జ్ఞానగర్భుడు... వేదముఖుడు | A story About Brahma | Sakshi
Sakshi News home page

జ్ఞానగర్భుడు... వేదముఖుడు

Published Sun, Sep 16 2018 2:04 AM | Last Updated on Sun, Sep 16 2018 2:04 AM

A story About Brahma - Sakshi

సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మ. ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. సకల చరాచర సృష్టి ఆయన పని. ఆయనకు పూజార్హత  లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా ఆయన దర్శనమిస్తున్నాడు. వేదోద్ధారక గోవిందా అనే ఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠం తిరుమల గిరులకు పైన 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ఉంది. నిరంతర వేద ఘోషతో దానికి వేదగిరి అనే పేరు కూడా వచ్చింది. ఆ వేదపాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన బ్రహ్మ విగ్రహం కొలువు తీరి ఉంది.

పద్మంపై ఆసీనుడై నాలుగు తలలతో, నాలుగు చేతులతో ముందు వైపు నలుగురు వేదఋషులతో దర్శనమిచ్చేస్వామి రూపం అతి సుందరంగా శిల్పకళతో ఒప్పారుతుంది. బ్రహ్మ కుడిచేతిలో చిన్ముద్ర చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి, అలాగే వెనుక చేతులలో కుడివైపు జపమాల, ఎడమవైపు కమండలం పట్టుకుని ఉంటాడు. చిన్ముద్రలో చూపుడువేలు, బొటనవేలు కలిపి ఉంటుంది. తాత్త్వికంగా ఆలోచిస్తే చూపుడు వేలు జీవాత్మకు, బొటనవేలు పరమాత్మకు ప్రతీక. వీటిని రెంటినీ కలిపి ఉంచాలనే విషయాన్ని చిన్ముద్ర ద్వారా తెలుసుకోవాలి.ç ³#స్తకం జ్ఞానరూపం. సమస్త వేదసంపద పుస్తకరూపంలో ఆయన ఎడమచేతిలో నిలిచి ఉంది.

జపమాల ద్వారా నిరంతరం భగవన్నామ జపం చేయమనీ, కమండలం ద్వారా సమస్త సృష్టి నిర్మాణానికి జలం ఎంతో ప్రాముఖ్యమైనదనీ తెలుసుకోవాలి. ఆయన కర్ణకుండలాలతో, అనేక ఆభరణాలతో బ్రహ్మ సూత్రం ధరించి ఉదరబంధం అనే అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. ఈయన వాహనం హంస. బ్రహ్మ భార్యకు సరస్వతీ, గాయత్రీ, బ్రహ్మాణీ, సావిత్రి అనే పేర్లు ఉన్నాయి. సనత్కుమారుడు బ్రహ్మనిర్మాల్యధారి. బ్రహ్మకు ఎర్రటి పట్టు వస్త్రాలు ప్రియమైనవి. బ్రహ్మ ద్వారపాలకులు ఎనిమిది మంది. తెలుగునాట బ్రహ్మను ఆరాధించే సంప్రదాయం చాలా ప్రాచీనకాలం నుండి ఉంది.అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు అందుకు ప్రత్యక్షసాక్ష్యం. అథర్వవేద ఋషులు సాధించిన మనస్సంకల్పశక్తిని బ్రహ్మ అనే పేరుతో పిలిచారు. ధాత, విధాత, ప్రజాపతి అనే పేర్లతో ఆయనను పిలుస్తారు.

– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement