భారత్‌ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్‌ కోత | World Bank cuts India's growth rate | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్‌ కోత

Published Wed, Apr 5 2023 1:56 AM | Last Updated on Wed, Apr 5 2023 1:56 AM

World Bank cuts India's growth rate - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని  ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.

పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్‌) సమావేశాలకు ముందు వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ (దక్షిణాసియా) హన్స్‌ టిమ్మర్‌ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... 

బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం.  
దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్‌ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్‌ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే.  
భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న  దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్‌ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం.  
విదేశాల నుండి ప్రైవేట్‌ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి.  అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి.  

దక్షిణాసియా దేశాలపై ఇలా.. 
స్వల్పకాలికంగా చూస్తే, భారత్‌ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్‌ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి  అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్‌ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి.  పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో  పాక్‌ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది.

వృద్ధి 6.4 శాతం: ఏడీబీ 
ఇదిలాఉండగా, 2023–24లో భారత్‌ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) అవుట్‌లుక్‌ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది.

ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి,  వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్‌ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్‌ టకియో కినీషీ పేర్కొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement