ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఈశ్వరుడు సర్వాంతర్యామి. మరో రకంగా చెప్పుకోవాలంటే ఆ శక్తి అఖండమైనది. ఎక్కడ కూడా ఖండనలు కానీ, ఖాళీలు కానీ లేకుండా నిండుగా వ్యాప్తి చెంది ఉన్నది. సర్వాంతర్యామి అనడానికి, అఖండమైనదని చెప్పడానికి తేడా ఏంటంటే నాలో, నీలో, అన్నింట్లో ఆయనే ఉన్నాడనడంలో భౌతిక పదార్థాలు లేని ప్రాంతంలో సాధకుడు ఈశ్వరుడిని సులభంగా గమనించలేడు. శూన్యంలోనూ, మనలోనూ అప్రతిహతంగా ఆ శక్తి ఏలాంటి వ్యవధి లేకుండా ఉన్నదనే విషయం అంత సులభంగా అర్థంకాదు. ఆ శక్తి అఖండమైనదని తెలపడం వల్ల కంటికి కనిపించిన ప్రాంతం నుండి, కనిపించని ప్రాంతమంతా నిరంతరంగా కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాదు, ఆ శక్తి అత్యంత సాంద్రతను కలిగి ఉంటుంది. ఆ సాంద్రతను కొలవడానికి పరికరాలు గానీ, కొలతలు గాని లేవు. ఆ అనంతశక్తిలో నుండి ఉద్భవించిన పదార్థాలు ఎంత బరువైనవైనా, ఎంతటి సాంద్రతను కలిగి ఉన్నా ఆ సాంద్రత ముందు దిగదుడుపే. కాబట్టే, ఆ శక్తితో పోలిస్తే అత్యంత తేలికైన గ్రహాలు, నక్షత్రాలు తదితర ఖగోళ పదార్థాలన్నీ తమతమ స్థానాలలో ఏ ఆధారం లేకుండా తేలుతూ తిరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని మనం సముద్రంలో పుట్టి, పెరిగి, ఈదులాడి అందులోనే మరణించే సముద్ర జీవులతో పోల్చవచ్చు. సముద్ర జీవుల కన్నా సముద్రం ఎంతో సాంద్రత కలిగి ఉన్నది కాబట్టి, ఆ జీవులు సముద్రజలాల్లో స్వేచ్ఛగా, అలవోకగా ఈదగలుగుతున్నాయి.
ఆ విషయాన్ని సాధకుడు గుర్తెరగాలి. తాను ఆ అఖండత్వంలో ఊపిరి పోసుకున్న ఒకానొక చిన్న భాగమని, తనలాగే ఈ కనిపించే ప్రకృతి కూడా ఒకానొక భాగమేనని అర్థం చేసుకోవాలి. ఆ అఖండశక్తిలో పుట్టిన పదార్థాల భౌతిక రూపాలు వేరైనా, ఆ భౌతిక రూపాలలో, వాటి నడుమ, చుట్టూ నిరంతర ప్రవాహినిగా విరాజిల్లుతున్న చైతన్యమే అన్నింటికీ హేతువని గుర్తెరగాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మస్తిష్కంలో సుస్థిరమైతే మానసిక వైకల్యాలు నశించిపోయి, మనసునిండా ఏకత్వం సాకారమవుతుంది. ఏ జీవినందైనా, నిర్జీవి నందైనా లేక శూన్యమందైనా ఆ అనంతశక్తి అఖండత్వమే గోచరిస్తుంది. దృష్టిలో భేదభావం ఉండదు. వాక్కులో అపశబ్దం దొర్లదు. చేతలో అధర్మం కలగదు. నడతలో తడబాటు కలగదు. వర్ణమనీ, కులమనీ, మతమనీ ఆలోచనలు రావు. ఏ జీవి పట్లా నిర్లక్ష్యధోరణి తలెత్తదు. ప్రకృతిపై అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. మోములో, ఆలోచనలలో ఆనందం విస్తరించి, స్థిర పడుతుంది.
గీతలో చెప్పినట్టుగా ఆత్మను శస్త్రాలు ఖండించలేవు, అగ్ని దహింపలేదు, వర్షం తడపలేదు. కానీ, భేదభావాలు, అరిషడ్వర్గాలు దహింపగలుగుతాయి, ఖండించగలుగుతాయి. అందుకే, నిరంతర అఖండ ప్రవాహిని అయిన ఆ చైతన్యాన్ని మన మనసుల నిండుగా నింపుకున్నట్లయితే ఈ భేదభావాలు నశించిపోతాయి. తల్లి, తన పురిటి బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు, సాధకుడు ఈ చరాచర ప్రపంచం మొత్తాన్ని తన ఆలోచనలతో సొంతం చేసుకోగలుగుతాడు. ఏ కొంత భూమికో అధిపతిగానో లేక ఏ కొద్దిమందికో చెందిన వాడుగా కాకుండా, ఈ జగత్తు మొత్తం తనదేనని, అంతా తానేననే ఆనందంతో బ్రహ్మమై వెలుగొందుతాడు. సర్వాంతర్యామితో అభేదాన్ని సాధిస్తాడు.
– గిరిధర్ రావుల
సర్వాంతర్యామితో అభేదాన్ని సాధించవచ్చు
Published Sun, Nov 18 2018 1:07 AM | Last Updated on Sun, Nov 18 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment