అజ్ఞాతవాసం
జ్యోతిర్మయం
జీవితం కష్టసుఖాల కలగలుపు. ఆ రెంటినీ ఒకే రక మైన స్థిరచిత్తంతో ఎదుర్కొనటమే ధీరలక్షణం. సుఖా లు అనుభవించటానికి ప్రత్యేక శక్తులేవీ అక్కర్లేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, వాటిని ఎదుర్కొని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం, సహన శక్తి కావాలి. ఎదురైన కష్టాలను ఎంత స్థైర్యంతో ఎదుర్కొన్నాడన్నదే మనిషి గుణగణాలకు గీటురాయి.
పాండవుల అజ్ఞాతవాస ఘట్టం ఈ విషయానికి చక్కని దృష్టాంతం. కాలం కలసి రానప్పుడు ఆ మాన ధనులూ, మహావీరులూ ఎదుర్కొన్నంత కఠినమైన పరీక్షలూ, కటువైన పరాభవాలూ ఎదుర్కొన్న వారు మరెవరూ కనబడరు! రాజసూయయాగం చేసిన మహారాజు, సాక్షాత్తూ రూపుకట్టిన ధర్మమని అంద రూ మెచ్చుకొనే ధర్మనందనుడు, విరాటుడి కొలువులో రాజుకు వినోద భాషణలతో, జూ దం ఆటలతో, ఇచ్చకాల ముచ్చట్ల తో వేడుక జేసే సేవావృత్తిలో చేరవ లసివచ్చింది. క్రోధంతో విరాట రా జు నిండు కొలువులో తన ముఖం మీదికి పాచికలు విసిరి గాయప రిస్తే సహించాడు. కిమ్మీర, బకాసురులను అవలీలగా యమ మందిరానికి పంపిన మహాబలుడు భీముడు, గరిటె తిప్పి గరగరగా కూడూ, కూరా వండి పెట్టే వలలుడుగా కాలం గడిపాడు. కీచకుడు, అతని నూట అయిదుగురు తమ్ముళ్లు తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తుంటే, సమయం వచ్చేదాకా చేతులు ముడుచు కొని కూర్చోవలసి వచ్చింది.
ఖాండవవనాన్ని దహింపచేసిన వాడూ, శివుడి తోనే తలపడి ఆయనను మెప్పించిన అస్త్ర విద్యా కుశ లుడు, ఇంద్ర సింహాసనంలో అర్థభాగం అలంకరిం చిన లోకోత్తరుడైన మహా యోధ అర్జునుడు, పేడి వాడై అంతఃపుర స్త్రీలకు ఆటలు పాటలూ నేర్పాల్సివచ్చింది. అతిలోక సుందరుడు నకులుడు అశ్వపాలుడయ్యాడు. సహదేవుడు గోపాలకుడయ్యాడు.
ఇక ద్రౌపది? ఆమె అజ్ఞాతవాసంలో ఎదుర్కొన్న అవమానాలు హృదయాన్ని ద్రవింపజేసేవి. రాజసూయ యాగపు అవబృథ స్నానంతో శుచి అయిన ఆ మహారాజ్ఞి, పరుల పంచన సైరంధ్రి కావటమేమిటి? కామాంధుడైన కీచకుడి ఇంటి నుంచి కల్లు పాత్ర తెచ్చేందుకు నియమితమవడమేమిటి? ఆ దుష్టుడి చేత నిండు కొలువులో పరాభవం పొందటమేమిటి? ఉపకీచకులు ఆమెను కీచకుడి పాడె మీద బంధించి పురవీధులగుండా శ్మశానానికి పంపటమేమిటి?
ఆమెని అవమానించిన అధమాధములంతా ఆమె కళ్లముందే క్షుద్ర జంతువులకంటే హీనమైన, చావులు చావటం ఆమె సాధ్వీత్వాన్ని నిరూపించి, ధర్మ విజయాన్ని స్థాపిస్తుంది. భీముడు కీచకుడిని అతి భయంకరంగా చంపి, కాలూ కేలూ డొక్కలోకి తోసి అతని కళేబరాన్ని ‘పీనుగు ముద్ద’గా చుట్టి, బంతిని తన్నినట్టు తన్ని, అతని పాతకానికి తగిన ప్రతీకారం చేస్తాడు. ఉపకీచకులను పరలోకానికి చేరుస్తాడు.
ధర్మాధర్మాల మధ్య నిరంతరం జరిగే సంఘర్ష ణకు వేదిక మన చుట్టూ కనిపించే లోకం. తాత్కాలి కంగా ధర్మం. సత్యం అనే విలువలు, పాపం చేతా, బొంకు చేతా దెబ్బతిన్నట్టు కనిపించినా దైవ సహా యంతో చివరికి ధర్మం నిలబడక మానదు. సత్యం జయించక మానదు. అధర్మం శిక్ష పొందకా మానదు అని పదే పదే ఘోషిస్తుంది మహా భారతం.
ఎం. మారుతిశాస్త్రి