వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.
టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్‌మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.
మరి ఏం చేయాలి?
భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం.
పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలి
వెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.
అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి.
టపాసులను బడ్జెట్‌ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం.
మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.
ఇతర జాగ్రత్తలు
టపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.
ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.
టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.
అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్‌లను ధరించాలి.
అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది.
దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.
కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.
కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment