బిల్వ పత్రం
జ్యోతిర్మయం
ఎందుకో గానీ, బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.
నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.
బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.
వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది.
‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్.
ఎం. మారుతిశాస్త్రి