కాలభైరవం భజే | In Kashi Kalabhairava Worshiped Vishwanath With Reverence | Sakshi
Sakshi News home page

కాలభైరవం భజే

Published Sun, Dec 1 2019 5:01 AM | Last Updated on Sun, Dec 1 2019 5:01 AM

In Kashi Kalabhairava Worshiped Vishwanath With Reverence - Sakshi

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరనే సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే ఐదు ముఖాలు ఉంటాయి. ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘బ్రహ్మం ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మాన్ని కదా’ అన్నాడు. అపుడు బ్రహ్మ వినకుండా వితండ వాదన చేయడంతో ఈశ్వరుడి భృకుటి నుంచి ఒక వింతకాంతి బయల్దేరి, చూస్తుండగానే ఒక నల్లని, భయంకర దిగంబర రూపాన్ని సంతరించుకుంది. ఆ ఆకారమే కాలభైరవుడు. శివుడి ఆజ్ఞమేరకు భైరవుడు బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేశాడు. దాంతో బ్రహ్మలోని తామస గుణం నశించి, ‘ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి నన్ను కాపాడు’ అన్నాడు. శంకరుడు శాంతించాడు. అయితే బ్రహ్మ తల గిల్లేసిన కాలభైరవుని చేతినుంచి ఎంత యత్నించినా ఆ తల ఊడిపడక పోవడంతో విష్ణువు కాలభైరవునితో ‘‘కాలభైరవా! నీవు  బ్రహ్మ తలను తెంపినందున నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది.

నీవు కాశీనగరానికి వెళ్లి, అక్కడి విశ్వనాథుని సేవించు’’ అని చెప్పాడు. ఈ మేరకు  కాశీకి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే.. నేటి కాశీక్షేత్రంలోని ‘కపాల మోక్షతీర్థం’. కాశీలో కాలభైరవుడు విశ్వనాథుడిని భక్తితో పూజించి తరించాడు. శివుడు అతని భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. ‘‘కాలభైరవా! ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినపుడు ఎవరు నీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపాన్ని తీసేసే శక్తిని నేను నీకు ఇస్తున్నాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’’ అని చెప్పాడు.

అందుకే మనను కాశీక్షేత్రంలోని అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక ‘అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపాలను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్నసంతర్పణ చేయడం ఆనవాయితీ. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదం తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్‌ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయానికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్‌ అంటుంది.

అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరాలను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. ‘మేము కాశీ వెళ్ళాము.. మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. వాళ్ళు శత్రుబాధ, పిశాచ బాధ లేకుండా ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా  ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement