M.Maruti Sastry
-
మెచ్చుకోలు
జ్యోతిర్మయం ఏ రంగంలోనైనా అంతో ఇంతో ప్రతిభ ఉన్న ప్రతి వాడూ తన ప్రతిభను లోకం మెచ్చుకోవాలని ఆశిస్తాడు. కవికీ, కళాకారుడికీ ఆ మెచ్చుకోలు సాటి కళా కారుల నుంచి వస్తే మరీ ఆనందం. మెచ్చుకోలు వాళ ్లకు ఎంత ఆనందం ఇస్తుందో, తిరస్కారం అంతకంటే ఎక్కువ హృదయ వేదన కలిగిస్తుంది. అలాంటి వేద నలో తమ కావ్యాలు తామే నిప్పులో పారేసిన వాళ్లూ, ఆత్మహత్యలు చేసుకొన్న వాళ్లూ చరిత్రలో ఎందరో ఉన్నారు. ఆశ్చర్యమేమిటంటే, మహాకవులుగా చరి త్రలో నిలిచిన చాలా మందికి, తమ జీవిత కాలంలో తమ సమకాలికుల చేత హృద యపూర్వకంగా ‘సెభాష్’ అని పించుకోవటం తీరని కోరిక గానే మిగిలిపోయింది. కాళిదా సు అంతటి మహాకవి కాళీమా త ప్రసాదాన్నీ, రాజ సత్కారాన్నీ అయితే పొందాడు కానీ, తన సమకాలికుడైన దిగ్నా గుడి వంటి వాళ్ల వెటకారాలూ, హేళనలూ తప్పించు కోలేకపోయాడు. అందుకే, ‘రసజ్ఞులారా, పురాతనమై నదంతా మహత్తరమైనదని నెత్తిన పెట్టుకొని, నాలాం టి నవీనులు రాసిందంతా నిస్సారమని భావించకం డి’ అని మొరపెట్టుకొన్నాడు. బాణభట్టు తన కావ్యం తన సమకాలిక విమర్శకులకు నచ్చలేదని బాధపడి, దాన్ని నిప్పులో గిరవాటు వేశాడట. చాలా వరకు కాలి పోగా, దుఃఖావేశం తగ్గిన తరవాత కొడుకు సహాయం తో దాన్ని మళ్లీ మొత్తం తిరగరాసుకొన్నాడట. భవభూతి కూడా సమకాలికుల విమర్శల బాధి తుడే. ‘అయ్యా, లోకంలో నా కావ్యం చూసి పెదవి విరి చే వాళ్లు ఉంటే ఉండచ్చుగాక. వాళ్ల జ్ఞానమూ పాం డిత్యమూ వాళ్లవి. నేను రాసేది వాళ్ల కోసం కాదు. ఈ అనంత కాలచక్రంలో, ఈ విశాల విశ్వంలో నాలాంటి మనోధర్మం కలవాడు మరొకడు పుట్టకనూ పోడు, నా కావ్యంవల్ల ప్రయోజనం పొందకనూ పోడు!’’ అన్నాడు. నిజానికి, ఒక మహానుభావుడి కళాఖండానికి, అతని సమకాలికుడై అదే రంగంలో ఉన్న మరో మహానుభావుడు బహిరంగంగా ‘ఆహా, ఓహో’ అని వివిధ కారణాల వల్ల ‘పెద్ద’ మనిషి తరహా మెచ్చుకోలు ప్రకటించవచ్చు గాని, పూర్తిగా, హృదయపూర్వకంగా ప్రశంసించటం కష్టమే. దీనికి చాలా కారణాలు. మాన వ సహజమైన స్పర్థ, సంకుచితత్వం ఒక కారణం. దోష రహితం అని ప్రశంసించదగ్గ కళాఖండాలు చాలా చాలా అరుదు కావడం మరొక కారణం. అభి రుచులు భిన్నంగా ఉండటం ఇంకో కారణం. రాసు కొన్న కవికి తన కవిత్వం పట్ల ఉండే మమత్వం, విమ ర్శకులకు ఉండకపోవటం మరో కారణం. పైగా, మని షికి తన ముందు తిరుగుతున్న సాటి మనిషిని మహాక విగా కళాకారుడిగా గుర్తించటం, తేలిక కాదు. ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అని చేమకూర వెంకట కవిరాజు, తన కావ్యంలో వసంతాన్ని వర్ణిస్తూ శ్లేషిస్తాడు. అయితే నిజమైన ప్రతిభ ఊరికే పోదు. స్పర్థవల్ల సమకాలికులు మెచ్చలేకపోయినా, తరవాతి కాలం లోనైనా గుర్తింపు వచ్చి తీరుతుంది. అందుకే గొప్ప కవులూ, కళాకారులూ మరణానంతరం కూడా, జరామరణాలు లేని కీర్తికాయాలతో చిరకాలం నిలిచి ఉంటారు. ఎం.మారుతిశాస్త్రి -
మహాదాత
జ్యోతిర్మయం ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరిచేయించండి’ అని. చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు: ‘నాయ నా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే. కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’ ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదిం చిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు. ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాప మా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు. ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు. ఎం. మారుతిశాస్త్రి -
బిల్వ పత్రం
జ్యోతిర్మయం ఎందుకో గానీ, బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు. నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు. బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు. వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది. ‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఎం. మారుతిశాస్త్రి -
అజ్ఞాతవాసం
జ్యోతిర్మయం జీవితం కష్టసుఖాల కలగలుపు. ఆ రెంటినీ ఒకే రక మైన స్థిరచిత్తంతో ఎదుర్కొనటమే ధీరలక్షణం. సుఖా లు అనుభవించటానికి ప్రత్యేక శక్తులేవీ అక్కర్లేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, వాటిని ఎదుర్కొని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం, సహన శక్తి కావాలి. ఎదురైన కష్టాలను ఎంత స్థైర్యంతో ఎదుర్కొన్నాడన్నదే మనిషి గుణగణాలకు గీటురాయి. పాండవుల అజ్ఞాతవాస ఘట్టం ఈ విషయానికి చక్కని దృష్టాంతం. కాలం కలసి రానప్పుడు ఆ మాన ధనులూ, మహావీరులూ ఎదుర్కొన్నంత కఠినమైన పరీక్షలూ, కటువైన పరాభవాలూ ఎదుర్కొన్న వారు మరెవరూ కనబడరు! రాజసూయయాగం చేసిన మహారాజు, సాక్షాత్తూ రూపుకట్టిన ధర్మమని అంద రూ మెచ్చుకొనే ధర్మనందనుడు, విరాటుడి కొలువులో రాజుకు వినోద భాషణలతో, జూ దం ఆటలతో, ఇచ్చకాల ముచ్చట్ల తో వేడుక జేసే సేవావృత్తిలో చేరవ లసివచ్చింది. క్రోధంతో విరాట రా జు నిండు కొలువులో తన ముఖం మీదికి పాచికలు విసిరి గాయప రిస్తే సహించాడు. కిమ్మీర, బకాసురులను అవలీలగా యమ మందిరానికి పంపిన మహాబలుడు భీముడు, గరిటె తిప్పి గరగరగా కూడూ, కూరా వండి పెట్టే వలలుడుగా కాలం గడిపాడు. కీచకుడు, అతని నూట అయిదుగురు తమ్ముళ్లు తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తుంటే, సమయం వచ్చేదాకా చేతులు ముడుచు కొని కూర్చోవలసి వచ్చింది. ఖాండవవనాన్ని దహింపచేసిన వాడూ, శివుడి తోనే తలపడి ఆయనను మెప్పించిన అస్త్ర విద్యా కుశ లుడు, ఇంద్ర సింహాసనంలో అర్థభాగం అలంకరిం చిన లోకోత్తరుడైన మహా యోధ అర్జునుడు, పేడి వాడై అంతఃపుర స్త్రీలకు ఆటలు పాటలూ నేర్పాల్సివచ్చింది. అతిలోక సుందరుడు నకులుడు అశ్వపాలుడయ్యాడు. సహదేవుడు గోపాలకుడయ్యాడు. ఇక ద్రౌపది? ఆమె అజ్ఞాతవాసంలో ఎదుర్కొన్న అవమానాలు హృదయాన్ని ద్రవింపజేసేవి. రాజసూయ యాగపు అవబృథ స్నానంతో శుచి అయిన ఆ మహారాజ్ఞి, పరుల పంచన సైరంధ్రి కావటమేమిటి? కామాంధుడైన కీచకుడి ఇంటి నుంచి కల్లు పాత్ర తెచ్చేందుకు నియమితమవడమేమిటి? ఆ దుష్టుడి చేత నిండు కొలువులో పరాభవం పొందటమేమిటి? ఉపకీచకులు ఆమెను కీచకుడి పాడె మీద బంధించి పురవీధులగుండా శ్మశానానికి పంపటమేమిటి? ఆమెని అవమానించిన అధమాధములంతా ఆమె కళ్లముందే క్షుద్ర జంతువులకంటే హీనమైన, చావులు చావటం ఆమె సాధ్వీత్వాన్ని నిరూపించి, ధర్మ విజయాన్ని స్థాపిస్తుంది. భీముడు కీచకుడిని అతి భయంకరంగా చంపి, కాలూ కేలూ డొక్కలోకి తోసి అతని కళేబరాన్ని ‘పీనుగు ముద్ద’గా చుట్టి, బంతిని తన్నినట్టు తన్ని, అతని పాతకానికి తగిన ప్రతీకారం చేస్తాడు. ఉపకీచకులను పరలోకానికి చేరుస్తాడు. ధర్మాధర్మాల మధ్య నిరంతరం జరిగే సంఘర్ష ణకు వేదిక మన చుట్టూ కనిపించే లోకం. తాత్కాలి కంగా ధర్మం. సత్యం అనే విలువలు, పాపం చేతా, బొంకు చేతా దెబ్బతిన్నట్టు కనిపించినా దైవ సహా యంతో చివరికి ధర్మం నిలబడక మానదు. సత్యం జయించక మానదు. అధర్మం శిక్ష పొందకా మానదు అని పదే పదే ఘోషిస్తుంది మహా భారతం. ఎం. మారుతిశాస్త్రి -
ఖరము పాలు
జంతువులన్నింటిలో గాడిద అంటే మనుషులకు చాలా తక్కువ అభిప్రాయం. తరతరాలుగా ఆ మూగ జీవి చేత గాడిద చాకిరీ చేయించుకొని దాన్నే అనేక విధాలుగా ఆడిపోసుకొనే ఆనవాయితీ అన్ని దేశా ల్లోనూ, భాషలలోనూ కనిపిస్తుంది. ‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అన్నారు వేమన. ఆయనకు గోవు మీద భక్తి ఉంటే ఉండవచ్చుగాక. మధ్యలో గాడిదను తెచ్చి నిందించటం ఎందుకు? ఈ రోజు ఆధునిక శాస్త్ర జ్ఞులు గాడిద పాలకు విశిష్టత ఉంది అంటున్నారు. ప్రాచీన కాలంలోనే, గాడిద పాల గొప్పతనాన్ని పాశ్చా త్య వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రాటిస్ గుర్తించాడు. జ్వరాలకు, కాలేయ జబ్బులకూ, విషాహారానికీ, ఆఖరికి కీళ్ల నొప్పు లకూ అవి దివ్యౌషధమని ఆయన ఆనాడే చెప్పాడు. అతిలోక సుం దరి క్లియోపాత్రా రోజూ గాడిద పాలతో స్నానం చేసేదట. ఆమె అందం వెనక రహస్యాలలో అదొకటని వేమన గారికి తెలియకపోతే పాపం గాడిద ఏం చేస్తుంది? వేమన అంతగా ఈసడించుకొన్న గాడిద పాలు, తల్లి పాలు లభించని పసిపిల్లలకు అమృతప్రాయం. మనుషులలో తల్లి పాలకు ఉండే సుగుణాలన్నిటికీ గాడిద పాల లక్షణాలు సన్నిహితంగా ఉంటాయి. ఆవు పాల కంటే గాడిద పాలలో క్యాలరీలు తక్కువ, కొవ్వు తక్కువ, కొలెస్టరాల్ తక్కువ. ఇన్ని సద్గుణాలు ఉండ బట్టే, ప్రస్తుతం కొన్ని దేశాలలో గాడిద పాల వాడకం, అమ్మకం పెంచేందుకు వ్యాపార సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎటొచ్చీ గాడిద పాల ఖరీదు చాలా ఎక్కువ. లీటరు యాభై డాలర్లపై మాటే. అంటే మూడు వేల రూపాయల పైచిలుకు. అందుకే అందరికీ అందుబాటు లో ఉండేలా, పాశ్చాత్య దేశాల్లో కొన్ని కంపెనీలు వాటి ని ఉగ్గుగిన్నెడు రెండు డాలర్ల చొప్పున అమ్ముతున్నాయి. అవును మరి, మంచి పోషణ ఉన్న జెర్సీ ఆవు రోజుకు ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది. గాడిదలు తలకు రోజుకు ఒక్క లీటరు పాలు మించి ఇవ్వవు, అదీ పిల్ల గాడిదను దగ్గర ఉంచి జాగ్రత్తగా స్వహస్తాలతో పిండుకొంటేనే. మరి ఇంకా అంటారా ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అని? గాడిదలో కొంచెం ఇబ్బందికరమైన గుణం ఒకటే. మొండితనం! అది యజమాని పట్ల ఎంతో విశ్వా సంగా ఉంటుంది, ఎన్నో రకాల అడ్డమైన చాకిరీ చేస్తుం ది, కానీ తను చెయ్యగూడదనుకొన్న పని మాత్రం నయానా భయానా ఎంత చెప్పినా చెయ్యదు. ఈ మొండితనం మనకు నచ్చితే దాన్ని స్వేచ్ఛా ప్రీతీ, పట్టుదలా, దృఢనిశ్చయం అని మెచ్చుకొంటాం. నచ్చకపోతే, శఠం, హఠం, రెటమతం అని గాడిదను ఈసడించుకొన్నట్టే ఈసడించుకొంటాం. లోకం పోకడ! ఎం. మారుతి శాస్త్రి -
లలాట లిఖితం
జ్యోతిర్మయం ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని ‘తలరాత’ ఆ పుర్రె మీద ఇం కా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూ హలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చది వాడట. పొడి పొడి మాటలలో, ‘జన్మ ప్రభృతి దారిద్య్రం, దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’ (పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదే ళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది. నారదుడికి ఆశ్చర్యం వేసింది. ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారా గార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమి టి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు. ‘ఇత గాడు నిష్ఠ దరిద్రుడే. దిక్కులేకుం డా మరణించిన మాటా నిజమే. కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపా లాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?’’ అన్నాడట బ్రహ్మ! బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పిం చుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఓ నమ్మకం. ‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం/ తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’ (విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) అని చెప్పాడు భర్తృహరి. మరి అంతా బ్రహ్మ రాతే అయితే ఇక మనిషి కర్మ లకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా? బోలెడంత ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం? అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే. బ్రహ్మ రాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే. దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది. మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు. బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే. ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు. మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే. బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించు కోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే. ఎం. మారుతి శాస్త్రి -
శుభమస్తు-భద్రమస్తు
ప్రపంచ వ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీణిస్తున్న ఈ కాలంలో నిజానికి అతి ప్రముఖ వ్యక్తుల భద్రత పౌరరక్షణ యంత్రాంగాలకు సమస్యగానే తయారైంది. ‘భద్రత’ అనే రూపం, క్షేమంగా సురక్షితంగా ఉంచటం, కాపుదల అనే అర్ధంలో, మామూలు సంస్కృత నిఘంటువులలో కనిపించదు. ఆ పదాన్ని తెలుగు వార్తా మాధ్యమాలు తరచుగా వాడుతుంటాయి. ‘దేశ భద్రత’, ‘భద్రతా ఏర్పాట్లు’, ‘అభద్రతా భావాలూ’, భద్రతా సంఘం లాంటి మాటలు వార్తా పత్రికలలో రోజూ కనిపిస్తాయి. ఈ ‘భద్రత’ ఆధునిక కాలంలో (గత నూరే ళ్లలో) ప్రచారంలోకి వచ్చిన ప్రయోగంగా కనిపిస్తుంది. ‘భద్రం’ అనే పదం మంగళం, శుభం అనే అర్ధాల్లో వాడటం మాత్రం ప్రపంచ చరిత్రలో అతి ప్రాచీనమైన గ్రంథాలుగా భావించే వేదాల నాటి నుంచీ కనిపిస్తుంది. ‘ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః (అన్ని వైపుల నుండి మాకు మంగళకరమైన ఆలోచనలే వచ్చి చేరుగాక!) అని పేద ద్రష్టమైన మహ ర్షులు ఆకాంక్షించారు. ’భద్రం కర్ణేభిః శృణుయామ, ’భద్రం పశ్యేమ అక్షభిః’ (చెవులతో మంగళ ప్రదాలైన విషయాలే వినెదము గాక, కళ్లతోమంగళ ప్రదాలైన విషయాలే చూచెదము గాక!) అని శాంతి మంత్రాలలో ప్రార్థించటం కనిపిస్తుంది. ఇక్కడ ‘భద్రం’ అనే మాటకూ, ఇప్పుడు వాడుకలో ఉన్న ‘భద్రత’ అనే మాటకూ అర్ధంలో సంబంధం ఏమన్నా ఉంటే అది దూరపు సంబంధం. రామాయణం సుందరకాండలో హనుమంతుడు, లంకంతా గాలించి సీత జాడ కనుక్కోలేక దిగులుపడి పోతాడు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిరుత్సాహం కలుగుతుంది. కానీ అంతలో తమాయించుకొంటాడు. ’మర ణించి సాధించగలిగేది ఏమీ లేదు. ఆత్మహత్యా పాతకం తప్ప. జీవస్ భద్రాణి పశ్యన్తి - బ్రతికి ఉంటే శుభఫలాలు (‘భద్రాణి’) సాధించవచ్చు అనుకొం టాడు. ఇక్కడా అంతే. భద్రాణి అనే పదానికి శుభాలు అనే అర్ధం తప్ప సరక్ష, కాపుదల అనే అర్థం పొసగదు. రామభద్రుడు, బలభద్రుడు, వీరభద్రుడు లాంటి పేర్లలో భద్రుడు అంటే శ్రేష్టుడు అని అర్ధం. భద్ర గజం అంటే శుభ లక్షణాలు గల భద్ర జాతి గజం. అలాంటి ఏనుగును, మహారాజుల ఊరేగింపులకు, ఉత్సవాలకు వాడే వాళ్లు. చేమకూర వేంకటకవి తన ‘విజయ విలాసం’లో సుభద్ర-అర్జునుల కల్యాణ వైభవాన్ని వివరంగా వర్ణిస్తాడు. సుభద్ర చెలికత్తెలు అర్జునుడిని చూసి అనుకొన్నారట: ‘మంచి మగడు వలయునంచు కోరుచు నుండ, మంచి మగడు దొరకె మఘవ సుతుడు; మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు, మనసు భద్రమయ్యె మనకు నెల్ల:’ అని. ప్రతి పద్యంలో ఓ చమత్కారం చూపే చేమకూర కవి ఈ పద్యంలో రెండు చమత్కారాలు చూపించాడు. మొదటి సగంలో ఒక చక్కని శ్లేష, రెండో సగంలో ఒక సొగసైన యమకం తగిలిం చాడు. (మన చెలి సుభద్రకు మంచి మొగుడు దొరకాలని మనమందరం కోరుకొన్నట్టే, మంచి మగధీరుడైన ఇంద్రసుతుడు దొరికాడు. మన సుభద్ర అదృష్టాన్ని ఎంతని పొగడగలం? ఇప్పుడు మనందరికీ మనసు భద్రమై, కుదుట పడినట్టే!). ఇక్కడ మన సుభద్ర చెలుల మనసు ‘భద్రం’ అవటంలో, ‘భద్రం’ పదానికి అర్ధం. ఈ రోజుల్లో మనం వాడే భద్రత అనే పదం అర్థానికి కొంచెం దగ్గరగా ఉంది. ‘భద్రుడు’ అనే పర్వతశ్రేష్టుడు బహుకాలం తపసు చేసి వరం పొంది తెలుగువారి ఆరాధ్యదైవాలైన సీతారాములను ‘భద్రం’గా తన కొండ మీద కూర్చోబెట్టుకొన్నాడు. వాళ్లు ఆ భద్రాద్రి మీద స్థిర నివాసం చేస్తూ తెలుగు ప్రజలను ‘భద్రం’గా కాపాడుతున్నారు! ఏకశిలా నగరంలో వెలసిన దుర్గమ్మ భక్తులకు అన్ని శుభాలు కలిగిస్తుంది. కనుక ఆమెకు కూడా భద్రకాళి అనే సార్థక నామం దక్కింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో అక్కడక్కడా ‘జేబులు భద్రం’ అని బోర్డుల మీద హెచ్చరికలు దర్శనమిస్తుంటాయి. జాగ్రత్త అనే అర్థంలో. అలాగే భాగ్య నగరం సిటీ బస్సుల్లో చాలా వాటిల్లో డ్రైవర్ గారి ముందు ఒక ‘భద్రతా’ సూచన పెద్దక్షరాలలో కనిపిస్తుంటుంది. ‘జరా భద్రం డ్రైవరన్నా’! అని. హెచ్చ రిక జోరుగా బైకూ, కారూ తోలే కుర్రకారూ పాటించవలసినదే. పాద చారులు మాత్రం జరా భద్రంగా ఉంటే చాలదు. పూర్తి భద్రంగా నడుచు కోవాలి. లేకపోతే వాళ్ల ‘భద్రత’కు ప్రమాదమే! ఎం. మారుతిశాస్త్రి