దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.
దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు.
పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.
ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు.
రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్‌లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment