మన ముంగిళ్లలో వెలుగు పూలు | Sakshi Special Story of Narakasura and Diwali | Sakshi
Sakshi News home page

మన ముంగిళ్లలో వెలుగు పూలు

Published Thu, Oct 31 2024 12:34 AM | Last Updated on Thu, Oct 31 2024 12:33 AM

Sakshi Special Story of Narakasura and Diwali

సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా  లేకుండా  ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం  వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ  దీపకాంతులతో కళకళలాడే ఈ  పర్వదినం ప్రాముఖ్యత, ఆచార  సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...

దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.

నరకాసుర వధ
భూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.

లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.

ఈ పర్వదినాన ఇలా చేయాలి...
ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.

దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.

దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?
దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.

దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.

లక్ష్మీపూజ ఇలా చేయాలి...
ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. 

వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి,  నోరు తీపి చేసుకోవాలి. 

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement