Pollution Alert
-
‘గ్రాప్-3’ ఉల్లంఘనలు.. ఒక్కరోజులో రూ 5.85 కోట్ల చలానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గ్రాప్-3’ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పడు గ్రాప్-3ని ఆచరణలో పెట్టింది. అయితే ఇది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 5.85 కోట్ల జరిమానా విధించింది. గ్రాప్-3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)417గా ఉంది. శుక్రవారం ఇదే సమయంలో ఏక్యూఐ 396గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం వాయునాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరికి చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతోవున్నవారు మరిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.నిషేధం ఉన్నప్పటికీ బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 550 చలానాలను విధించారు. బీఎస్- 3 పెట్రోల్, బీఎస్- 4 డీజిల్, నాలుగు చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే రూ.20 వేలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు (పీయూసీసీ)లేని వాహనాలకు కూడా పోలీసులు చలానాలు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజునే 4,855 వాహనాలపై మొత్తంగా రూ.5.85 కోట్ల జరిమానా విధించారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్‌ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్‌లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
ఢిల్లీ వాసులకు అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్‌ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. కనీసం మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్‌కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతటి స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీకి పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. పాఠశాలలు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులు జరుపుతున్నాయి. అవసరం లేకుండా బయట తిరగొద్దని డాక్టర్ల సూచిస్తున్నారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో పర్యావరణం పారా హుషార్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల వీలును బట్టి మూడు, అయిదు, ఏడు, తొమ్మిది రోజుల్లో వినాయక నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో నగరంలో పలు జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ఇతర రసాయనాలతో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల భారీగా జలాశయాలకు కాలుష్య ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సే న్‌సాగర్ సహా నగరంలోని పలు చెరువుల్లో నిమజ్జనం చేయనుండడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికారక రసాయనాలు, మూలకాలివే.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు: కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతో అనర్థాలు.. ►ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. ►చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జలాల్లో అరుదుగా పెరిగే వక్షజాతులు అంతర్థానమవుతాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయాల ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయాలివీ.. ►రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన గంట వ్యవధిలోనే తొలగించాలి. నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకి పూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్ కవర్లను పడవేయరాదు. పీఓపీ విగ్రహాల సంఖ్యను ఏటా తగ్గించాలి. మట్టి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. -
మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను వణికిస్తున్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన వాయు కాలుష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలు, వారి రక్షణ పట్టదా అని సుప్రీం బుధవారం మండిపడింది. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు (రాష్ట్రాలు) మర్చిపోయారా? పేద ప్రజల గురించి బాధపడటం లేదు, ఇది చాలా దురదృష్టకరమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రజల గురించి పట్టించుకోనివారికి అధికారంలో ఉండే హక్కు లేదు వ్యాఖ్యానించింది. "కాలుష్యం కారణంగా ప్రజలు ఇలా చనిపోవడానికి మీరు అనుమతించగలరా? దేశాన్ని100 సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి మీరు అనుమతించగలరా" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను దహనం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతులను బాధ్యుల్ని చేయడం భావ్యం కాదని తెలిపింది. ఇది కోట్లాదిమంది ప్రజల జీవన్మరణ సమస్య. ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి" అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పంట వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని ఉపయోగించుకునేందుకు తమ వద్ద యంత్రాంగం, నిధులు లేవని, రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని పంజాబ్ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నివేదించడంతో..మరోసారి మండిపడిన జస్టిస్ మిశ్రా..మీ వద్ద నిధులు లేకపోతే..మేమే మీకు నిధులు అందజేస్తామని, కేంద్రంపై ఆధారపడటం మాను కోవాలని, మీరు ఏమీ చేయలేకపోతే..ఆ విషయాన్ని కోర్టులకు వదిలేయాలని స్పష్టం చేశారు. విమానాల దారి మళ్లింపు, ప్రజలు తమ నివాసాల్లో కూడా సురక్షితంగా ఉండకపోవడంపై మీకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు భవంతుల్లో (ఐవరీ టవర్స్) కూర్చుంటే సరిపోతుందా..?కోట్లాది ప్రాణాలకు సంబంధించిన విషయంపైనా సరైన విధంగా స్పందించరా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు భవంతుల్లో కూర్చుని ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే.. మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాధినేతలకు స్పష్టం చేసింది. ఈ విషయంలో తక్షణ చర్యలను ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
కాలుష్య కాటు
జిల్లాలో ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) లేకుండా పలు ఫ్యాక్టరీలు, మైన్స్, క్వారీల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటిపై అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో యథాప్రకారం నిర్వాహకులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గాలిలో దూళికణాలు గతంలో 66 శాతం ఉండగా ప్రస్తుతం 71 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ 80 నుంచి 100 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. అయితే 500 మైక్రో గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నెల్లూరు(సెంట్రల్): ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మొదట చూసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏర్పాటు చేసే మైన్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. ఏర్పాటు చేసే ఏ చిన్న, పెద్ద పరిశ్రమ అయినా సరే పర్యావరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే జిల్లాలో పలు ఫ్యాక్టరీలకు ఈసీలు లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈసీ లేని మైన్స్, ఫ్యాక్టరీలతోపాటు వాహనాలు తిరుగుతున్నందున వచ్చే కాలుష్యంతో జిల్లాలో పర్యావరణం దెబ్బతింటోంది. 25 వేలకు పైగా ఆటోలు, వెయ్యికి పైగా బస్సులు, 15 వేల కార్లు, రెండు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫ్యాక్టరీలదే అదే వరుస జిల్లాలో రైసు మిల్లులు, క్రషర్స్, పవర్ప్లాంటులు, వివిధ రకాల శబ్దకాలుష్య పరిశ్రమలు విచ్చలవిడిగా వెలశాయి. వీటిలో సగానికి పైగా ఈసీ లేదని తెలుస్తోంది. ఒక వేళ ఈ సీ ఉన్నా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వీటి నుంచి నిత్యం వెలువడే కాలుష్యంతో స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంటలపై కూడా పడుతోంది. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతోంది. అంతే కాకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యల వస్తున్నాయి. దీంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నెల్లూరు చుట్టుపక్కల వెలసిన రైసు మిల్లులు, వివిధ ఫ్యాక్టరీలు, క్రషర్స్‌తో నెల్లూరు పట్టణంపై కూడా పర్యావరణ ప్రభావం పడుతోంది. అధికార పార్టీ అండతో చాలా వరకు పెద్దపెద్ద పరిశ్రమలు, మైన్స్ నిర్వహణ మొత్తం అధికార పార్టీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒక మంత్రికి చెందిన మైన్స్ కూడా ఉన్నాయి. పలు ఫ్యాక్టరీలు, రైసుమిల్లుల విషయం చెప్పనక్కర్లేదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి చెందిన రైసు మిల్లులు, ఆయన అసోసియేషన్‌కు కూడా అధ్యక్షుడిగా ఉండటంతో వాటికి అనుమతి లేకున్నా ఉన్నా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖ, కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏదో మొక్కబడిగా దాడులు చేసి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు వస్తుండటంతో తనిఖీలు చేసిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసీ లేకుండా నిర్వహించే మైన్స్, ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 100 మైన్స్‌కు అనుమతి లేని వైనం ప్రధానంగా జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, గూడూరురూరల్, పెళ్లకూరు మండలాల్లో 170 మైన్స్ ఉన్నాయి. వీటిలో 100 మైన్లకు ఈసీ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇవి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు న్యాయ స్థానం దృష్టికి కూడా పోవడంతో వీటి నిర్వహణపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈసీ లేకుండా నిర్వహించిన యజమానుల నుంచి చట్టం ప్రకారం అపరాధ రుసుం వసూలు చేసి, అనంతరం సర్టిఫికెట్ తీసుకున్న తరువాత పనులు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. దీంతో ఈసీ లేకుండా నిర్వహిస్తున్న మైన్స్ వివరాల సేకరణలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెలలోనే ఈసీ లేని మైన్స్పై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసీ లేని వాటిపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎటువంటి మైన్ లేదా ఫ్యాక్టరీ అయినా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి. ప్రజలకు పర్యావరణం వల్ల ఇబ్బంది కలిగే విధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పలు మైన్స్‌కు ఈసీ లేదు. కొన్ని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుని ఉన్నాయి. అదే విధంగా ఫ్యాక్టరీలు, రైసుమిల్లులు ఈసీ లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. –ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ -
పొద్దంతా పొగ... ఒళ్లంతా సెగ
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా వాహనాలు వదులుతున్న పొగ కారణంగా భూస్థాయి ఓజోన్ క్రమంగా పెరుగుతుంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంటోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ప్రధాన రహదారులపై భూ స్థాయి ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఒలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలిసిపోయి...సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. గ్రేటర్లో వాయు కాలుష్యానికి కారణాలివే.. మహానగరంలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మ ధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. బాలానగర్,ఉప్పల్,జూబ్లీహిల్స్,చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు బయటపడడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి వస్తుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల సంఖ్య 50 లక్షలు దాటినా..గ్రేటర్లో 7 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. ధూళికాలుష్యంతో అనర్థాలివే.. పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు,అస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయుకాలుష్యమే. ఇలా చేస్తే మేలు... ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు,హెల్మెట్లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ప్రజా రవాణావ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతీవాహనానికి ఏటా పొల్యూషన్ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. తద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గి...పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుంది. -
ఉరుముతున్న కాలుష్య మేఘాలు..
ఒకవైపు కొరవడుతున్న పర్యావరణ స్పృహ.. మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో మహానగరం విలవిల్లాడుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికరమైన వ్యర్థాలు, నానాటికీ పెరుగుతున్న వాహనాలతో పెచ్చరిల్లుతున్న ఉద్గారాలు, ఈ–వ్యర్థాలు, విచ్చలవిడిగా చెత్తా చెదారాలు.. ఇలా ఒకటనేమిటి ఎన్నో విధాలుగా పర్యావరణంపై కాలుష్యం పడగ విప్పుతోంది. జనజీవనంపై పెనుప్రభావం చూపుతోంది. జల, వాయు, శబ్ద కాలుష్యంతో నగర ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అటు ప్రభుత్వాలు, అధికారులు, వ్యక్తిగతంగా ఎవరూ శ్రద్ధ కనబరచకపోవడంతో ప్రకృతి విషతుల్యంగా మారుతోంది. ఎవరికి వారు దీనిపై చైతన్యవంతులైతేనే ఈ దుస్థితి నుంచి బయటపడవచ్చు. అనర్థం ‘ఈ వ్యర్థం’ సనత్‌నగర్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ– వేస్ట్) పెనుసవాల్‌గా మారాయి. ఒకవైపు ఎలక్ట్రానిక్స్ రంగంలో మనిషి సృష్టిస్తున్న అద్భుతాలకు మురిసిపోతుంటే.. మరోవైపు అవే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. మనిషి అభివృద్ధి ముసుగులో తాను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమేననే పరిస్థితులు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఛార్జర్, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, ప్రింటర్స్, సీపీయూ (సెంట్రల్ పాసెసింగ్ యూనిట్లు), ఐప్యాడ్, ప్యాక్స్ యంత్రాలు.. ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మనిషి జీవితంలో భాగమయ్యాయి. వాడి పారేసిన ఆయా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయి. ఈ– వ్యర్ధాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి భూ గర్భ జలాలను విషతుల్యం చేస్తూ మానవ మనుగడకు మనిషి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. హెచ్ఎండీఏ నుంచే 33,000 టన్నులు.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)చే ఈ– వేస్ట్‌పై 2017–18కు సర్వే చేయించింది. దీని ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో 33,000 టన్నుల ఈ– వేస్ట్ ఏటా విడుదలవుతున్నట్లు డ్రాప్ట్ నివేదికను పీసీబీకి అందించింది. అందులో సింహభాగం కంప్యూటర్స్, టెలివిజన్స్, ప్రింటర్స్, మొబైల్ ఫోన్ల వ్యర్థాలే ఉండడం గమనార్హం. 2016–17కు 28,790 టన్నుల ఈ– వ్యర్ధాలు విడుదల కాగా ఈ ఏడాది ఐదువేల టన్నులకుపైగా పెరిగింది. ఇలా ప్రతి ఏటా ఈ వ్యర్థాలు వెలువడే శాతం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో ఈ– వ్యర్థాల విడుదలలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, చైన్నైలు ఉండగా హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. ఎంతో ప్రమాదకరం.. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా చిప్, సర్క్యూట్, మదర్‌బోర్డు వంటి తయారీలో సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ తదితర ప్రమాదకరమైన వాటిని ఉపయోగిస్తారు. వీటితో తయారైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారేయడంతో ఆయా రసాయనాలు భూమిలో కలిసి మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెడితే వెలువడే విష వాయువులు వాతావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. రీచార్జిబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో సీసాన్ని అధికంగా ఉపయోగిస్తారు. సీసంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమ్యాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాల కాడ్మియం ప్రభావంతో మూత్రపిండాలు, ఎముకలు బలహీనపడతాయి. వెన్నెముక, కీళ్లలో నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో ఉపయోగిస్తారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలిగిస్తోంది. సెమీ కండక్టర్లు, డయెడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహన విస్ఫోటనం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వాహన విస్ఫోటనం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో వాహనాల సంఖ్య అరకోటి దాటింది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు. తాజాగా మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తున్నా వ్యక్తిగత వాహనాల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. అయినా నగరవాసి సొంత వాహనానికే మొగ్గు చూపుతున్నాడు. మరోవైపు కాలం చెల్లిన వ్యక్తిగత, రవాణా వాహనాల కారణంగా కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో వాహనకాలుష్యం గురించి 15 ఏళ్ల క్రితమే భూరేలాల్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా రవాణా వినియోగం పెరగాలని, సీఎన్జీ,ఎల్పీజీ వంటి సహజ ఇంధనాలు అందుబాటులోకి రావాలని సూచించింది. వాహన కాలుష్యానికి ప్రధాన కారణమైన ఆటోరిక్షాలపైన ఆంక్షలు విధించాలని చెప్పింది. ఆ సిఫార్సుల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ఏటా వ్యక్తిగత వాహనాలు వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి. జనాభా అవసరాలకు తగిన విధంగా ప్రజారవాణా బలోపేతం కావడం లేదు. ప్రస్తుతం గ్రేటర్లో వాహనాల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇందులో 40.51 లక్షల బైక్‌లు, 9.43 లక్షలకు పైగా వ్యక్తిగత కార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండడం గమనార్హం. ప్రతి సంవత్సరం 5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. కొరవడిన నియంత్రణ.. ఆర్టీసీలో ఉన్న సుమారు 1000 డొక్కు బస్సులు సిటీ రోడ్లను కాలుష్యంతో ముంచెత్తుతున్నాయి. 1.4 లక్షల ఆటోలు ఉంటే అందులో 80 వేలకు పైగా కాలం చెల్లినవే. ఈ ఆటోల్లో వినియోగించే నకిలీ టూ టీ ఆయిల్ వల్ల సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన కాలుష్యకారకాలు వెలువడుతున్నాయి. స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, తదితర కేటగిరీకి చెందిన వాటిలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయిన పాత వాహనాలే ఉన్నాయి. నగరంలో ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యంపైన భూరేలాల్ కమిటీ 2002లోనే హెచ్చరించింది. తక్షణమే ఆటోలను నియంత్రించాలని సూచించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 45 వేల కొత్త ఆటోలు వచ్చి చేరాయి. కమిటీ సూచించినట్లుగా సీఎన్జీ అందుబాటులోకి రాలేదు. ఎల్పీజీ బంకులు పరిమితంగానే ఉన్నాయి. ఇదీ పరిస్థితి... గ్రేటర్లో వాహనాలు ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్లకు పైగా డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతూనే ఉంది. పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. దీంతో నగరవాసులు పలు జబ్బుల బారిన పడుతున్నారు. జబ్బుల ముప్పు సాక్షి, సిటీబ్యూరో: తినే తిండి దగ్గరి నుంచి, తాగే నీరు, పీల్చే గాలి, ఇలా అన్నీ కలుషితమే. సంపూర్ణ ఆరో గ్యంతో జీవించాల్సిన నగరవాసులు.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య భూతం వల్ల భయంకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. గ్రేటర్ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల చిన్న తనంలోనే అనేక మంది శ్వాసకోశ జబ్బుల బారినపడుతున్నారు. నగరంలో ఐదు శాతం మంది పెద్దలు, 20 శాతం మంది చిన్నారులు శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వాతావరణంలో ఓజోన్ 100 మైక్రో గ్రాములు దాట కూడదు. పగటివేళ 120–150 మైక్రోగ్రాములు దాటుతోంది. సీసం, ఆర్సినిక్, నికెల్ వంటి భారలోహ ధాతువులు కలిగిస గాలి పీల్చడం ద్వారా అది శ్వాసకోశాల్లోంచి రక్తంలోకి చేరుతుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యం వల్ల ముక్కు ద్వారాలు మూసుకపోయి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. అంతేకాదు ఈ కాలుష్యం సంతాన సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడలు విప్పుతున్న థైరాయిడ్.. ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాలతో పోటీపడుతోంది. ఇండియన్ థైరాయి డ్ ఎపిడమిలాజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లుపైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరం లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధా«రణ కాగా, వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియక పోవడం శోచనీయం. వెంటాడుతున్న కేన్సర్ ఐఏఆర్సీ సర్వే ప్రకారం దేశంలో ఏటా కొత్తగా పది లక్షల క్యేన్సర్ కేసులు నమోదు అవుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల కేసులు నమోదు అవుతున్న ట్లు సమాచారం. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ తక్కువగా ఉన్నా.. రొమ్ము కేన్సర్ మాత్రం రెట్టింపవుతోంది. మారిన జీవనశైలి ఒక కారణమైతే..నగరంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కేన్సర్ పెరుగుదలకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. ప్రతి వంద క్యాన్సర్ బాధితుల్లో 60 శాతం రొమ్ము, 40 శాతం మంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇక పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా రెండు లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండటం విశేషం. జనజీవితాలపై పొగ రోజు రోజుకు పర్యావరణంపై కాలుష్య ప్రభావం పెరుగుతూనే ఉన్నది. పరిశ్రమల యాజమాన్యాల స్వార్థానికి తోడు అవినీతి అధికారుల కారణంగా పర్యావరణ ప్రమాణాలు పడిపోతూనే ఉన్నాయి. కాలుష్య పొగలను బహిరంగంగా గాలిలోకి కలిపేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్ల, సుభాష్‌నగర్, దుండిగల్ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య పొగలు ఇవి. కేవలం పరిశ్రమలే కాదు వివిధ ప్రాంతాలలో వ్యర్థాలను తగులబెడుతూ పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ దుస్థితి ఇకనైనా మారేనా!? – కుత్బుల్లాపూర్. పర్యావరణంపై ధ్యాస.. ప్రకృతే ‘శ్వాస’ మొక్కలు నాటడంలో ఆదర్శంగా నిలుస్తున్న కళ్యాణి హిమాయత్‌నగర్: ఆమె ఒక పర్యావరణ విద్యార్థిని. ప్రకృతిపై ఎనలేని అభిమాని. పర్యావరణంపై ప్రతి పౌరుడూ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఆమె ప్రతిరోజూ నేర్చుకుంటున్నారు. అది తరగతి గదికే పరిమితం కాకుండా ఆచరణలోనూ పాటిస్తున్నారు. రహదారి పక్కన ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు జేఎన్టీయూలో పీహెచ్డీ స్కాలర్ జి.కళ్యాణి. దీనిని ఒక యజ్ఞంలా భావించి మొక్కలు నాటేందుకు ఓ ఫౌండేషన్ కూడా స్థాపించారామె. ఫౌండేషన్ ద్వారా తోటి విద్యార్థులను ఏకం చేస్తూ పర్యావరణంపై మరింత బాధ్యతగా నిలుస్తున్నారు కల్యాణి. నగరంలో ఖాళీగా కనిపించిన స్థలాలను ఎంచుకుని తోటి సభ్యులతో కలసి వారంలో రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటుతోంది. దీంతో అక్కడి ప్రజలకు ఈ మొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తూ వాటిని రక్షించాలనే మెసేజ్‌ను ఇస్తున్నారు. ఇప్పటి వరకు జేఎన్టీయూ, బంజారాహిల్స్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న విషయం ప్రజల్లోకి మరింతగా వెళ్లాలంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఓ ఫౌండేషన్‌ను స్థాపించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు కళ్యాణి. ‘శ్వాస ఫౌండేషన్’ స్థాపించి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతకు శ్రీకారం చుట్టారు. పచ్చదనం ప్రయోజనాలను వివరిస్తాను.. ఎన్విరాన్మెంట్ పీహెచ్డీ స్కాలర్‌గా నా చదువుకు కూడా న్యాయం చేయాలి. పర్యావరణంపై మమకారం ఎక్కువ. అందుకే ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. రానున్న రోజుల్లో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనుంది. – జి.కళ్యాణి, ‘శ్వాస’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
ఈ – వేస్ట్‌పై ఆపిల్ యుద్ధం!
హమ్మయ్యా... ఎట్టకేలకు ఈ–వేస్ట్‌పై కంప్యూటర్ తయారీ కంపెనీలు స్పందించడం మొదలైంది. అంతర్జాతీయ కంపెనీ ఆపిల్ తొలిసారి మొబైల్ఫోన్లను రీసైకిల్ చేసే యంత్రాన్ని ఆవిష్కరించింది. డెయిసీ పేరున్న ఈ రోబో ఎంత వేగంగా పనిచేయగలదో తెలుసా? గంటకు 200 ఐఫోన్లను విప్పేయగలిగేంత! వాడేసిన ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లన్నింటినీ కలిపి ఈ–వేస్ట్ అంటారని.. తగిన విధంగా వీటిని రీసైకిల్ చేయకపోవడం వల్ల అనేక కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని మనకు తెలుసు. అన్ని రకాల ఈ–వేస్ట్లోనూ బంగారు, వెండి వంటి విలువైన లోహాలు కూడా లేశమాత్రంగా ఉంటాయి. ఒక్క అమెరికాలో ఏటా చెత్తకుప్పల్లోకి చేరే ఈ–వేస్ట్‌లో ఏకంగా ఆరు కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో ఈ–వేస్ట్ సమర్థ రీసైక్లింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూండగా ఆపిల్ డెయిసీని రూపొందించింది. ఇది తొమ్మిది మోడళ్ల ఐఫోన్లను ఒకదాని తరువాత ఒకటి విడగొట్టడమే కాకుండా వాటి భాగాలన్నింటినీ వేరు చేస్తుంది కూడా. సంప్రదాయ రీసైక్లింగ్ ద్వారా సేకరించలేని విలువైన పదార్థాలను కూడా డెయిసీ చాలా సులువుగా వేరు చేయగలదని ఆపిల్ అంటోంది. అయితే ఇలాంటి రోబోలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రీసైకిల్ చేస్తారా? లేక ప్రధాన కేంద్రాల్లో మాత్రమే వీటిని ఉంచుతారా? అనే విషయం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు. -
ఢిల్లీకి ఏమైంది?
కాలుష్యంతో కూడిన పొగమంచు వల్ల దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా ప్రజలకు ఊపిరాడటం లేదు. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పక్కనున్న మనిషి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు. కాలుష్యానికి మంచు తోడై నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువే. అందుకే దీని పరిధిలో అధిక సీసీ గల డీజిల్ వాహనాల వాడకంపై ఆంక్షలున్నాయి. పదేళ్ల పైబడిన వాహనాలనూ అనుమతించరు. కాలుష్య తీవ్రత దృష్ట్యా ఈసారి దీపావళికి టపాకాయలను కూడా సుప్రీంకోర్టు అనుమతించలేదు. అయితే ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు తమ వరి పంటలను కోసిన తర్వాత మిగిలిన రెల్లు గడ్డి, వరి మొదళ్లను పొలాల్లోనే తగులబెట్టేస్తున్నారు. దీని కారణంగా వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది. దానికి తోడు చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. ఎండ ఉంటే నేల తాలూకు వేడికి గాలి పలుచనై పైకి వెళుతుంది. గాలితోపాటు కాలుష్యకారక ధూళి కణాలూ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ గాలులు స్తబ్దుగా ఉండటంతో గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు అలాగే నిలిచిపోతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు, దానికి వరి దగ్ధం తాలూకు పొగ తోడవటం, కాలుష్యం, గాలిలో కదలికలు లేకపోవడం, ఎండ లేకపోవడం... ఇలా అన్నీ కలిపి ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తీవ్రత ఎంత? గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్స్ అధికమై జనం ఊపిరి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గాలిలో తేమ ఎక్కువగా ఉంటోంది. గాలిలో 2.5 మైక్రోమీటర్ల వ్యాసార్థం గల కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలను హానికరంగా పరిగణిస్తారు. గాలిలో ఈ పీఎం 2.5 (సూక్ష్మ ధూళి కణాలు) 50 నుంచి 60 ఉంటే సాధారణ స్థితిగా పరిగణిస్తారు. అయితే మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో చాలా చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 సూచించింది. కొన్నిచోట్ల ఇది 500 దాకా వెళ్లింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100–120 మధ్య ఉంటుంది. ఈ కాలుష్యానికే మనం ఇబ్బంది పడుతుంటాం. మరి 450 స్థాయిలో కాలుష్యమంటే.. మధ్యాహ్నమైనా సరే.. దట్టమైన పొగమంచు వల్ల 200 మీటర్ల లోపు వస్తువులనూ ఢిల్లీ ప్రజలు చూడలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భూసారానికీ నష్టమే ఒక టన్ను వరి గడ్డిని తగలబెడితే.. 5.5 కిలోల నైట్రోజన్, 2.3 కిలోల పాస్పరస్, 25 కేజీల పొటాషియం, 1.2 కిలోల మేరకు సల్ఫర్ తగ్గిపోతుంది. దీని వల్ల భూసారానికి ఆమేర నష్టం జరుగుతోంది. పైగా గడ్డిని మండించినపుడు వరి మొదళ్లు మండుతూ భూమిలోపలికి ఒక సెంటీమీటరు వరకు వెళతాయి. ఈ వేడికి భూసారాన్ని పరిరక్షించే సూక్ష్మ క్రిములు చనిపోతాయి. ఒకరికి చవక.. మరొకరికి చావుకు పంజాబ్, హరియాణాల్లో రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేస్తారు. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ నెల మధ్యకల్లా వీరు వరిని కోసి పొలాన్ని గోధుమ పంటకు సిద్ధం చేస్తారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను వాడుతున్నారు. అయితే వాటి ద్వారా కోస్తే వరి ముక్కలు ముక్కలవుతుంది. పశువుల మేతకు పనికిరాదు. సాధారణంగా పొలంలో నీళ్లు నిల్వచేసి.. కేజ్ వీల్‌తో మొదళ్లను భూమిలోనే తొక్కిస్తుంటారు. అయితే సమయం లేకపోవడం, కాల్చకుండా భూమిని మరో పంటకు సిద్ధం చేయడానికి హెక్టారుకు రూ.3,500 ఖర్చవుతుండటంతో రైతులు పంటను తగులబెడుతున్నారు. పాడి పశువులకు జొన్న గడ్డి అందిస్తారు కాబట్టి వారికి వరిగడ్డితో పనిలేదు. కానీ పంటకు నిప్పు పెట్టడం తీవ్ర వాయుకాలుష్యానికి దారితీసి ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పంజాబ్‌లో గడ్డిని తగలబెట్టడం ద్వారా 15–20 రోజుల్లోనే 2.2 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని 2014లో జరిపిన అధ్యయనంలో తేలింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) 2008–09లో జరిపిన అధ్యయనంలో భారత్‌లో ఆ ఏడాది పంటలను తగులబెట్టినందువల్ల 14.9 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 90 లక్షల టన్నుల కార్బన్ మోనాక్సైడ్, 2.5 లక్షల టన్నుల సల్ఫర్ ఆక్సైడ్, 12.8 లక్షల టన్నుల హానికారక సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలోకి విడుదలైనట్లు అంచనా వేసింది. ఢిల్లీ కాలుష్యంలో 26 శాతానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమవుతోంది. నిజానికి కాల్చడం నిషిద్ధం జాతీయ హరిత ట్రిబ్యునల్ 2015 డిసెంబర్ 10న వెలువరించిన ఉత్తర్వుల ద్వారా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లలో పంట మిగులును తగులబెట్టడాన్ని నిషేధించింది. అంతకు ముందే 2014లో కేంద్రం పంట వ్యర్థాల నిర్వహణపై జాతీయ విధానాన్ని విడుదల చేసింది. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు, స్థానికుల్లో అధికారులు అవగాహన పెంచాలని ఇది నిర్దేశిస్తోంది. ఎవరైనా పంట వ్యర్థాలకు నిప్పుపెడితే... అధికారులకు సమాచారమిచ్చేలా వ్యవస్థ ఏర్పరచుకోవాలని కూడా ఈ విధానం సూచించింది. కానీ ఈ విషయంలో రాష్ట్రాలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి. 1981లో తెచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం కూడా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం శిక్షార్హం. కేంద్రం, ఎన్జీటీ, సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో కొంత కదలిక వచ్చినా... ఎన్నికలు, ఇతర కారణాలతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించ లేదు. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్లను పెంచాలనే నిబంధన కూడా నత్తనడకన సాగుతోంది. ఆరోగ్యంపై ప్రభావం ⇒అదే పనిగా దగ్గు, ఛాతీలో మంట, ఎలర్జీ ఎక్కువవడం ⇒ఊపిరితిత్తుల పనితీరు మందగించడం ⇒హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ⇒శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ⇒ఆస్తమా, బ్రాంకైటిస్ రోగులకు ఇబ్బంది ⇒నెలలు నిండకుండానే శిశు జననాలు జరిగే అవకాశం ⇒పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉపశమనానికి ఏం చేస్తున్నారు ⇒పాఠశాలలకు సెలవు ప్రకటించారు, ⇒ఇళ్లను వదిలి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు ⇒బహిరంగ ప్రదేశాల్లో ఆటలు, వ్యాయామాలకు దూరంగా ఉండాలని సూచించారు ⇒రోడ్లపై దుమ్మురేగకుండా రహదారులపై నీళ్లు చిమ్ముతున్నారు. ⇒ఎన్95 మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
1,200 ఫ్యాక్టరీలు మూత
బీజింగ్ : దట్టమైన మేఘాల వల్లే అల్లుకుపోతున్న వాతావరణ కాలుష్యంతో బీజింగ్ పరిసర ప్రాంతాల్లో పొలుష్యన్ అలర్ట్ ప్రకటించించారు. రాజధాని సమీపంగా ఉన్న 1,200 ఫ్యాక్టరీలను మూసివేయడం లేదా ఉత్పత్తి తగ్గించుకోవడం వంటివి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీచేసిన వాటిలో ప్రభుత్వ దిగ్గజ ఆయిల్ రిఫైనరీ సినోపెక్ సంస్థ, కోఫ్కో ఫుడ్ ప్లాంట్లు ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ దిగ్గజం సినోపెక్ ఏడాదికి 10 మిలియన్ టన్నుల యన్షాన్ రిఫైనరీ చేస్తుందని మున్సిపల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 500 కంపెనీలకు ఉత్పత్తిలో కోత విధించి, 700 కంపెనీలు కచ్చితంగా కార్యకలాపాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు పేర్కొంది. ఉత్తర చైనా వ్యాప్తంగా దట్టమైన కాలుష్య మేఘాలు ఆవరించడంతో, శుక్రవారం అర్థరాత్రి పర్యావరణ నిపుణులు రెడ్ అలర్ట్ కూడా జారీచేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరొందిన చైనా ఎంతో కాలంగా పర్యావరణ సంబంధిత సమస్యతో సతమతమవుతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కలర్-గ్రేడెడ్ వార్నింగ్ సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం చేపడుతోంది.