‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి.
అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు.
మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’
ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది.
‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది.
దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్ కా రాణీ, ఉస్కా జీవన్ పానీ, హాథ్ లగావ్ తో డర్ జాయేగీ, బాహర్ నికాలేతో మర్ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment