తారకాసురుడి మూర్ఖత్వం tarakasura death | Sakshi
Sakshi News home page

తారకాసురుడి మూర్ఖత్వం

Published Sun, Oct 16 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

తారకాసురుడి  మూర్ఖత్వం

 పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి, చావులేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు, సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి, మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరేనన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించనటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే, శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీవియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు.
 
 అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి, తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరేనన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబల ం తోడు కావడంతో తననెవరూ జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేనివిధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలనూ, మానవులనూ, మునులనూ, సాధుప్రాణులందరినీ నానా హింసలకూ గురిచేయసాగారు. దాంతో అందరూ కలసి బ్రహ్మదేవుడికి దగ్గరకెళ్లారు తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని.
 
 ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో! దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలే రు కాబట్టి, మనమందరం కలసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువవుతుందన్నాడు. అందుకు సమర్థులెవరని వెతగ్గా, మన్మథుడు ముందుకొచ్చాడు. మన్మథుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ, లోకకల్యాణం కాబట్టి సరేనని ఒప్పుకుంది. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె. ఆమెకు చిన్నప్పటినుంచి శివుడంటే వల్లమాలిన భక్తి.
 
  ఆ భక్తి కాస్తా ఆయన్ను పరిణయమాడాలనుకునేంతటి అనురక్తిగా మారింది. సాక్షాత్తూ పరమ శివుని పతిగా పొందాలంటే మాటలా మరి! అందుకే తపస్సు చేయడం మొదలెట్టింది. మన్మథుడి పని కాస్త సులువు చేసినట్లయింది. మహా వైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా, ఆయన తపస్తు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆయన ఏమయినా తింటాడేమోనని పండ్లు తెచ్చి ముంగిట పెట్టడం.. ఇలా ఎంతకాలం గడిచినా, శివుడు కళ్లు తెరవనేలేదు కానీ, పార్వతి మాత్రం అన్నపానీయాలు మానేసి, కేవలం  పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది.
 
 ఓరోజున మన్మథుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుని తోడు చేసుకుని, పూలబాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి, ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు. ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని పరిణయమాడడంతో, వారికి కుమారస్వామి జన్మించాడు. (కుమారస్వామి జనన వృత్తాంతం ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మరోసారి చెప్పుకుందాం). ఎప్పుడూ బాలుడిలా ఉంటాడు కాబట్టి, కుమారస్వామి అని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడనీ, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా ఆరుముఖాలతో పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడనీ, రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణ భవుడనీ, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడన్న పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు.
 
 అమిత బలపరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాలసుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఏడోఏడు రానే వచ్చింది. అప్పుడు దేవతలు కుమారస్వామికి అతని జన్మకారణాన్ని తెలియజెప్పి, యుద్ధానికి సన్నద్ధుడిని చేశారు. అందుకోసమే ఎదురు చూస్తున్న కుమారస్వామి ఆశ్వయుజ బహుళ షష్ఠినాడు దేవతలందరినీ వెంటబెట్టుకెళ్ల్లి, తారకునిపై సమర శంఖం పూరించాడు. ఏడేళ్ల బాలుడు తననేమి చేయగలడన్న ధీమాతోనే కదా, తారకుడు అతడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావకుండా వరం కోరుకున్నాడు.
 
 ఇప్పుడు కూడా అదే ధీమాను, నిర్లక్ష్యాన్ని వదులుకోలేదు. దాంతో ముందుగా శూరపద్ముడు, తర్వాత తారకుడు కుమారస్వామి వీరత్వం ముందు ఓడిపోయి, తర్వాత ప్రాణాలు కోల్పోక తప్పలేదు. ఆ విధంగా తారకాసురుడు మహా విరాగి అయిన శివుడికి కల్యాణం జరగదు, ఒకవేళ జరిగినా కొడుకులు పుట్టరు, పుట్టినా, ఏడేళ్లవాడవ్వాలి. ఏడేళ్లొచ్చినా, అంతటి పసివాడు తనను ఓడించలేడు అన్న అతి తెలివితో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement