకు అన్ని కథలూ కంచికే చేరిపోవాలి. అంటే అందరం కామాక్షిలోనే ప్రవేశించాలి. ‘‘కానీ ఇప్పుడు కాదురోయ్! నేనుండగా కాదు. నువ్వు పండిన తర్వాత... అప్పుడు కూడా నేనే ముందు, ఆ తర్వాతే నువ్వు. ఎందువల్ల? తన కళ్ళముందు బిడ్డ అలా పండడాన్ని అమ్మగా చూడలేదు కనుక. అందుకని ‘‘నేను ముందు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి రా.. మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం..’’ అనుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అపర విష్ణువు... అమ్మ
అమ్మ... బ్రహ్మ అని చెప్పుకుంటూ, సృష్టికర్త అయిన బ్రహ్మ అంశ అమ్మలో ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదా! ప్రముఖ వైద్యులొకరు ‘మాతృదేవోభవ’ అని పుస్తకం రచించారు. వైద్యశాస్త్రపరంగా తనకున్న పరిజ్ఞానాన్నంతటినీ ఉపనిషత్ జ్ఞానంతో కలిపి రచన చేశారు. అమ్మ కడుపులో బ్రహ్మస్థానం ఎలా ఉంటుంది, సృష్టి చేయడానికి అవకాశం ఎలా ఉంటుందో విశ్లేషించారు. అమ్మ కడుపులో ఒక రకమైన ద్రవం ఊరుతుంది. అలా ఊరి, అది కడుపులో చేరుతుంది. దానిలో శిశువుంటుంది. అలా ఉన్న కారణం వల్ల అమ్మ వంగినా, జారి పడినా.. లోపల ఉన్న పిండానికి దెబ్బతగలకుండా, అలా అది అంగవైకల్యం పొందకుండా... ఆ ద్రవంలో తేలుతూ ఉంటుంది. అలా ఉన్నస్థితిలోనే బయట వైద్యుడు ఆ పిండం ఎదుగుదల క్రమాన్నీ, ఆరోగ్య పరిస్థితినీ అంచనా వేయడానికి అవకాశం కలుగుతుంది. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు సృష్టికర్త అంశంగా తల్లిలో మాత్రమే అలాంటి ద్రవం ఉత్పన్నమవుతుందని రాశారు. అమ్మలో... సృష్టికర్త అంశతో పాటు, స్థితికర్త అంశా ఉంటుంది. స్థితికర్త అంటే... పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు అని అర్థం. ఇది విష్ణుతత్త్వం. సృష్టి, స్థితి, లయ – అనే మూడింటిలో స్థితి... అంటే రక్షణ భారాన్ని స్వీకరించి, త్రిమూర్తి త్రయంలోని విష్ణుస్వరూపం స్థితికారకమై ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఒక ధర్మం ఉంటుంది. ఏ పేరుపెట్టి పిలవకపోయినా, ఆపదలో మన రక్షణ కోసం పలికేది విష్ణువే. అది ఆయన కర్తవ్యం. ‘గజేంద్ర మోక్షం’లో ప్రమాదంలో చిక్కుకున్న గజేంద్రుడు ఒక పేరు పెట్టి ఎవరినీ తన రక్షణ కోసం పిలవలేదు. ఓ బ్రహ్మ రావాలనో, ఓ శివుడు రావాలనో, నాలుగు తలకాయలవాడు రావాలనో, తామరపూవులో నుంచి పుట్టినవాడు రావాలనో, నాగభూషణుడు రావాలనో వర్ణన చేయలేదు. ‘‘తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంత శక్తయే అరూపా యోరు రూపాయ నమః ఆశ్చర్యకర్మణే... విదూరాయ, కైవల్యనాథాయ, శాంతాయ, ఘోరాయ, మూఢాయ, నిర్విశేషాయ, సామ్యాయ, జ్ఞానధనాయ’’ – ఇలా కీర్తిస్తూ అలాంటివాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. అటువంటి వాడెవరు విష్ణువా? శివుడా? బ్రహ్మా? రక్షణకి పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరుగెత్తుకొచ్చాడు. ఆయననే ఉద్దేశించి రక్షించమని ప్రత్యేకించి అడగక్కర్లేదు. అటువంటి విష్ణుతత్త్వం అమ్మలో ఉంటుంది. అమ్మ.. అమ్మగా రక్షకతత్త్వంతో ఉంటుంది. అమ్మకు రక్షించడమొక్కటే తెలుసు! ఆ రక్షకతత్త్వం గురించి ప్రత్యేకంగా ఎవరూ బోధ చేయక్కర్లేదు. మనుష్య ప్రాణే కాదు, ఏ జీవి అయినా, ఏ ప్రాణి అయినా తీసుకోండి... తన బిడ్డ అనేటప్పటికి అప్పటి వరకు భయహేతువుగా ఉన్న వాటివల్ల తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా సరే, బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. కోడిపెట్ట అనుక్షణం పైన ఉన్న గ్రద్ద నుండి, పక్కనున్న కుక్క వరకు దేని నుంచీ ఎలాంటి హానీ జరగకుండా తన పిల్లలను కనిపెట్టుకునే ఉంటుంది. ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ‘కొక్కొక్కొక్కొ...’ అంటూ పిల్లలన్నిటినీ రెక్కల దగ్గరకు తీసేసుకుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. పిల్లల్ని తీసుకువెళ్ళి ఎక్కడో సురక్షిత స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. గ్రద్ద కానీ, కుక్క కానీ వస్తే ముందు తనను కొట్టేయాలి తప్ప పిల్లలను ముట్టుకోనీయదు. తాను చచ్చిపోయాకే తప్ప తన కళ్ళ ముందు తన పిల్లలు చచ్చిపోకూడదు. ఎవరు నేర్పారు ఈ త్యాగభావన? ఎక్కడి నుంచి వచ్చిందీ రక్షణశక్తి? అంటే దర్శనం చేయగలిగిన నేత్రాలుండాలే గానీ... పిల్లలకు అడ్డుగా రక్షణ కవచంలా నిలబడి పోయిన ఆ తల్లి కోడే – శ్రీమహావిష్ణువు! ఆ తల్లి కోడే – జగన్మాత!! అసలు ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఏమిటంటే ‘‘అమ్మ కడుపులోంచి బిడ్డ బయటకు రాగానే అపారమైన భయానికి లోనై, వాడికి ఊపిరితిత్తుల చలనం ఆగిపోతుంది. వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. ఆ భయానికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా అయిపోతుంది. ఈ దశలో ‘వీడు నా బిడ్డ’ అన్న భావనతో, సంతోషంతో వాడిని అమ్మ దగ్గరకు తీసుకుని స్తన్యమివ్వగానే, ఈ సృష్టిలో ఎక్కడా తయారుచేయడానికి సాధ్యపడని పసుపుపచ్చని పదార్థం ఒకటి విడుదలవుతుంది. దానిని బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె మళ్ళీ సాధారణస్థాయిలో కొట్టుకుంటుంది. లోపల గడ్డ కట్టుకున్న నల్లటి మలం విసర్జింపబడుతుంది. అంతేకాక రుగ్మతల బారి నుండి వాడిని వాడు రక్షించుకోవడానికి అవసరమైన నిరోధకశక్తిని సమకూర్చుకొని స్వస్థతను పొందుతాడు.ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ‘నా బిడ్డ’ అన్న భావనతో అమ్మ ఇచ్చిన స్తన్యంలో నుంచి, స్థితికారకత్వమైన విష్ణుతత్త్వంలో నుంచి వచ్చింది. అందువల్ల అమ్మ సృష్టికర్తే కాదు, స్థితి కర్త కూడా! అందుకే మాతృదేవోభవ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తారకాసురుడి మూర్ఖత్వం
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి, చావులేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు, సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి, మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరేనన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించనటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే, శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీవియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి, తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరేనన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబల ం తోడు కావడంతో తననెవరూ జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేనివిధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలనూ, మానవులనూ, మునులనూ, సాధుప్రాణులందరినీ నానా హింసలకూ గురిచేయసాగారు. దాంతో అందరూ కలసి బ్రహ్మదేవుడికి దగ్గరకెళ్లారు తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని. ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో! దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలే రు కాబట్టి, మనమందరం కలసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువవుతుందన్నాడు. అందుకు సమర్థులెవరని వెతగ్గా, మన్మథుడు ముందుకొచ్చాడు. మన్మథుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ, లోకకల్యాణం కాబట్టి సరేనని ఒప్పుకుంది. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె. ఆమెకు చిన్నప్పటినుంచి శివుడంటే వల్లమాలిన భక్తి. ఆ భక్తి కాస్తా ఆయన్ను పరిణయమాడాలనుకునేంతటి అనురక్తిగా మారింది. సాక్షాత్తూ పరమ శివుని పతిగా పొందాలంటే మాటలా మరి! అందుకే తపస్సు చేయడం మొదలెట్టింది. మన్మథుడి పని కాస్త సులువు చేసినట్లయింది. మహా వైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా, ఆయన తపస్తు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆయన ఏమయినా తింటాడేమోనని పండ్లు తెచ్చి ముంగిట పెట్టడం.. ఇలా ఎంతకాలం గడిచినా, శివుడు కళ్లు తెరవనేలేదు కానీ, పార్వతి మాత్రం అన్నపానీయాలు మానేసి, కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఓరోజున మన్మథుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుని తోడు చేసుకుని, పూలబాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి, ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు. ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని పరిణయమాడడంతో, వారికి కుమారస్వామి జన్మించాడు. (కుమారస్వామి జనన వృత్తాంతం ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మరోసారి చెప్పుకుందాం). ఎప్పుడూ బాలుడిలా ఉంటాడు కాబట్టి, కుమారస్వామి అని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడనీ, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా ఆరుముఖాలతో పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడనీ, రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణ భవుడనీ, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడన్న పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. అమిత బలపరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాలసుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఏడోఏడు రానే వచ్చింది. అప్పుడు దేవతలు కుమారస్వామికి అతని జన్మకారణాన్ని తెలియజెప్పి, యుద్ధానికి సన్నద్ధుడిని చేశారు. అందుకోసమే ఎదురు చూస్తున్న కుమారస్వామి ఆశ్వయుజ బహుళ షష్ఠినాడు దేవతలందరినీ వెంటబెట్టుకెళ్ల్లి, తారకునిపై సమర శంఖం పూరించాడు. ఏడేళ్ల బాలుడు తననేమి చేయగలడన్న ధీమాతోనే కదా, తారకుడు అతడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావకుండా వరం కోరుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ధీమాను, నిర్లక్ష్యాన్ని వదులుకోలేదు. దాంతో ముందుగా శూరపద్ముడు, తర్వాత తారకుడు కుమారస్వామి వీరత్వం ముందు ఓడిపోయి, తర్వాత ప్రాణాలు కోల్పోక తప్పలేదు. ఆ విధంగా తారకాసురుడు మహా విరాగి అయిన శివుడికి కల్యాణం జరగదు, ఒకవేళ జరిగినా కొడుకులు పుట్టరు, పుట్టినా, ఏడేళ్లవాడవ్వాలి. ఏడేళ్లొచ్చినా, అంతటి పసివాడు తనను ఓడించలేడు అన్న అతి తెలివితో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. -
సుందోపసుందులు
పురానీతి పూర్వం హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే కొడుకులు ఉండేవారు. వారిద్దరికీ ముల్లోకాలనూ జయించాలనే కోరిక ఉండేది. అంతటి ఘనకార్యం ఘోర తపస్సుతో తప్ప సాధ్యం కాదని తలచి, అన్నదమ్ములిద్దరూ ఒక కీకారణ్యానికి చేరుకుని తపస్సు ప్రారంభించారు. మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి, వణికించే శీతకాలంలో జలాశయాల్లో మునిగి ఏళ్ల తరబడి ఘోర తపస్సు సాగించారు. వారి తపస్సు తీవ్రతకు ప్రకృతి గతి తప్పింది. ముల్లోకాలలో సంక్షోభాలు తలెత్తాయి. ఆ పరిస్థితికి దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు. వారి తపస్సును విరమించేలా చేయాలంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దేవతల గోడు విన్న బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. కామరూపం, కామగమనం వంటి సకల మాయావిద్యలను అనుగ్రహించాలని, తమకు ఇతరుల వల్ల మరణం రాకుండా ఉండేలా వరమివ్వాలని, అమరత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అమరత్వం తప్ప వారు కోరుకున్న మిగిలిన వరాలన్నింటినీ ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. అసలే రాక్షసులు, ఆపై బ్రహ్మదేవుడి వరాలు కూడా పొందినవారు. ఇక ఆగుతారా..? వరగర్వంతో నానా అకృత్యాలూ ప్రారంభించారు. మునులు తలపెట్టిన యజ్ఞయాగాలకు భంగం కలిగించసాగారు. కామరూప విద్యతో క్రూరమృగాల రూపం ధరించి, ఊళ్లపై పడి అమాయక ప్రజలను పీడించసాగారు. వారి దాష్టీకాలకు లోకమంతా హాహాకారాలు మిన్నుముట్టసాగాయి. సుందోపసుందులను ఎలా నియంత్రించాలో అర్థంకాక మునులందరూ బ్రహ్మదేవుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. ‘దేవా! నీవిచ్చిన వరాల ప్రభావంతోనే సుందోపసుందులు చెలరేగిపోతున్నారు. లోకులను నానా రకాలుగా పీడిస్తున్నారు. వారి పీడ విరగడయ్యే పరిష్కారం నువ్వే చూడాలి’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ‘వారికి నేను అన్ని వరాలూ ఇచ్చానే గాని, అమరత్వాన్ని ప్రసాదించలేదు. నేనిచ్చిన వరం వల్ల ఇతరుల చేతుల్లో వారి మరణం అసంభవం. వారిలో వారికే కలహం వచ్చి, పరస్పర యుద్ధానికి దిగితే తప్ప వారి పీడ విరగడ కావడం సాధ్యం కాదు’ అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే, కలహించుకోవడానికి సుందోపసుందులు పరస్పర శత్రువులేమీ కాదు. ఒకరిపై మరొకరికి అనురాగం గల అన్నదమ్ములు. వాళ్ల మధ్య కలహం పుట్టించడం ఎలా అన్నదే సమస్య. దీనికి ఏం చేయాలో తోచని బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ సమావేశపరచాడు. తానిచ్చిన వరాల వల్ల గర్వాంధులైన సుందోపసుందులు ముల్లోకాలనూ ఎలా పీడిస్తున్నదీ వివరించాడు. వారి పీడ విరగడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు. అప్పుడు విశ్వకర్మ ముందుకు వచ్చి ‘అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించడానికి ఆడది చాలు. నేను సృష్టించిన అప్సరస తిలోత్తమ ఆ పనిని అవలీలగా సాధించగలదు’ అని పలికాడు. విశ్వకర్మ మాటలతో బ్రహ్మదేవుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఇంద్రసభలో ఉన్న తిలోత్తమకు కబురు పంపాడు. బ్రహ్మదేవుడి వర్తమానం అందడంతో జగదేక సుందరి అయిన తిలోత్తమ బ్రహ్మ సమక్షానికి వచ్చి నిలుచుంది. ‘నీ అందచందాలతో లోకాలను పీడిస్తున్న సుందోపసుందులను ఆకర్షించు. చాకచక్యంగా వాళ్లిద్దరి మధ్య కలహం పుట్టించు’ అని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తిలోత్తమ భూలోకానికి చేరుకుంది. సుందోపసుందులకు కనిపించేలా వారు తరచూ సంచరించే వనంలో విహరించసాగింది. వన విహారానికి వచ్చిన సుందోపసుందులిద్దరూ ఒకేసారి ఆమెను చూశారు. ఆమె అందానికి వారి మతులు పోయాయి. ‘ప్రాణేశ్వరీ’ అంటూ సుందుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ‘హృదయేశ్వరీ’ అంటూ ఉపసుందుడు ఆమె మరో చేతిని పట్టుకున్నాడు. ఆమె నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. వారి వాదన ఎటూ తేలని స్థితిలో తిలోత్తమ చిరునవ్వులు చిందిస్తూ... ‘మీ ఇద్దరికీ నేనొకత్తెనే ఎలా భార్య కాగలను? మీరిద్దరిలో ఎవరు వీరులో వారిని నేను తప్పక పెళ్లాడతాను’ అని పలికింది. ఎలాగైనా తిలోత్తమను దక్కించుకోవాలనే పట్టుదలతో సుందోపసుందులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇద్దరూ సమాన బలవంతులే. భీకరంగా పోరాడుకున్నారు. సింహనాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు కలబడి ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చివరకు ఇద్దరూ మరణించారు. -
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!
భారతీయ వేదాంతానికి మణిదీపాల వంటి మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి. ఒక చెట్టు మీద స్నేహంతో కలసి వుండే రెండు పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ పిప్పలి చెట్టు పళ్లు తింటోంది. మరొక పక్షి ఏమీ తిన కుండా చూస్తూ కూర్చుంది. మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది. ఒక పక్షి జీవాత్మ. అది ఐహిక దృష్టితో దైవచింతన లేని మోహంతో దుఃఖిస్తోంది. దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండోపక్షి పరమాత్మ. మహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుః ఖాన్ని పోగొట్టుకుంటోంది. పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతణ్ణి చేరుకుంటున్నాడు. అన్ని ప్రాణులలోని ప్రాణస్వరూపం పరమాత్మే. దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు. నిరంతరం ఆత్మతత్త్వంలో క్రీడిస్తూ, ఆనందిస్తూ క్రియాశీలియై బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు. శౌనకా! సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు. దోషరహితులైన యోగులు శుభ్రమూ, జ్యోతిర్మయమూ అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యం గెలవదు. సత్యంతోనే దేవయానమార్గం ఏర్పడుతోంది. ఋషులు, కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపథానికి చేరుకుంటున్నారు. ఆ పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహకు అందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, దూరాతిదూరంగా ఉంటుంది. హృదయగుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు. దానిని కళ్లతో చూడలేరు. వాక్కుతో వర్ణించలేరు. ఇంద్రియాలతో, తపస్సుతో, యజ్ఞయాగాది కర్మలతో గ్రహించలేరు. జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. పంచప్రాణాలతో ఉన్న శరీరంలో అణురూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు. మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. నిగ్రహంలో ఇంద్రియాలనుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది. పరిశుద్ధ మనస్కుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు. కోరికలన్నీ నెరవేరతాయి. కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి, అర్చించాలి. ద్వితీయ ఖండం శౌనకా! ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యమూ, కాంతిమంతమూ, విశ్వద్యాప్తమూ అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరికా లేకుండా ఉపాసించినవారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు. ఇంద్రాయసుఖాలకోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరేవారికి మళ్లీమళ్లీ పుడతారు. ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసినవారి కోరికలు నశించిపోతాయి. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహుదా శ్రుతేన ఊకదంపుడు ఉపన్యాసాలతో, మేధాశక్తితో, శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు. ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది. దృఢసంకల్పం లేకుండా అజాగ్రత్తగా, మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసే వారికి ఆత్మజ్ఞానం కలగదు. మనోబలం, శ్రద్ధ, ఆత్మజిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసే వాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీన మౌతుంది. ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు జ్ఞానతప్తులై రాగద్వేషాలు లేనివారు, ప్రశాంత చిత్తులు, పరమాత్మ స్వరూపులు అవుతారు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్లా దర్శించగల ధీరులు, ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్న్యాసయోగార్యతయః శుద్ధ సత్త్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాఃపరిముచ్చంతి ధీరాః సన్న్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి. వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సంప్రదాయం. భారతీయ వేదాంతానికి, ముండకోపనిషత్తుకు ఇది ప్రాణం లాంటిది. వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు యతులై, శుద్ధసత్త్వులై సన్న్యాసయోగాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు. అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి. ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి. కర్మలు, జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతాయి. బ్రహ్మజ్ఞానం వల్ల శోకం, పాపాలు నశిస్తాయి. హృదయంలోని ముడులు విడిపోతాయి. విముక్తుడైనవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు. శౌనకా! శ్రద్ధగా కర్మలు చేసేవారు, వేదాధ్యయనం చేసేవారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ‘ఏకర్షి’ అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు, యధావిధిగా ‘శిరోవ్రతాన్ని’ ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మవిద్య వినడానికి అర్హులు. అటువంటివారికే ఉపదేశించాలి. ఇది సత్యం. దీనిని పూర్వం అంగిరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు. వ్రతాచరణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినకూడదు. నమః పరమ ఋషిభ్యోన్నమః పరమ ఋషిభ్యః - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను, ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాలనుండి విముక్తుడై పరాత్పరుడైన పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు. పరబ్రహ్మ తత్వం తెలిసినవాడు పరబ్రహ్మ అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు. -
పునర్విభజన ఇప్పట్లో లేనట్టే!
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసి అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. అయితే కేంద్రం ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. పునర్విభజన ప్రక్రియను ఆపాలంటూ కేంద్ర హోం శాఖ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ చేరినట్లు సమాచారం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలోని 119 స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ తదితరులతో కలసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు. అయితే ఇందుకు హెచ్. ఎస్ బ్రహ్మ బదులిస్తూ ‘ఈ ప్రక్రియ మేం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. గణాంకాలు సేకరించే పని కూడా ప్రారంభించాం. ఇందుకు ఒక అధికారిని కూడా నియమించాం. అయితే నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి 2008లో చేసిన సవరణలో చేర్చిన సెక్షన్ 10బీ ప్రకారం 2026 వరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు యథాతథంగా కొనసాగాలి. ఇదే విషయాన్ని కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది’ అని వివరించారు. ఆ చట్టంలో సవరణ చేస్తే తప్ప నియోజకవర్గాల పునర్విభజన చేయలేమని, దీనిపై కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన కేసీఆర్‌కు సూచించారు. కాగా కేంద్రం ఈ అంశాన్ని సాకుగా చూపుతున్నట్లు కనిపిస్తోందని, చట్ట సవరణ చేయకుండా ప్రక్రియ ఆపాలని చూడడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉండొచ్చని ఓ టీఆర్ఎస్ ఎంపీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
'నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు'
న్యూఢిల్లీ: నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని నిర్వాచన సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బ్రహ్మ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బ్రహ్మ విలేకర్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాను పటిష్ట పరిచేందుకు ఏడాదిలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. బ్రహ్మ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు. దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే. -
ఢిల్లీ ఎన్నికలకు నగారా
వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు 13న తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. సోమవారమిక్కడ కమిషనర్లు హెచ్ఎస్ బ్రహ్మ, నసీమ్ జైదీలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో 1.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎన్నికలు లేకపోవడంతో ఢిల్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు తమ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ కిందటేడాది నవంబర్ 4న రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన గడువు ఫిబ్రవరి 15న ముగియనుంది. ఎన్నికల కోసం 11,736 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ , కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అసెంబ్లీ స్థానం సహా వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమబెంగాల్లోని బంగోన్ లోక్‌సభ స్థానానికి కూడా ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తామని వీఎస్ సంపత్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జారీ చేసిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి సంతకం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తన రాజ్యాంగ అధికారాలను ఎప్పుడు వాడాలో ఆయన(రాష్ట్రపతి)కు తెలుసు’ అని సంపత్ పేర్కొన్నారు. వ్యూహ రచనల్లో పార్టీలు.. షెడ్యూల్‌కు ముందే ఢిల్లీలోని ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నాయి. ఆప్ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పోస్టర్లు, హోర్డింగులు, ఎస్ఎంఎస్లు, రేడియో సందేశాలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది. గడిచిన రెండు నెలల్లో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 55 సభలు నిర్వహించారు. విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. తమ 49 రోజుల పాలనలోని విజయాలను ప్రధానంగా పేర్కొంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక ప్రధాని మోదీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరంలో బీజేపీ శ్రేణులు మోదీ పోస్టర్లు, హోర్డింగులను పెద్దఎత్తున ఏర్పాటు చేశా యి. ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ.. మరో ఐదారు సభలకు హాజరవుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా మునుపెన్నడూ లేని రీతి లో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది. అయితే ప్రచారపరంగా ప్రత్యర్థి పార్టీల కన్నా వెనుకబడి ఉంది. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. -
లలాట లిఖితం
జ్యోతిర్మయం ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని ‘తలరాత’ ఆ పుర్రె మీద ఇం కా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూ హలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చది వాడట. పొడి పొడి మాటలలో, ‘జన్మ ప్రభృతి దారిద్య్రం, దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’ (పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదే ళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది. నారదుడికి ఆశ్చర్యం వేసింది. ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారా గార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమి టి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు. ‘ఇత గాడు నిష్ఠ దరిద్రుడే. దిక్కులేకుం డా మరణించిన మాటా నిజమే. కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపా లాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?’’ అన్నాడట బ్రహ్మ! బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పిం చుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఓ నమ్మకం. ‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం/ తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’ (విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) అని చెప్పాడు భర్తృహరి. మరి అంతా బ్రహ్మ రాతే అయితే ఇక మనిషి కర్మ లకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా? బోలెడంత ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం? అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే. బ్రహ్మ రాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే. దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది. మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు. బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే. ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు. మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే. బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించు కోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే. ఎం. మారుతి శాస్త్రి -
నలుగురు కుర్రాళ్ల ఆశయం
జీవితంలో బాగా స్థిరపడాలని ఆ నలుగురు కుర్రాళ్లు అనుకుంటారు. తమ ఆశయం నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌లో అడుగుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు అనుకున్నట్లుగానే స్థిరపడగలి గారా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే కుర్రాళ్లు’. శశాంక్, వికేష్, శ్రీచరణ్, బ్రహ్మ, భవ్య, నయన, సోనాలి, పవిత్ర ముఖ్య తారలుగా చరణ్ మల్లెల దర్శకత్వంలో ఉప్పలపాటి వికేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎమ్. ప్రేమ్, కెమెరా: శ్రీరామ్. -
పౌరాణిక జ్ఞానం
శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? బ్రహ్మకి మూడు తలలే కనిపిస్తాయెందుకు? శివుడు లయకర్త. లయమంటే ముగింపు. అది జరిగేది శ్మశానంలోనే కదా! అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. బ్రహ్మకి అసలు శిరస్సులు ఐదు. శంకరుడు ఒకటి ఖండిస్తే నాలుగు తలలవాడయ్యాడు. మనం గోడమీద చెక్కిన శిల్పాన్ని చూస్తూండడం వల్ల మూడు ముఖాలు కల్గినవానిగా కన్పిస్తూ ఉండవచ్చు గాని ఆయనకి నాలుగు దిక్కులనీ చూస్తూ నాలుగు ముఖాలు ఉంటాయి. అప్సరసల్ని పంపి తపస్సును చెడగొట్టే లక్షణమున్న ఇంద్రుడు దేవతలకు రాజెలా అయ్యాడు? ఇంద్రునిది పరీక్షాధికారి పదవి. ఎవరైనా తపస్సు ప్రారంభించగానే వారిది ఏ స్థాయి తపస్సో, ఎంత గాఢ తపస్సో పరీక్షించవలసిన బాధ్యతనీ ధర్మాన్నీ దేవతలు ఈయన మీద ఉంచారు. అందుచేత ఇంద్రుడు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరింటిలోనూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తాడు. ఓడిపోవడమనేది (కామంలో మేనకతో విశ్వామిత్రుడు, క్రోధంలో అహల్య విషయంలో గౌతముడు.. ఇలా) ఆ రుషుల త ప్పు తప్ప, పరీక్షించ వచ్చిన అప్సరసలదీ కాదు- వారిని పంపించిన ఇంద్రునిది ఏమాత్రమూ కాదు! దర్భలకి అంతటి పవిత్రత ఎలా వచ్చింది? శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దాని పైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత. -
విదేశీ భామలా..
నటి ప్రణీత మోడ్రన్ భామనే. అయితే పాశ్చాత్య దేశాల భామలంత స్టైలిష్ అమ్మాయి కాదట. ప్రస్తుతం అలా మారే ప్రయత్నం చేసిందట. టాలీవుడ్లో అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పాపులారిటీని పొందిన ఈ అమ్మడు తమిళంలోను శకుని లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయినా అంతగా పేరు పొందలేదు. అత్తారింటికి దారేది చిత్రం ఈమెకోదారి చూపిస్తుందని ఆశించింది. అయితే ఈ బ్యూటీ ఆశ ఫలించలేదు. దీంతో మళ్లీ మాతృ భాష కన్నడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం అక్క డ ఉపేంద్ర సరసన బ్రహ్మ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ మలేషియాలో నివశించే కన్నడ భామ పాత్రను పోషిస్తోందట. ప్రణీత మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వైద్యులని చెప్పింది. తనను డాక్టర్ గానో, ఇంజనీర్‌గానో చూడాలని ఆశపడ్డారని చెప్పింది. అయితే విధి తనను నటిని చేసిందని పేర్కొంది. పొరికి చిత్ర యూనిట్ తనను నటిగా పరిచయం చేయడానికి తన తల్లిదండ్రుల అనుమతి కోరిందని చెప్పింది. అలా నటిగా మారినట్లు చెప్పింది. ప్రస్తుతం కన్నడంలో ఉపేంద్ర సరసన విదేశాల్లో పెరిగిన భారతీయ యువతిగా నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం షూటింగ్‌కు ముందే మలేషియా వెళ్లి వారి నడవడికలను గమనించి బ్రహ్మ చిత్రంలో విదేశీ వనితగా జీవిస్తున్నట్లు పేర్కొంది. -
టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!
సినిమా చూస్తారా, సీరియల్ చూస్తారా అంటే... ఒక్క క్షణం కూడా తడుముకోకుండా సీరియల్ అంటున్నారు మహిళా మణులు. అందుకే చానెళ్లలో సినిమాలు రావడం కూడా తగ్గిపోయింది. శని, ఆది వారాల్లో తప్ప మిగతా రోజుల్లో సీరియల్స్‌దే హవా. ఇటీవల కొత్తగా శనివారం కూడా ఇచ్చేస్తున్నారు. ముందు ముందు ఆదివారం కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతగా సీరియళ్లు ఏలుతున్నాయి కాబట్టే... సినిమా వాళ్లు సయితం సీరియళ్ల మీద మోజు పడుతున్నారు. సినిమాల్లో చేస్తున్నవారు కాస్త హవా తగితే సీరియళ్లలోకి జంప్ చేస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కూడా అదే పని చేశారు. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన ఈమె... ఇప్పుడు జీటీవీలో ప్రసారమయ్యే ‘ఎక్ ముఠ్ఠీమే ఆస్మాన్’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంతకీ శిల్ప ఎవరో గుర్తుందిగా? ‘బ్రహ్మ’ చిత్రంలో మోహన్‌బాబుతో నటించారు. ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన’ అంటూ ఆ సినిమాలో మోహన్‌బాబు పాట పాడేది ఈమె కోసమే. నమ్రతా శిరోద్కర్‌కి అక్క, మహేశ్‌బాబుకి వదిన అయిన శిల్ప... ఒకనాడు తన గ్లామర్‌తో యువకుల కలల రాణిగా వెలిగారు. ఇప్పుడు సీరియల్లో ఓ సాధారణ ఇల్లాలిగా నటనను పండిస్తూ... తెలుగు ఇల్లాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మరి టీవీతో మొదలైన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్... ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి!