సుందోపసుందులు | Puraniti story | Sakshi
Sakshi News home page

సుందోపసుందులు

Published Sun, Jul 31 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

సుందోపసుందులు

సుందోపసుందులు

పురానీతి
పూర్వం హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే కొడుకులు ఉండేవారు. వారిద్దరికీ ముల్లోకాలనూ జయించాలనే కోరిక ఉండేది. అంతటి ఘనకార్యం ఘోర తపస్సుతో తప్ప సాధ్యం కాదని తలచి, అన్నదమ్ములిద్దరూ ఒక కీకారణ్యానికి చేరుకుని తపస్సు ప్రారంభించారు. మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి, వణికించే శీతకాలంలో జలాశయాల్లో మునిగి ఏళ్ల తరబడి ఘోర తపస్సు సాగించారు. వారి తపస్సు తీవ్రతకు ప్రకృతి గతి తప్పింది. ముల్లోకాలలో సంక్షోభాలు తలెత్తాయి. ఆ పరిస్థితికి దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు. వారి తపస్సును విరమించేలా చేయాలంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.
 
దేవతల గోడు విన్న బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. కామరూపం, కామగమనం వంటి సకల మాయావిద్యలను అనుగ్రహించాలని, తమకు ఇతరుల వల్ల మరణం రాకుండా ఉండేలా వరమివ్వాలని, అమరత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అమరత్వం తప్ప వారు కోరుకున్న మిగిలిన వరాలన్నింటినీ ప్రసాదించాడు బ్రహ్మదేవుడు.
 
అసలే రాక్షసులు, ఆపై బ్రహ్మదేవుడి వరాలు కూడా పొందినవారు. ఇక ఆగుతారా..? వరగర్వంతో నానా అకృత్యాలూ ప్రారంభించారు. మునులు తలపెట్టిన యజ్ఞయాగాలకు భంగం కలిగించసాగారు. కామరూప విద్యతో క్రూరమృగాల రూపం ధరించి, ఊళ్లపై పడి అమాయక ప్రజలను పీడించసాగారు. వారి దాష్టీకాలకు లోకమంతా హాహాకారాలు మిన్నుముట్టసాగాయి. సుందోపసుందులను ఎలా నియంత్రించాలో అర్థంకాక మునులందరూ బ్రహ్మదేవుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. ‘దేవా! నీవిచ్చిన వరాల ప్రభావంతోనే సుందోపసుందులు చెలరేగిపోతున్నారు.

లోకులను నానా రకాలుగా పీడిస్తున్నారు. వారి పీడ విరగడయ్యే పరిష్కారం నువ్వే చూడాలి’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు.  ‘వారికి నేను అన్ని వరాలూ ఇచ్చానే గాని, అమరత్వాన్ని ప్రసాదించలేదు. నేనిచ్చిన వరం వల్ల ఇతరుల చేతుల్లో వారి మరణం అసంభవం. వారిలో వారికే కలహం వచ్చి, పరస్పర యుద్ధానికి దిగితే తప్ప వారి పీడ విరగడ కావడం సాధ్యం కాదు’ అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే, కలహించుకోవడానికి సుందోపసుందులు పరస్పర శత్రువులేమీ కాదు. ఒకరిపై మరొకరికి అనురాగం గల అన్నదమ్ములు. వాళ్ల మధ్య కలహం పుట్టించడం ఎలా అన్నదే సమస్య. దీనికి ఏం చేయాలో తోచని బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ సమావేశపరచాడు. తానిచ్చిన వరాల వల్ల గర్వాంధులైన సుందోపసుందులు ముల్లోకాలనూ ఎలా పీడిస్తున్నదీ వివరించాడు. వారి పీడ విరగడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు.
 
అప్పుడు విశ్వకర్మ ముందుకు వచ్చి ‘అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించడానికి ఆడది చాలు. నేను సృష్టించిన అప్సరస తిలోత్తమ ఆ పనిని అవలీలగా సాధించగలదు’ అని పలికాడు. విశ్వకర్మ మాటలతో బ్రహ్మదేవుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఇంద్రసభలో ఉన్న తిలోత్తమకు కబురు పంపాడు. బ్రహ్మదేవుడి వర్తమానం అందడంతో జగదేక సుందరి అయిన తిలోత్తమ బ్రహ్మ సమక్షానికి వచ్చి నిలుచుంది. ‘నీ అందచందాలతో లోకాలను పీడిస్తున్న సుందోపసుందులను ఆకర్షించు. చాకచక్యంగా వాళ్లిద్దరి మధ్య కలహం పుట్టించు’ అని ఆదేశించాడు.

బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తిలోత్తమ భూలోకానికి చేరుకుంది. సుందోపసుందులకు కనిపించేలా వారు తరచూ సంచరించే వనంలో విహరించసాగింది. వన విహారానికి వచ్చిన సుందోపసుందులిద్దరూ ఒకేసారి ఆమెను చూశారు. ఆమె అందానికి వారి మతులు పోయాయి. ‘ప్రాణేశ్వరీ’ అంటూ సుందుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ‘హృదయేశ్వరీ’ అంటూ ఉపసుందుడు ఆమె మరో చేతిని పట్టుకున్నాడు. ఆమె నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. వారి వాదన ఎటూ తేలని స్థితిలో తిలోత్తమ చిరునవ్వులు చిందిస్తూ... ‘మీ ఇద్దరికీ నేనొకత్తెనే ఎలా భార్య కాగలను? మీరిద్దరిలో ఎవరు వీరులో వారిని నేను తప్పక పెళ్లాడతాను’ అని పలికింది.

ఎలాగైనా తిలోత్తమను దక్కించుకోవాలనే పట్టుదలతో సుందోపసుందులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇద్దరూ సమాన బలవంతులే. భీకరంగా పోరాడుకున్నారు. సింహనాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు కలబడి ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చివరకు ఇద్దరూ మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement