ఈవారం 'స్పూర్తిదాయకమైన కథ'
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసారయాత్ర కొనసాగిస్తూనే, జపతపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు.
ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే, భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి, విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురూ చంటిబిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి, తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లడంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని, అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు.
త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, ‘నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా?’ అని అడిగాడు.
‘స్వామీ! మన పుత్రులు ఇంకా పెద్దవాళ్లు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్లి, ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వానప్రస్థానానికి వెళ్లిపోదాం’ అని చెప్పింది.
అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరడానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు.
యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి, దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ, అతడికి సహాయంగా వెళ్లవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు.
అత్రి మహర్షి అందుకు ‘సరే’నని సమ్మతించి, పృథు చక్రవర్తి కొడుకుతో కలసి యాగాశ్వం వెంట బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగవైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి, యాగాశ్వాన్ని అపహరించుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగాశ్వాన్ని అపహించుకుపోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు.
అప్పుడు అత్రి మహర్షి, ‘కుమారా! యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిస్సంశయంగా నువ్వు ఇంద్రుడిని ఎదిరించు’ అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శరపరంపరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి, పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా, ఇంద్రుడు మాయరూపంలో మళ్లీ యాగాశ్వాన్ని అపహరించాడు. పృథుచక్రవర్తి కుమారునికి యాగాశ్వం ఎలా అదృశ్యమైందో అర్థంకాలేదు. కంగారు పడ్డాడు.
అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్యదృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్లీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. ‘నాయనా! ఇంద్రుడే మళ్లీ యాగాశ్వాన్ని తస్కరించుకుపోయాడు’ అని రాకుమారుడితో చెప్పాడు.
కోపోద్రిక్తుడైన పృథు కుమారుడు ఇంద్రుడిని తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టి, మళ్లీ పారిపోయాడు. ఈసారి పృథు కుమారుడు యాగాశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగినదంతా చెప్పాడు.
యాగాశ్వ సరంక్షణలో అత్రి మహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి, కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ‘ఒక మానవమాత్రుడిని ఇంతగా పొగడటం తగదు’ అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ‘ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని, దీనిలోని ధర్మాధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు’ అన్నాడు.
కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలను వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ‘ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణుః పృథివీపతిః అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే’ అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి, అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి, ఆయనకు కోరిన ధనరాశులనిచ్చి, సాదరంగా సాగనంపాడు.
— సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment