ఢిల్లీ ఎన్నికలకు నగారా
- వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు
- 13న తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. సోమవారమిక్కడ కమిషనర్లు హెచ్‌ఎస్ బ్రహ్మ, నసీమ్ జైదీలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో 1.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎన్నికలు లేకపోవడంతో ఢిల్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు తమ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ కిందటేడాది నవంబర్ 4న రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన గడువు ఫిబ్రవరి 15న ముగియనుంది. ఎన్నికల కోసం 11,736 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ , కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అసెంబ్లీ స్థానం సహా వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమబెంగాల్‌లోని బంగోన్ లోక్‌సభ స్థానానికి కూడా ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తామని వీఎస్ సంపత్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జారీ చేసిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి సంతకం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తన రాజ్యాంగ అధికారాలను ఎప్పుడు వాడాలో ఆయన(రాష్ట్రపతి)కు తెలుసు’ అని సంపత్ పేర్కొన్నారు.
వ్యూహ రచనల్లో పార్టీలు..
షెడ్యూల్‌కు ముందే ఢిల్లీలోని ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నాయి. ఆప్ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పోస్టర్లు, హోర్డింగులు, ఎస్‌ఎంఎస్‌లు, రేడియో సందేశాలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది. గడిచిన రెండు నెలల్లో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 55 సభలు నిర్వహించారు. విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. తమ 49 రోజుల పాలనలోని విజయాలను ప్రధానంగా పేర్కొంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.
ఇక ప్రధాని మోదీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరంలో బీజేపీ శ్రేణులు మోదీ పోస్టర్లు, హోర్డింగులను పెద్దఎత్తున ఏర్పాటు చేశా యి. ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ.. మరో ఐదారు సభలకు హాజరవుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా మునుపెన్నడూ లేని రీతి లో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది. అయితే ప్రచారపరంగా ప్రత్యర్థి పార్టీల కన్నా వెనుకబడి ఉంది. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది.