
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.
శివుడి నేపథ్యంలో...
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్‌లో ఉంది.
అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తారు.
శివ భక్తుడి కథ
మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.
శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు.
శివ తాండవం
పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్‌పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.
‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్‌ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.
జటాధర
వైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.
అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్‌ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.
పరమ శివుని భక్తురాలు
హీరోయిన్ తమన్నా లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment