తండ్రికి నిరంతరం కొడుకు ధ్యాసే!
మహానుభావుడు, ధర్మవేత్త, గొప్ప ఆచార్యుడు, మహా పరాక్రమవంతుడయిన ద్రోణుడు–చేతిలో ఆయుధం ఉన్నంతసేపు యుద్ధరంగంలో ఆయనను ఆపగలిగిన వాడు లేడు. అంత విలువిద్యను పొందిన అర్జునుడే సాక్షాత్తూ ఎదురుగా నిలబడినా ఆపడం అసాధ్యం.అంతటి ద్రోణాచార్యుడు ఒక్కమాటకి పడిపోయాడు. కారణజన్ముడైన ధృష్టద్యుమ్యుడు యుద్ధరంగంలో ఎదురుగా కాచుకుని ఉన్నాడు, ఆయనని చంపడానికి. కుదరడం లేదు. కారణం–ద్రోణుడి చేతిలో ఆయుధం ఉంది. అది విడిచిపెడితే తప్ప చంపడం కుదరదు.
అసలు ద్రోణాచార్యుల వారితో యుద్ధమంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి.. ఆహా...ఎంత వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు... ధర్మజుణ్ణి పట్టిస్తానని మాటిచ్చాడు దుర్యోధనుడికి. ద్రోణాచార్యులవారు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరూ నిలబడలేక పోతున్నారు. ఇక ఇది సాగకూడదనుకున్న శ్రీకష్ణ భగవానుడు ధర్మం నిలబడాలి కనుక వ్యూహరచన చేసాడు. భీముడి చేత అశ్వత్థామ అనే ఏనుగుని పడగొట్టించేసాడు. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నాడు. చచ్చిపోయింది అశ్వత్థామ అనే ఏనుగయితే, ఏనుగు చచ్చిపోయిందని చెప్పకుండా ’అశ్వత్థామ చనిపోయాడు’ అన్నాడు. ద్రోణుడి కుమారుడి పేరు కూడా అశ్వత్థామ. అంతే! ద్రోణాచార్యుల వారు ముందు నమ్మలేదు. నిరుత్తరుడై పోయాడు. అయినా ఆయుధం ఇంకా చేతిలోనే ఉంది.
అది నిర్ధరణ చేసుకోవడానికి ధర్మరాజువంక తిరిగాడు. ’నిజమా !’ అని అడిగాడు శిష్యుణ్ణి. ఎంత సంఘర్షణో !!! ఎదురుగా ఉన్నవాడు గురువు. గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పడానికి నోరురావడం లేదు. నిన్నెవరు అబద్ధం చెప్పమన్నారయ్యా, నిజమే చెప్పు’ అన్నాడు శ్రీకష్ణ పరమాత్మ. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అను. కుంజరః అన్నప్పుడు మేం భేరీలు మోగిస్తాం’ అన్నాడు. ఎంతయినా గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. పైగా గురువుగారి మరణానికి కారణమవుతోందది. అయినా ధర్మరాజు ’అశ్వత్థామ హతః..కుంజరః’ అన్నాడు. ’కుంజరః’ అన్నప్పుడు భేరీలు మోగించారు.
’ అశ్వత్థామ హతః’ అన్నంత వరకే వినబడింది, కుంజరః అన్నది వినపడలేదు – ద్రోణా చార్యుల వారికి. అంతే ఆయుధం వదిలి పెట్టేసాడు. ఆయన ఎంతటి యోగమూర్తో తెలుసా! ఆయన ఆచార్య అనిపించుకున్నాడంటే కేవలం విలువిద్య ఒక్కటే కాదు ఆయన విశిష్టత. ఆయన ధర్మం అటువంటిది. ధర్మానికి నిలబడ్డవాడే ఆచార్యుడు తప్ప ప్రతి వాళ్లూ పేరు ముందు అసంబద్ధంగా తగిలించుకున్నంత మాత్రాన ఆచార్యులు కాలేరు. ఆయన అనుష్ఠానం అటువంటిది. ఆయుధాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మూలాధార చక్రం దగ్గర్నుంచీ యోగవిద్యతో ప్రాణవాయువును పైకి లేపి బ్రహ్మరంధ్రంగుండా నిష్కమ్రింప చేసాడు. అప్పుడు ధృష్ట్టద్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుడిని చంపాడు. అర్జునుడు ఎంత బాధపడ్డాడో, ధర్మరాజు ఎంత ఏడ్చాడో !
అంతటి మహానుభావుడు, అంతటి పరాక్రమశీలి, అంతటి ఆచార్యుడు కేవలం కొడుకు పడిపోయాడన్న మాటకూడా వినలేకపోయాడు. ఆ ఒక్క చిన్న పలుకు చంపేసిందంతే. కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటి వాడెంత నైరాశ్యానికి లోనయిపోతాడో, ఎంత బాధ పడిపోతాడో.. కొడుకు అంటే ప్రాణం వదిలి పెట్టేస్తాడు తండ్రి. సర్వకాలాల్లో కొడుకుకు రక్షణ కలిగించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో మరొక ఆలోచన లేకుండా ఉండేవాడు ఎవడో ఆయనే తండ్రి. కొడుకు సంతోషం తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే తండ్రి – బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలుగా ప్రత్యక్ష దైవంగా ఉంటాడు.