కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. పదితలలు గల రావణుడు దశకంఠుడని ప్రసిద్ధి పొందాడు. అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తవీర్యార్జునుణ్ణి జయించాలని తలచి, సైన్యాన్ని వెంటబెట్టుకుని, కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతీపురానికి బయలుదేరాడు.మహిష్మతీ నగరానికి చేరువలో, నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడిది చేసింది. ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీస్నానం చేసి, శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు. నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి, స్తోత్రాలు పాడుతూ, నర్తిస్తూ శివార్చన చేయసాగాడు.
ఇంతలో నర్మదా నది ఉప్పొంగి, నదీజలాలు ఎదుటికి ప్రవహించసాగాయి. నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. ఈ పరిణామానికి రావణుడు చకితుడయ్యాడు.‘వానా వరదా లేకున్నా, నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తోంది? నదిలో ఏం జరుగుతోంది? చూసి, తెలుసుకుని రండి’ అంటూ రావణుడు తన భటులను పంపాడు.నదిలో కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుటికి ప్రవహిస్తోంది. రావణుడి అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి, రావణుడికి చెప్పారు.
రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని, నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ కాపలాగా కార్తవీర్యార్జునుడి మంత్రులు కనిపించారు. ‘రణరంగ శూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి’ అని వాళ్లతో అన్నాడు.‘యుద్ధానికి మంచి సమయాన్నే ఎంచుకున్నావే! రాజు జలక్రీడలాడుతుండగా, ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా? నీ చేతులకు అంత తీటగా ఉంటే, రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రస్తుతానికి దయచెయ్యి’ అని వాళ్లు ఎకసెక్కంగా బదులిచ్చారు.‘ధైర్యం ఉంటే మీ రాజును ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనండి. లేకపోతే, పారిపోవడానికే రేపటి వరకు గడువు కోరుతున్నారనుకుంటా’ అన్నాడు.
వీడు మరీ మొండిఘటంలా ఉన్నాడనుకున్న మంత్రులు, కార్యవీర్యార్జునుడికి రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు. ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడని కూడా చెప్పారు.కార్తవీర్యార్జునుడు జలక్రీడలను చాలించి, వెనువెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు. భయపడవద్దని భార్యలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు. తన ఐదువందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు. మిగిలిన ఐదువందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని, దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగుపెట్టాడు. రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతడికి ఎదురు వెళ్లి, ఒక ముసలాన్ని విసిరాడు. కార్తవీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే తుక్కుకింద ముక్కలు చేసి, గదతో చాచిపెట్టి ప్రహస్తుణ్ణి కొట్టాడు. ప్రహస్తుడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలికి బుద్ధి చెప్పి, వెనక్కు పరుగు తీశారు.
ప్రహస్తుడు పడిపోవడం, మంత్రులు పలాయనం చిత్తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చాడు. ఒక భారీ గద పట్టుకుని అతడితో తలపడ్డాడు. ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. ఇద్దరిలోనూ ఒక్కరూ వెనక్కు తగ్గలేదు. గదాఘాతాలతో ఇద్దరి ఒళ్లూ రక్తసిక్తంగా మారినా, కొండల్లా చలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు. వాళ్ల గదా ఘాతాల ధ్వనులకు, వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది. కార్తవీర్యార్జునుడు అదను చూసుకుని, రావణుడి ఛాతీపై గదతో బలంగా మోదాడు. ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది. రావణుడు నేల కూలిపోయాడు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తాళ్లతో కట్టేసి, బందీగా తన నగరానికి తీసుకుపోయాడు.రావణుడు బందీగా పట్టుబడిపోవడంతో ధైర్యం సడలిన అతడి మంత్రులు, సేనానులు, సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. వారు నేరుగా రావణుడి తాత పులస్త్యబ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.
పులస్త్యుడు మహిష్మతీ నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎదురేగి పులస్త్యుడికి ఘనస్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తన మనవడైన రావణుడికి బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుణ్ణి మెచ్చుకున్నాడు పులస్త్యుడు. ‘నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటింది. ఇక వాడిని విడిచిపెట్టు’ అని కోరాడు. పులస్త్యుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు. పులస్త్యుడు అక్కడికక్కడే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment