లలాట లిఖితం | Jyotirmayam | Sakshi
Sakshi News home page

లలాట లిఖితం

Published Tue, Dec 23 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

లలాట లిఖితం

లలాట లిఖితం

జ్యోతిర్మయం
 ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని ‘తలరాత’ ఆ పుర్రె మీద ఇం కా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూ హలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చది వాడట. పొడి పొడి మాటలలో, ‘జన్మ ప్రభృతి దారిద్య్రం, దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’ (పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదే ళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది. నారదుడికి ఆశ్చర్యం వేసింది. ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారా గార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమి టి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు. ‘ఇత గాడు నిష్ఠ దరిద్రుడే. దిక్కులేకుం డా మరణించిన మాటా నిజమే. కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపా లాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?’’ అన్నాడట బ్రహ్మ!

 బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పిం చుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా  ఓ నమ్మకం. ‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం/ తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’ (విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) అని చెప్పాడు భర్తృహరి.

 మరి అంతా బ్రహ్మ రాతే అయితే ఇక మనిషి కర్మ లకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా? బోలెడంత ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం? అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే. బ్రహ్మ రాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే.

 దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది. మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు. బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే. ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు.  మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే. బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించు కోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే.
 ఎం. మారుతి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement