శుభమస్తు-భద్రమస్తు
ప్రపంచ వ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీణిస్తున్న ఈ కాలంలో నిజానికి అతి ప్రముఖ వ్యక్తుల భద్రత పౌరరక్షణ యంత్రాంగాలకు సమస్యగానే తయారైంది. ‘భద్రత’ అనే రూపం, క్షేమంగా సురక్షితంగా ఉంచటం, కాపుదల అనే అర్ధంలో, మామూలు సంస్కృత నిఘంటువులలో కనిపించదు. ఆ పదాన్ని తెలుగు వార్తా మాధ్యమాలు తరచుగా వాడుతుంటాయి. ‘దేశ భద్రత’, ‘భద్రతా ఏర్పాట్లు’, ‘అభద్రతా భావాలూ’, భద్రతా సంఘం లాంటి మాటలు వార్తా పత్రికలలో రోజూ కనిపిస్తాయి. ఈ ‘భద్రత’ ఆధునిక కాలంలో (గత నూరే ళ్లలో) ప్రచారంలోకి వచ్చిన ప్రయోగంగా కనిపిస్తుంది.
‘భద్రం’ అనే పదం మంగళం, శుభం అనే అర్ధాల్లో వాడటం మాత్రం ప్రపంచ చరిత్రలో అతి ప్రాచీనమైన గ్రంథాలుగా భావించే వేదాల నాటి నుంచీ కనిపిస్తుంది. ‘ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః (అన్ని వైపుల నుండి మాకు మంగళకరమైన ఆలోచనలే వచ్చి చేరుగాక!) అని పేద ద్రష్టమైన మహ ర్షులు ఆకాంక్షించారు. ’భద్రం కర్ణేభిః శృణుయామ, ’భద్రం పశ్యేమ అక్షభిః’ (చెవులతో మంగళ ప్రదాలైన విషయాలే వినెదము గాక, కళ్లతోమంగళ ప్రదాలైన విషయాలే చూచెదము గాక!) అని శాంతి మంత్రాలలో ప్రార్థించటం కనిపిస్తుంది. ఇక్కడ ‘భద్రం’ అనే మాటకూ, ఇప్పుడు వాడుకలో ఉన్న ‘భద్రత’ అనే మాటకూ అర్ధంలో సంబంధం ఏమన్నా ఉంటే అది దూరపు సంబంధం.
రామాయణం సుందరకాండలో హనుమంతుడు, లంకంతా గాలించి సీత జాడ కనుక్కోలేక దిగులుపడి పోతాడు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిరుత్సాహం కలుగుతుంది. కానీ అంతలో తమాయించుకొంటాడు. ’మర ణించి సాధించగలిగేది ఏమీ లేదు. ఆత్మహత్యా పాతకం తప్ప. జీవస్ భద్రాణి పశ్యన్తి - బ్రతికి ఉంటే శుభఫలాలు (‘భద్రాణి’) సాధించవచ్చు అనుకొం టాడు. ఇక్కడా అంతే. భద్రాణి అనే పదానికి శుభాలు అనే అర్ధం తప్ప సరక్ష, కాపుదల అనే అర్థం పొసగదు.
రామభద్రుడు, బలభద్రుడు, వీరభద్రుడు లాంటి పేర్లలో భద్రుడు అంటే శ్రేష్టుడు అని అర్ధం. భద్ర గజం అంటే శుభ లక్షణాలు గల భద్ర జాతి గజం. అలాంటి ఏనుగును, మహారాజుల ఊరేగింపులకు, ఉత్సవాలకు వాడే వాళ్లు.
చేమకూర వేంకటకవి తన ‘విజయ విలాసం’లో సుభద్ర-అర్జునుల కల్యాణ వైభవాన్ని వివరంగా వర్ణిస్తాడు. సుభద్ర చెలికత్తెలు అర్జునుడిని చూసి అనుకొన్నారట: ‘మంచి మగడు వలయునంచు కోరుచు నుండ, మంచి మగడు దొరకె మఘవ సుతుడు; మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు, మనసు భద్రమయ్యె మనకు నెల్ల:’ అని. ప్రతి పద్యంలో ఓ చమత్కారం చూపే చేమకూర కవి ఈ పద్యంలో రెండు చమత్కారాలు చూపించాడు. మొదటి సగంలో ఒక చక్కని శ్లేష, రెండో సగంలో ఒక సొగసైన యమకం తగిలిం చాడు. (మన చెలి సుభద్రకు మంచి మొగుడు దొరకాలని మనమందరం కోరుకొన్నట్టే, మంచి మగధీరుడైన ఇంద్రసుతుడు దొరికాడు. మన సుభద్ర అదృష్టాన్ని ఎంతని పొగడగలం? ఇప్పుడు మనందరికీ మనసు భద్రమై, కుదుట పడినట్టే!). ఇక్కడ మన సుభద్ర చెలుల మనసు ‘భద్రం’ అవటంలో, ‘భద్రం’ పదానికి అర్ధం. ఈ రోజుల్లో మనం వాడే భద్రత అనే పదం అర్థానికి కొంచెం దగ్గరగా ఉంది.
‘భద్రుడు’ అనే పర్వతశ్రేష్టుడు బహుకాలం తపసు చేసి వరం పొంది తెలుగువారి ఆరాధ్యదైవాలైన సీతారాములను ‘భద్రం’గా తన కొండ మీద కూర్చోబెట్టుకొన్నాడు. వాళ్లు ఆ భద్రాద్రి మీద స్థిర నివాసం చేస్తూ తెలుగు ప్రజలను ‘భద్రం’గా కాపాడుతున్నారు! ఏకశిలా నగరంలో వెలసిన దుర్గమ్మ భక్తులకు అన్ని శుభాలు కలిగిస్తుంది. కనుక ఆమెకు కూడా భద్రకాళి అనే సార్థక నామం దక్కింది.
రద్దీగా ఉండే ప్రదేశాలలో అక్కడక్కడా ‘జేబులు భద్రం’ అని బోర్డుల మీద హెచ్చరికలు దర్శనమిస్తుంటాయి. జాగ్రత్త అనే అర్థంలో. అలాగే భాగ్య నగరం సిటీ బస్సుల్లో చాలా వాటిల్లో డ్రైవర్ గారి ముందు ఒక ‘భద్రతా’ సూచన పెద్దక్షరాలలో కనిపిస్తుంటుంది. ‘జరా భద్రం డ్రైవరన్నా’! అని. హెచ్చ రిక జోరుగా బైకూ, కారూ తోలే కుర్రకారూ పాటించవలసినదే. పాద చారులు మాత్రం జరా భద్రంగా ఉంటే చాలదు. పూర్తి భద్రంగా నడుచు కోవాలి. లేకపోతే వాళ్ల ‘భద్రత’కు ప్రమాదమే!
ఎం. మారుతిశాస్త్రి