ప్రాచీన భారతంలో వ్యవసాయ తత్వం | Agricultural philosophy in ancient India | Sakshi
Sakshi News home page

ప్రాచీన భారతంలో వ్యవసాయ తత్వం

Published Sat, Dec 7 2024 4:14 AM | Last Updated on Sat, Dec 7 2024 4:14 AM

Agricultural philosophy in ancient India

హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. క్రీ.పూ. 2600లో నిర్మితమైన చైనా తొలి నగరం చాంగ్‌జౌలో కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం ఆనవాళ్లు దొరకలేదు. అంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. 

అయితే చైనా వ్యవసాయ తత్వం చైనా చరిత్రలో భాగం. అదే భారతదేశంలో అలా జరగలేదు. ఒక తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా భావించారు. పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. 

నా తాజా పుస్తకం ‘ద శూద్ర రెబెలియన్‌’ కోసం పరిశోధిస్తున్నప్పుడు, పూర్వ వేద కాలంలో వ్యవసాయవాదపు (అగ్రికల్చరిజం) తాత్విక ధార ఉందో లేదో తెలుసుకోవడానికి పురాతన భారతీయ సాహిత్యం పరిశీలించాను. రాతపూర్వక ఆధారాలు ఏవీ దొరకలేదు. పురాతన చైనా, గ్రీస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లో అటువంటి స్రవంతులు ఉండే అవకాశాలను పరిశీలించాను. భారతదేశమే కాకుండా ఈ దేశాలు కూడా పురాతన ఆలోచనా విధానాలకు ప్రధాన నిర్మాతలు అని మనందరికీ తెలుసు. 

పురాతన చైనాలో చాలా శక్తిమంతమైన వ్యవసాయవాదపు ఆలోచన ధార ఉందని గుర్తించాను. ఇది క్రీస్తు పూర్వం 770 నుండి 221 మధ్య వృద్ధి చెందింది. వ్యవసాయం గురించి ప్రచారం చేసిన, రాసిన ఆ ప్రధాన తత్వవేత్త జు జింగ్‌ (క్రీస్తు పూర్వం 372–289). ఇది చైనా చరిత్రలో భాగమైంది.నిజానికి భారతీయ వ్యవసాయ నాగరికతా చరిత్ర చైనీస్‌ నాగరికతకు పూర్వం నాటిది. 

ఆర్యులకు పూర్వం భారతీయులు హరప్పా నాగరికతను నిర్మించినప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందిన వ్యవసాయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఆనాటికి చైనాలో అంత అధునాతన వ్యవసాయ నాగరికత లేదు. చైనా తొలి నగరం చాంగ్‌జౌ. ఇది క్రీ.పూ 2600లో స్థాపించబడింది. హరప్పా నాగరికత దీని కంటే చాలా పురాతనమైనది. పైగా చైనీస్‌ నగరం చిన్నది; కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం, కాంస్య పనిముట్ల వంటి ఆధారాలు దొరకలేదు.

హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ సన్నిహిత సంబంధం ఉన్న మానసిక అభివృద్ధి ప్రక్రియలు. వేదాలకు పూర్వం భారతదేశం ఆ మిశ్రమ ఆలోచనా విధానాన్ని కలిగి ఉంది.

వ్యవసాయం, వేదాలు
వేదాలు లిఖితరూపం దాల్చి, గ్రంథాలుగా లిఖితమైన తరువాత, తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా పరిగణించారు. విషాదంగా ఆ ఆలోచనా స్రవంతి మెల్లగా ఉనికిలో లేకుండా పోయింది. దీని ఫలితంగా ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయ, చేతివృత్తుల శాస్త్రంలో, ఉత్పత్తిలో భారీ స్తబ్ధత ఏర్పడింది. తోలు సాంకేతికతను అంటరానిదిగా పరిగణించడం; దాని ఉత్పత్తిదారులతో పాటు, పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా ఎన్నడూ చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. 

అప్పుడు ముస్లిం పాలకులు భిన్నమైన తత్వశాస్త్రంతో వచ్చారు. కానీ తమ పరంపర ప్రకారం కులంలో దైవత్వం ఉందనీ, శూద్ర, దళిత, ఆదివాసీలకు విద్యను అందించడం దేవుని మార్గదర్శకత్వంలో లేదనే పండితులు త్వరగా ముస్లింల చుట్టూ మూగిపోయారు.

మరో మాటలో చెప్పాలంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. మన జాతీయవాదపు పునాది తత్వశాస్త్రం వ్యవసాయ సంస్కృతే తప్ప వేద సంస్కృతి కాదు. కుల సంస్కృతి వ్యవసాయవాదం గురించి రాయడానికీ, దానిని సంరక్షించడానికీ అనుమతించలేదు. ఎందుకంటే, ఆర్యన్ పూర్వ హరప్పన్ లు అభివృద్ధి చెందిన లిపిని కలిగిలేరు; వైదిక అనంతర కాలంలోనేమో వ్యవసాయదారులను నాల్గవ వర్ణంగా లేదా శూద్ర బానిసలుగా ప్రకటించారు. 

ఇందులో ప్రస్తుత రెడ్లు, కమ్మలు, కాపులు, మరాఠాలు, పటేళ్లు, జాట్‌లు, మొదలియార్ల నుండి చాకలి వంటి శూద్ర కులాలన్నీ ఉన్నాయి. క్షురకులు (మంగలి) కూడా వీరిలో ఒక భాగం. అందువల్ల బ్రిటిష్‌ పాలకులు వారందరికీ పాఠశాలలు తెరిచే వరకు, శూద్ర కులాలకు చదవడానికీ, రాయడానికీ అనుమతి లేదు. 

అక్బర్‌ వంటి ముస్లిం రాజులు కూడా, శూద్రులను పర్షియన్‌ విద్యకు దూరంగా ఉంచాలని చెప్పిన బ్రాహ్మణ పండితుల సలహాను అనుసరించారు. ఇప్పుడు కూడా ఆ చారిత్రక నిరక్షరాస్యత శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీకంపై తన ప్రభావం చూపుతున్నది.

ఆర్థికంగా దృఢంగా ఉన్న శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడు కూడా తత్వశాస్త్రంతో నిమగ్నమై ఉండకపోవడానికి కారణమవుతున్న ఈ అడ్డంకులను నా పుస్తకం పరిశీలిస్తుంది. చాలావరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాపంచిక దృక్పథంతో ప్రభావితులైన సమకాలీన ద్విజులు వ్యవసాయ తత్వశాస్త్రంతో సంబంధం కలిగి ఉండరు. భారతీయ తత్వానికి మూలం వేదాలు అని వారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. 

కానీ వేదాలు వ్యవసాయ ఉత్పాదక క్షేత్ర తత్వాన్ని ప్రతిబింబించలేదు. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తాత్విక ఆలోచనలను ఉత్పత్తి చేయగలరని ద్విజ చింతనాపరులు ఇప్పటికీ భావించడం లేదు. వారు వ్యవసాయ తత్వశాస్త్రం, వేదవాదం మధ్య గోడను నిర్మించారు. ఈ గోడ వ్యవసాయ ఉత్పత్తిలో సృజనాత్మకతను నాశనం చేసింది. ప్రస్తుత కాలంలో చైనాలో, ఐరోపాలో జరిగిన విధంగా మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి ఈ వాదం అనుమతించలేదు.

మంచి ఉత్పత్తి, భూమి, విత్తనాల మధ్య సంబంధం గురించీ; నేల స్వభావం, విత్తనాలు, జంతువులు, మానవులతో దాని సంబంధం గురించీ అనేక తాత్విక దర్శనాలు గ్రామ వ్యవసాయ సమాజాలలో ఉన్నాయి అనేది వాస్తవం కాదా? మన గ్రామాల్లో ఇప్పటికీ తాత్విక ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తున్నాయా, లేదా? అవును, అవి పని చేస్తున్నాయి. ఒక ప్రదేశంలో వేట, చేపలు పట్టడం అనేవి తగినంత ఆహారం అందించలేనప్పుడు, మొక్కలు, ధాన్యం, పండ్లు, భూమి, నీటి చుట్టూ ఉన్న తాత్వికత మాత్రమే ఆహారం అందించగలిగింది. 

ప్రత్యామ్నాయ పద్ధతి
వ్యవసాయానికి సంబంధించిన భారతీయ తత్వాన్ని పునర్నిర్మించడానికీ, హరప్పా వ్యవసాయం నుండి దాని మూలాలను గుర్తించడానికీ ప్రస్తుత గ్రామ స్థాయి వ్యవసాయ ప్రజానీకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.

పైన పేర్కొన్న పుస్తకంలో శూద్ర వ్యవసాయవాదం, భారతీయ నాగరికత అనే అధ్యాయం ఉంది. ఇది నిజానికి చైనీస్‌తో పోల్చి చూస్తే మన వ్యవసాయ తత్వశాస్త్రపు ప్రాథమిక అధ్యయనం. భారతదేశంలోని వ్యవసాయ కార్యకలాపాలు భౌతికవాదంతో ముడిపడి ఉన్న తాత్విక ఆలోచనలను ఎలా కలిగి ఉంటాయో ఇది నిర్వచిస్తుంది. మతం మాత్రమే తత్వశాస్త్రంతో ముడిపడి ఉందన్నది హిందుత్వ అభిప్రాయం. వాస్తవానికి ఋగ్వేదం రాయకముందే, రామాయణ, మహాభారతాలు రాయకముందే వ్యవసాయ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక తత్వశాస్త్రం కంటే లోతుగా ఇక్కడ పాతుకుని ఉంది.

వ్యవసాయదారులను శూద్ర బానిసలుగా అణచివేయడం ద్వారా వేదవాదులు వ్యవసాయవాద తత్వాన్ని కూడా అణచివేశారు. పైగా వ్యవసాయ వ్యతిరేక తాత్విక ఆలోచనా ధోరణి కొనసాగింది.అయితే, భారతీయ వ్యవసాయ విధానంపై చాలా కొత్త అధ్యయనాలు జరగాల్సి ఉంది. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం కాబట్టి దీనికి వైదికం, వేదాంతం, ద్వైతం, అద్వైతం కంటే ఉన్నతమైన హోదా ఇవ్వాలి.  

మనం ఒక సృజనాత్మక దేశంగా మనుగడ సాగించడానికి వ్యవసాయవాదం వంటి గొప్ప తాత్విక ధోరణులను తిరిగి ప్రోత్సహించాలి. వ్యవస్థీకృత మతాలు ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా లేవు. అనేక శతాబ్దాల తరువాత అవి ఉండకపోవచ్చు. కానీ ఈ భూమిపై మానవ జీవితం ఉన్నంత కాలం ఉత్పత్తి, పంపిణీ తత్వశాస్త్రం మానవ జీవితంలో భాగంగా ఉంటుంది.

- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  (డిసెంబర్‌ 8న గుంటూరులో ‘ద శూద్ర రెబిలియన్‌’ ఆవిష్కరణ)
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement