వృద్ధి జోరులో చైనాను మించాం! | India pushes for rate cut; GDP growth may outstrip China | Sakshi
Sakshi News home page

వృద్ధి జోరులో చైనాను మించాం!

Published Sat, May 30 2015 1:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వృద్ధి జోరులో చైనాను మించాం! - Sakshi

వృద్ధి జోరులో చైనాను మించాం!

2014-15 మార్చి క్వార్టర్‌లో భారత్ వృద్ధి రేటు 7.5 శాతం
ఇదే క్వార్టర్‌లో చైనా వృద్ధి 7%   
తయారీ, సేవల రంగం పటిష్టత ఫలితం
వ్యవసాయం నిరాశే!  
ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.3 శాతం

 న్యూఢిల్లీ: వృద్ధి వేగంలో చైనాను భారత్ అధిగమించింది.

గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15, ఏప్రిల్-మార్చి) చివరి త్రైమాసికం జనవరి-మార్చి మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.5 శాతంగా నమోదయ్యింది. ఇదే త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 7 శాతం. దీనితో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం స్థానంలో భారత్ నిలిచింది. తయారీ, సేవల రంగాల పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే వ్యవసాయ రంగం మాత్రం నిరాశాజనకమైన ఫలితాలను అందించింది.

దేశంలో ఒక నిర్దిష్ట ఏడాదిలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువే జీడీపీ.  కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన లెక్కల ప్రకారం మార్చి త్రైమాసికంలో తయారీ రంగం 8.4 శాతం వృద్ధిని సాధించింది. వ్యవసాయ రంగం మాత్రం కేవలం 1.4 శాతం వృద్ధినే నమోదుచేసుకుంది. మైనింగ్, క్వారీ విభాగం 2.3 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. వాణిజ్య, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్స్ సహా సేవల రంగం భారీగా 14.1 శాతం వృద్ధిని సాధించింది.
 
ప్రభుత్వ అంచనాకు చేరువలో...
కాగా ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదయ్యింది. ప్రభుత్వం ముందస్తు అంచనా 7.4 శాతానికి ఈ రేటు కొంచెం చేరువలోనే ఉంది. 2013-14లో ఈ రేటు 6.9 శాతం.
 
తొలి 3 క్వార్టర్‌ల గణాంకాల సవరణ...
ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల గణాంకాలను సీఎస్‌ఓ సవరించింది. మొదటి రెండు త్రైమాసికాల గణాంకాలను పెంచితే, మూడవ క్వార్టర్ గణాంకాలను దిగువముఖంగా సవరించింది.  ఏప్రిల్-జూన్ గణాం కాలను 6.5 శాతం నుంచి 6.7 శాతంగా సవరించింది. జూలై-సెప్టెంబర్ గణాంకాలను 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచింది. ఇక మూడవ త్రైమాసిక గణాంకాలను 7.5 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది.
 
ఆర్థిక క్రియాశీలత బాగుంది...
ఆర్థిక క్రియాశీలతను పరిశీలించడానికి సంబంధించి కేంద్ర గణాంకాల కార్యాలయం తాజాగా ప్రవేశపెట్టిన ‘గ్రాస్ వ్యాల్యూ యాడెడ్’ (జీవీఏ) సూచీ బాగుంది. 2013-14లో జీవీఏ 6.6 శాతంకాగా, ఇది గడచిన ఆర్థిక సంవత్సరం 7.2 శాతానికి చేరింది. తయారీ రంగానికి సంబంధించి జీవీఏ 5.3 శాతం నుంచి 7.1 శాతానికి ఎగసింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సర్వీసుల జీవీఏ 4.8 శాతం నుంచి 7.9 శాతానికి ఎగసింది.  

నిర్మాణ రంగంలో క్రియాశీలత కూడా 2.5 శాతం నుంచి 4.8 శాతానికి చేరింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషన్ సర్వీసులకు సంబంధించి ఈ విలువ 7.9 శాతం నుంచి 11.5 శాతానికి మెరుగుపడింది. అయితే వ్యవసాయ, సంబంధిత విభాగాల విషయంలో  ఈ రేటు స్వల్పంగా 0.2 శాతం తగ్గి 3.7 శాతానికి దిగింది. మైనింగ్, క్వారీ రంగం విషయంలో ైసైతం జీవీఏ 5.4 శాతం నుంచి 2.4 శాతానికి పడింది. వ్యవసాయం, మైనింగ్, క్వారీ మినహా మిగిలిన విభాగాలకు సంబంధించి మార్చి క్వార్టర్ జీవీఏ కూడా మెరుగైన ఫలితాన్ని అందించింది.
 
విలువల్లో
2011-12 స్థిర ధరల వద్ద 2014-15లో జీడీపీ విలువ రూ.106.44 లక్షల కోట్లు. 2013-14లో ఈ విలువ 99.21 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 7.3 శాతమన్నమాట.
 
లెక్కల్లో వివాదం ఉంది...
2014-15 ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలను 2011-12 ధరలను బేస్‌గా తీసుకుని లెక్కించడం జరిగింది. అయితే లెక్కింపు ప్రక్రియపై పలు రేటింగ్ సంస్థలు సహా విశ్లేషకులు సైతం ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. జీడీపీ డేటాతో ఆర్థిక వ్యవస్థలో ఇతర విభాగాల గణాంకాలకు (ఫేస్ వ్యాల్యూ) పొత్తు కుదరడం లేదని వారి విమర్శ. గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో సైతం రేటింగ్ సంస్థ మూడీస్ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.

విశ్లేషణా సంస్థ కేపిటల్ ఎకనమిక్స్ చీఫ్ షలీన్ షా దీనిపై మాట్లాడుతూ, ‘ఆర్థిక వ్యవస్థ పటిష్టతను అధికార జీడీపీ డేటా ఎక్కువ చేసి చూపిస్తోంది’ అని అన్నారు. వృద్ధి మొత్తంగా భారీగా ఉన్నట్లు కనబడుతున్నా, దేశీయ ఆర్థికవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి బలహీనంగా ఉండడం, కార్పొరేట్ లాభాలు తీవ్ర ఒత్తిడిలో కొనసాగడం, బ్యాంక్ రుణ వృద్ధిలో మందగమనం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

ఆయా అంశాల నేపథ్యంలో చూస్తే- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రభుత్వం చెబుతున్న 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో వృద్ధి సైతం అసాధ్యమని పలువురు విశ్లేషకుల అంచనా.  2004-05 బేస్ ఇయర్ ధరల ప్రాతిపదికగా తీసుకుని లెక్కించిన  2013-14 జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతం. దీనితో పోల్చితే తాజా బేస్ ఇయర్ ప్రకారం 2014-15 వృద్ధి రేటు 2.6 శాతం పెరిగినట్లయ్యింది. వరుసగా రెండేళ్లు జీడీపీ దశాబ్దపు కనిష్ట స్థాయిల్లో ఐదు శాతానికి లోపు ఉంది. 2012-13లో జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం.
 
తలసరి ఆదాయం రూ. 87,748
ప్రస్తుత ధరల వద్ద 2014-15లో తలసరి ఆదాయం 9.2 శాతం పెరిగింది. ఈ మొత్తం రూ. 80,388 నుంచి రూ.87,748కి చేరింది. 2011-12లో ఈ మొత్తం రూ. 64,316కాగా, 2012-13లో రూ. 71,593గా ఉంది.
 
చక్కటి పనితీరు: జైట్లీ
భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కని మార్గంలో వెళుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మందగమనంలో ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధి వేగంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులు దుర్బలంగా ఉన్నాయన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. త్వరలో దేశం 8-9 శాతం వృద్ధి శ్రేణిలోకి మారుతోందని తయారీ, సేవల గణాంకాలు వెల్లడిస్తున్నాయని వివరించారు. కాగా దేశంలోని పలు రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న మంచి విధానాలు చక్కటి ఆర్థిక ఫలితాలను అందిస్తున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు..
 
ఇబ్బందులు పొంచి ఉన్నాయ్: పరిశ్రమలు
గడచిన ఆర్థిక సంవత్సరం జీడీపీ ఫలితాలు బాగున్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు పొంచి ఉన్నాయని పరిశ్రమలు వ్యాఖ్యానించాయి.  ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడ్డానికి క్షేత్ర స్థాయిలో భారీ సంస్కరణలు, వ్యవసాయ రంగం పురోభివృద్ధికి చర్యలు ప్రస్తుతం అవసరమని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానించాయి.  బలహీన డిమాండ్ నేపథ్యంలో రెపోరేటును తక్షణం అర శాతం తగ్గించాలని ఫిక్కీ కోరింది. అసోచామ్ కూడా మరో ప్రకటనలో ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కాగా భవిష్యత్తులో పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని సీఐఐ వెలిబుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement