‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌ | Here's The List Of Upcoming Devotional Movies Of Lord Shiva In 2024, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌

Published Sun, Mar 24 2024 12:55 AM | Last Updated on Sun, Mar 24 2024 5:52 PM

Upcoming Movies Of Lord Shiva devotion in 2024 - Sakshi

భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్‌ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. డివోషన్‌ ప్లస్‌ కమర్షియల్‌ మిక్స్‌ అయిన కథలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్‌ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

కన్నప్ప
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్‌ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్‌ చల్‌ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్‌ ఇచ్చారు విష్ణు మంచు.

ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్‌ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్‌ యాక్షన్‌ హీరోగా, లవర్‌ బాయ్‌గా నటించిన ప్రభాస్‌ ఇటీవలే ‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్‌ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్‌ పోస్టర్లను డిజైన్‌ చేసి, నెట్టింట షేర్‌ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్‌ లుక్‌ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది.

కుబేర 
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అయితే ఫస్ట్‌ లుక్‌ మాత్రం టైటిల్‌కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది.

కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్‌ లుక్‌లో ధనుష్‌ సరైన కాస్ట్యూమ్‌ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్‌లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్‌ టచ్‌ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్‌ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు.

హరోం హర
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్‌ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘సెహరి’ ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది.

పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్‌ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్‌ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.              

ఓదెల 2
తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్‌ హీరోయిన్‌ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ వంటి హిట్‌ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ బ్యానర్‌లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్‌. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌. సింహ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement