పునర్విభజన ఇప్పట్లో లేనట్టే!
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసి అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. అయితే కేంద్రం ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. పునర్విభజన ప్రక్రియను ఆపాలంటూ కేంద్ర హోం శాఖ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ చేరినట్లు సమాచారం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలోని 119 స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ తదితరులతో కలసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు. అయితే ఇందుకు హెచ్. ఎస్ బ్రహ్మ బదులిస్తూ ‘ఈ ప్రక్రియ మేం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. గణాంకాలు సేకరించే పని కూడా ప్రారంభించాం. ఇందుకు ఒక అధికారిని కూడా నియమించాం. అయితే నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి 2008లో చేసిన సవరణలో చేర్చిన సెక్షన్ 10బీ ప్రకారం 2026 వరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు యథాతథంగా కొనసాగాలి. ఇదే విషయాన్ని కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది’ అని వివరించారు. ఆ చట్టంలో సవరణ చేస్తే తప్ప నియోజకవర్గాల పునర్విభజన చేయలేమని, దీనిపై కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన కేసీఆర్‌కు సూచించారు. కాగా కేంద్రం ఈ అంశాన్ని సాకుగా చూపుతున్నట్లు కనిపిస్తోందని, చట్ట సవరణ చేయకుండా ప్రక్రియ ఆపాలని చూడడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉండొచ్చని ఓ టీఆర్‌ఎస్ ఎంపీ ‘సాక్షి’తో పేర్కొన్నారు.