ఎవరైతే కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని వైపుకు సాగుతారో.. సముద్రం వంటి విశాలమైన మనసున్న అటువంటి వారిని.. నదులు సముద్రంలో కలిసినట్లుగా నదులవంటి విషయభోగాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఒకసారి అన్నదమ్ములైన రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తనకు ఎవరి వలనా మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మ ‘అది అసాధ్యం. దీనికి బదులు వేరే ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. రావణుడు ఆలోచించాడు– నరులు, వానరాలు అల్పప్రాణులు, బలం లేని వారు కనుక వారి వలన మరణం ఎలాగూ రాదు. బలవంతులైన యక్షులు, రాక్షసులు, దేవతలు మొదలైన వారితోనే మరణం లేకుండా వరం కోరుకుంటే చాలు అనుకున్నాడు. బ్రహ్మని కూడా అదే కోరాడు.
‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు కూడా చావు లేని వరాన్ని పొందాలనే ఉద్దేశంతోనే తపస్సు చేసినా చివరకు బుద్ధి భ్రమించి ‘తనకు చక్కగా నిద్ర రావాలి’ అనే వరం కోరుకున్నాడు. మహా సాత్వికుడైన విభీషణుడు రావణ కుంభకర్ణులవలె తనకు ఎప్పుడూ మరణం రాకూడదని ఆశపడలేదు. ‘ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా నా బుద్ధి చెడు దారి పట్టకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని మరవకుండా ఉండునట్లు వరాన్ని ఇస్తే చాలు. ఇదొక్కటే నా కోరిక’ అన్నాడు. విభీషణుడి మాటలను విని సంతోషపడిన బ్రహ్మదేవుడు రాక్షసుడిగా జన్మించి ఉత్తమమైన సంస్కారం లేకపోయినా, నీ బుద్ధి మాత్రం అధర్మం వైపు సాగటం లేదు.
నీలో ఉన్న ఈ సుగుణాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ‘నీవు అడగకపోయినా నిన్ను చిరంజీవిగా ఉండేట్లు వరం ఇస్తున్నానని’ అన్నాడు.అమరత్వం కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసినా రావణుడికి తాను కోరుకున్నది దక్కనేలేదు. తనకు చావు రాకూడదు అని ఎప్పటికీ కోరని విభీషణుడికి మాత్రం అమరత్వం దక్కింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట ఇదే. మానవుడు విషయభోగాల వెంటపడి పరిగెత్తినంత కాలం అతడు కోరుకున్న భోగాలు అతడి నుంచి మరింత దూరమవుతాయి.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment