పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి ఒకటి. ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.
చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమావాస్యనాడు వచ్చే పండుగ అయినా జగమంతా వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.
దీపావళి కథ
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.
దీపావళి నాడు ఏం చేయాలి?
ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు.
దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం. దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు.
లక్ష్మీపూజ ఇలా
మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. పిండి ముగ్గులతో ముంగిళ్లను తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి. ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు, పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.
దీపావళి సందడి మరింత
దీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి, వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు.
బొమ్మల కొలువు
బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.
మతాబులు, చిచ్చుబుడ్లు
పూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు. తక్కువ పొగ, శబ్దం వచ్చే క్రాకర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.
ఈ దీపావళి అందరికీ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment