parabrahma
-
వీథి దీపం వెలగకపోతే...!!!
‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి. అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు. మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’ ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది. ‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది. దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్ కా రాణీ, ఉస్కా జీవన్ పానీ, హాథ్ లగావ్ తో డర్ జాయేగీ, బాహర్ నికాలేతో మర్ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మెట్ట వేదాంతం..?
వేదాంతం అనే మాట తెలుసు అందరికీ, అర్థం సరిగ్గా తెలిసినా లేకపోయినా. ఇంతకీ ఈ మెట్టవేదాంతం ఏమిటి? కాని, ఈ మాటని చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. మాగాణి వేదాంతం మరొకటి ఉందా? దీనికీ, దానికీ తామరకి, మెట్టతామరకి మధ్య ఉన్నంత తేడా ఉంటుందా? తామర, మెట్టతామర రెండూ పూలు. అంతే వాటి సంబంధం. ఒకటి నీళ్ళలో, మరొకటి నేల మీద పెరుగుతాయి. కాని, వేదాంతానికి మెట్ట వేదాంతానికి ఉన్నది మరొక రకమైన సంబంధం. వేదాంతం ఒక శాస్త్రం. అన్ని వేదాలు క్షుణ్ణంగా చదివిన తరువాత గురువు సమీపంలో కూర్చుని వేదాలలోని మర్మాలు తెలుసుకుంటాడు శిష్యుడు. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఆ సంభాషణలని ఉపనిషత్తులు అని అంటారు. వేదాధ్యయనం అయిన తరువాత తెలుసుకునే భాగాలు కనుక వేదాంతంగా పరిగణించబడినాయి. సమస్తం భగవంతుడి స్వరూపంగా భావించ గలగటం అప్పటికి అభ్యాసం అయి ఉంటుంది. అందువల్ల వేదాంతం వంటపట్టిన వారు సామాన్య భక్తులలాగా పూజాదికాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం సర్వవ్యాపి అయిన పరబ్రహ్మతత్త్వాన్ని ధ్యానం చేస్తూ, వివేచన చేస్తూ, అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు చెప్పే మాటలని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒకటి, రెండు మాటలని పట్టుకుని తమకి అనుకూలంగా వాడుకుంటారు కొంతమంది. కొంతమంది తెలియక కూడా ఆ విధంగా చేస్తారు. అంటే వేదాంత పరిభాషని తన ప్రవర్తనని సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు మనకి అడుగడుగునా, కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘‘అన్నమైతేనేమిరా? మరి, సున్నమైతే నేమిరా?’’ అని అన్నానికి సున్నానికి తేడా లేదని అంతా సమానమేనని ఇంటిముందు అడుక్కునేందుకు వచ్చిన సన్న్యాసి పాడుతాడు. ‘అబ్బా ఎంత వైరాగ్యం!’ అని అనుకుంటూ ఉంటే ఇట్లా కొనసాగిస్తాడు – ‘‘అందుకే ఈ పాడు పొట్టకి అన్నమే వేదాము రా! పప్పన్నమే వేదాము రా! నెయ్యన్నమే వేదామురా! పెరుగన్నమే వేదాము రా!’’ అంటాడు. అంతటితో ఆగడు. ‘‘చీరలైతేనేమిరా? మరి, నారలైతే నేమిరా? అందుకే ఈ పాడు ఒంటికి చీరలే కడదామురా! పట్టుచీరలే కడదామురా!’’ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ పాట. ఇటువంటి వాటిని తత్త్వాలు అంటారు. తన శక్తిమేరకు పనిచేసి ఫలితం ఏమైనా పట్టించుకోకపోవటం వేదాంతి అయిన వాడు చేసే పని. కాని, వేదాంత ప్రసంగాలు విని, విని కొన్ని ఊతపదాలు మనకి అలవాటై పోయాయి. ‘‘మన చేతుల్లో ఏముంది?’’,‘‘ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది’’ అంటూ చేతులు ముడుచుకుని కూర్చునేవారు, తమ బద్ధకానికి, చేతకానితనానికి వేదాంతపు ముసుగు వేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి వల్లనే మన ధర్మానికి, వేదాలకి, వేదాంతానికి చెడ్డపేరు వస్తోంది. మనం మెట్టవేదాంతులం కాకుండా ఉంటే చాలు. అటువంటి వారి నుండి దూరంగా ఉండటం మంచిది. అన్నానికి సున్నానికి తేడా లేదనటం వేదాంతం. అందుకని రకరకాల అన్నాలు వేద్దామనే నిర్ణయానికి రావటం మెట్టవేదాంతం. ఈ రెండింటికి తేడా లేదని చెప్పటం దంతవేదాంతం. ఆచరణలో చూపటం అసలైన వేదాంతం. రుచికరమైన ఆహారం తినకూడదని కాదు దీని అర్థం. అది కావాలని కోరకూడదు. దొరికినది ఏది అయినా ఒకే భావనతో తినగలగాలి. అట్లాగే ఎట్లాగైనా ఉండగలగాలి. అంటే పట్టుపరుపులైనా, నేలమీదైనా ఒకే రకం గా నిద్రించటం వేదాంతి లక్షణం అయితే, రెండూ ఒకటే కనుక పట్టుపరుపులే కావాలనుకోవటం మెట్టవేదాంతం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
అమ్మ.. బ్రహ్మ
అమ్మ పరబ్రహ్మం. వేదం అందుకే ‘మాతృదేవోభవ’ అంటూ మొదటి నమస్కారం అమ్మకే చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రిని పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం. నమశ్శంకరాయచ..అంది యజుర్వేదం. అన్నివేళలా బిడ్డల సుఖం కోసం ఆరాటపడతాడు కనుక ఈ భూమిమీద తిరుగాడుతున్న శివ స్వరూపం తండ్రి. అంతవరకే. కానీ తల్లి పరబ్రహ్మ స్వరూపం. బిడ్డ పుట్టడానికి తల్లి తన గర్భాన్ని గర్భాలయం చేస్తుంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. From womb to tomb, she is the most innocent lamb..అని. తల్లి కడుపు దగ్గరినుంచి సమాధి వరకు ఆమె స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు. అంత రాశీభూతమైన అమాయకత్వం. ఏ ప్రతిఫలాన్ని కోరదు. అమ్మ దగ్గర పిల్లలు సేదదీరినట్లుగా లోకంలో మరెక్కడా సేదదీరలేరు. అందుకే శంకరాచార్యులంతటివాడు అయ్యవారి స్తోత్రం చేస్తూ ‘శివానంద లహరి’ అని, అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ‘సౌందర్యలహరి’ అన్నారు తప్ప ‘అంబానంద లహరి’ అనలేదు.సౌందర్యం.. అన్నమాటకు అర్థం బాహ్యంలో శరీరంలో ప్రకాశించే అందం కాదు. అది ఈవేళ ఉంటుంది. ఒక దుర్ఘటన జరిగితే పోతుంది. అందుకే –‘‘మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా’’ అని అంటారు శంకర భగవత్పాదులు. అమ్మది అందం కాదు...సౌందర్యం. అది ఎంత వయసొచ్చినా పెరుగుతుంది తప్ప తరిగేది కాదు. అమ్మ కడుపులో ఉండగా నాభీ బంధం. అమ్మ తాను తిన్న అన్నసారాన్ని నాభిద్వారా బిడ్డకు అందిస్తుంది. కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చిన తరువాత నాభి కోస్తారేమోకానీ హృదయబంధం అలాగే నిలబడి పోతుంది. ఈమె నా తల్లి. వీడు నా బిడ్డడు. ఆ సంబంధం పోదు. చిట్టచివరకు ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కుర్మ, క్రౌకార, ధనంజయ, దేవదత్తములనబడే పది వాయువులలో వ్యాన వాయువు శిథిలమైన ఆస్తిమీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్లు శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది...అంటే ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉంది. దాన్ని ఎవరయినా ఛటుక్కున అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక ఫలకం పెట్టినట్లు... శరీరంలోంచి జీవుడు వెళ్లిపోయినా ఈ శరీరం నాది అని ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అదెప్పుడు పోతుందో తెలుసా... కడుపున పుట్టిన కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి ‘‘పిచ్చి అమ్మా! ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది, ముసలిది అయిపోయిందమ్మా ... ఎందుకూ సహకరించదు. దానిలో ఎందుకుంటావ్... మా మీద మమకారంతో కదూ... అమ్మా, మేం యోగ్యమైన మార్గంలో నడుస్తున్నాం. నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు’’–అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యాన వాయువు వదిలిపెడుతుంది. అంటే అమ్మకూ, బిడ్డలకూ ఉండే అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో చూడండి. మాతృత్వంలో ఉండే అద్భుతం అటువంటిది. ఆమె పడని కష్టం ఉండదు. కాలు ఎక్కడ జారుతుందేమో నన్న భయంతో లోపల పెరుగుతున్న పిండంపట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. లోపల భయంకరమైన పంజరం తయారయి సప్తధాతువులు–చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడు తుంటే... జీవుడు అందులో ప్రవేశిస్తుంటే... కాలు పెట్టి పిల్లవాడు లోపల కడుపులో తంతే... కిలకిలా నవ్వుతూ.. తన అమ్మతో–‘‘చూడమ్మా! ఇక్కడ వాడు తంతున్నాడమ్మా’’ అని పొంగిపోతుంటుంది. ఫలితం ఆశించని అమ్మ– ‘సౌందర్యం’ అన్న మాటకు పర్యాయపదమయింది. -
అన్నిటికి మూలం ఆ ప్రాణశక్తి!
ప్రశ్నోపనిషత్ పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవడానికి పిప్పలాద మహర్షి దగ్గరకు వెళ్లిన ఆరుగురు ఋషులలో రెండవవాడు విదర్భదేశానికి చెందిన భార్గవుడు. ‘‘మహర్షీ! ఎంతమంది దేవతలు ఒక జీవిని పోషిస్తున్నారు? వారిని గురించి ఎలా తెలుసుకోవాలి?వారిలో గొప్పవాడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం పిప్పలాద మహర్షి ఇలా చెబుతున్నాడు. ‘‘భార్గవా! ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, నేల, వాక్కు, మనస్సు, కన్ను, చెవి అనే తొమ్మిదిమంది దేవతలు జీవిని ఏర్పరచి నడిపిస్తున్నారు. ‘‘మేమే ఒక శరీరంగా ఏర్పడి నడిపిస్తున్నాము’ అని వారు స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన విన్న ప్రాణశక్తి వారి మాటను ఖండించింది. ‘మీరు శరీరాన్ని శక్తిమంతం చేస్తున్నామని భ్రమపడకండి. నన్ను నేను అయిదుభాగాలుగా చేసుకొని పంచప్రాణాలుగా శరీరంలో ఉండి నడిపిస్తున్నా’ అన్న ప్రాణశక్తి మాటను దైవశక్తులు నమ్మలేదు. వారు తన మాట నమ్మడం లేదని గ్రహించిన ప్రాణశక్తి వాళ్లకు జ్ఞానం కలిగించాలని భావించింది. వారిలో నుంచి వెళ్లిపోయింది. ప్రాణశక్తి నిష్ర్కమించడంతో శరీరంలోని ఇంద్రియాలు అన్నీ చలన రహితం అయిపోయాయి. ప్రాణశక్తి తిరిగి రాగానే పనిచేయటం మొదలెట్టాయి. తేనెపట్టులో నుంచి రాణి ఈగ వెళ్లిపోతే అన్ని ఈగలూ వెళ్లిపోతాయి. తిరిగి వస్తే మళ్లీ అన్నీ వస్తాయి. అలాగే ఇంద్రియాలన్నీ ప్రాణశక్తిపై ఆధారపడి ఉన్నాయని వాటికి తెలిసింది. వాక్కు, మనస్సు, కన్ను, చెవి అన్నీ ప్రాణశక్తిని కీర్తించాయి. భార్గవా! ప్రాణశక్తియే అగ్ని, సూర్యుడు, మేఘుడు, ఇంద్రుడు, వాయువు, భూమి ఏ పదార్థమైనా, సజీవమైనా, చలనరహితమైనా అన్నిటిలోనూ ఉంటుంది. అదే స్థూల, సూక్ష్మరూపాల్లో అశాశ్వతమైన పదార్థాలు అన్నిటిలో శాశ్వతమై, మరణ రహితమై ఉంటుంది. రథచక్రం ఇరుసుతో ఆకులు ( చువ్వలు) అన్నీ కలిసి ఉన్నట్టు ఋక్, యజుస్, సామవేదాలు, యజ్ఞయాగాదులు, పరాక్రమం, బ్రహ్మజ్ఞానం అన్నీ ప్రాణశక్తితోనే ముడిపడి ఉన్నాయి. ఓ ప్రాణశక్తీ! గర్భంలో సజీవంగా ఉండేది నువ్వే. శిశువుగా జన్మించేదీ నువ్వే. అన్ని జీవుల ఇంద్రియాలలో ఉన్న నీకు జీవులన్నీ ఆహారాన్ని (బలి) సమర్పించుకుంటాయి. నీవు తనలో ఉండబట్టే అగ్నిహోత్రుడు దేవతలకు దూత కాగలుగుతున్నాడు. పితృదేవతలకు స్వధాకారంతో నువ్వే ఆహారాన్ని అందిస్తున్నావు. అధర్వుడు, అంగీరసుడు మొదలైన ఋషుల్లో సత్యాన్వేషణ, పరిశోధన నీవల్లే సాధ్యమవుతున్నాయి. ఓ ప్రాణమా! నువ్వే దేవతల రాజైన ఇంద్రుడివి. తేజోమయమైన రుద్రుడివి నువ్వే. అంతరిక్షంలో తిరిగే గ్రహరాజు సూర్యుడివీ నువ్వే. అన్నిటినీ కాపాడేది నువ్వే. నువ్వు వర్షంగా భూమి మీద కురిసినప్పుడు పంటలు పండి ఆహారం లభిస్తుందని జీవులందరూ ఆనందంతో ఉంటారు. నువ్వు సర్వదా పవిత్రుడివి. యజ్ఞంలో అగ్నిరూపంలో ఉండి ఆహుతుల్ని స్వీకరించే భోక్తవు నువ్వే. విశ్వానికి అధిపతివి నువ్వే. వాయుదేవుడికి తండ్రివి నువ్వే. మేము ఆహుతులను సమర్పించేది నీకే. ఓ ప్రాణశక్తీ! వాక్కులో, వినికిడిలో, చూపులో, మనసులో నీ అంశలను ఎప్పుడూ అలాగే ఉంచు. వాటిని శుభప్రదంగా, మంగళకరంగా అలాగే ఉండనివ్వు. వాటినుంచి వెళ్లిపోకు. అంటూ తొమ్మిది దైవశక్తులూ సత్యదర్శనంతో తమ గర్వాన్నీ, అహంకారాన్నీ, అజ్ఞానాన్నీ పోగొట్టుకుని ప్రాణశక్తిని పొగ డ్తలతో ముంచెత్తాయి. తమను ఎప్పుడూ విడిచి వెళ్లొద్దని ప్రార్థించాయి. భార్గవా! ముల్లోకాలలో ఉన్నవి అన్నీ ప్రాణశక్తిపైనే ఆధారపడి ఉన్నాయి. పంచభూతాలు, నోరు, కన్ను, చెవి, మనస్సులతో మనిషి ఏర్పడినా వాటిని చైతన్యపరిచేది ప్రాణశక్తి మాత్రమే అని తెలుసుకో. అని అతని ప్రశ్నకు పిప్పలాద మహర్షి సమాధానం చెప్పి, ప్రాణశక్తిని ఇలా ప్రార్థించాడు. ‘మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞా చ విదేహీ న ఇతి’ ఓ ప్రాణశక్తీ! తల్లి బిడ్డలను రక్షించినట్టు మమ్మల్ని కాపాడు. సంపదలను, ప్రజ్ఞను ప్రసాదించు) ఈ ప్రాణం ఎక్కడినుంచి వచ్చింది? అనే ఆశ్వలాయనుడి ప్రశ్నకు పిప్పలాదుడు ఏం సమాధానం చెబుతాడో వచ్చేవారం తెలుసుకుందాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్