పౌరాణిక జ్ఞానం
శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?
బ్రహ్మకి మూడు తలలే కనిపిస్తాయెందుకు?
శివుడు లయకర్త. లయమంటే ముగింపు. అది జరిగేది శ్మశానంలోనే కదా! అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. బ్రహ్మకి అసలు శిరస్సులు ఐదు. శంకరుడు ఒకటి ఖండిస్తే నాలుగు తలలవాడయ్యాడు. మనం గోడమీద చెక్కిన శిల్పాన్ని చూస్తూండడం వల్ల మూడు ముఖాలు కల్గినవానిగా కన్పిస్తూ ఉండవచ్చు గాని ఆయనకి నాలుగు దిక్కులనీ చూస్తూ నాలుగు ముఖాలు ఉంటాయి.
అప్సరసల్ని పంపి తపస్సును చెడగొట్టే లక్షణమున్న
ఇంద్రుడు దేవతలకు రాజెలా అయ్యాడు?
ఇంద్రునిది పరీక్షాధికారి పదవి. ఎవరైనా తపస్సు ప్రారంభించగానే వారిది ఏ స్థాయి తపస్సో, ఎంత గాఢ తపస్సో పరీక్షించవలసిన బాధ్యతనీ ధర్మాన్నీ దేవతలు ఈయన మీద ఉంచారు. అందుచేత ఇంద్రుడు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరింటిలోనూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తాడు. ఓడిపోవడమనేది (కామంలో మేనకతో విశ్వామిత్రుడు, క్రోధంలో అహల్య విషయంలో గౌతముడు.. ఇలా) ఆ రుషుల త ప్పు తప్ప, పరీక్షించ వచ్చిన అప్సరసలదీ కాదు- వారిని పంపించిన ఇంద్రునిది ఏమాత్రమూ కాదు!
దర్భలకి అంతటి పవిత్రత ఎలా వచ్చింది?
శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దాని పైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత.