ఢిల్లీకి ఏమైంది? | Pollution rises to emergency levels in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ఏమైంది?

Published Thu, Nov 9 2017 5:11 AM | Last Updated on Thu, Nov 9 2017 5:11 AM

Pollution rises to emergency levels in Delhi - Sakshi

కాలుష్యంతో కూడిన పొగమంచు వల్ల దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా ప్రజలకు ఊపిరాడటం లేదు. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పక్కనున్న మనిషి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు.  

    
కాలుష్యానికి మంచు తోడై
నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువే. అందుకే దీని పరిధిలో అధిక సీసీ గల డీజిల్‌ వాహనాల వాడకంపై ఆంక్షలున్నాయి. పదేళ్ల పైబడిన వాహనాలనూ అనుమతించరు. కాలుష్య తీవ్రత దృష్ట్యా ఈసారి దీపావళికి టపాకాయలను కూడా సుప్రీంకోర్టు అనుమతించలేదు. అయితే ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు తమ వరి పంటలను కోసిన తర్వాత మిగిలిన రెల్లు గడ్డి, వరి మొదళ్లను పొలాల్లోనే తగులబెట్టేస్తున్నారు. దీని కారణంగా వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది. దానికి తోడు చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. ఎండ ఉంటే నేల తాలూకు వేడికి గాలి పలుచనై పైకి వెళుతుంది. గాలితోపాటు కాలుష్యకారక ధూళి కణాలూ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ గాలులు స్తబ్దుగా ఉండటంతో గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు అలాగే నిలిచిపోతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు, దానికి వరి దగ్ధం తాలూకు పొగ తోడవటం, కాలుష్యం, గాలిలో కదలికలు లేకపోవడం, ఎండ లేకపోవడం... ఇలా అన్నీ కలిపి ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తీవ్రత ఎంత?
గాలిలో నైట్రోజన్‌ ఆక్సైడ్స్, సల్ఫర్‌ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్స్‌ అధికమై జనం ఊపిరి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గాలిలో తేమ ఎక్కువగా ఉంటోంది. గాలిలో 2.5 మైక్రోమీటర్ల వ్యాసార్థం గల కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలను హానికరంగా పరిగణిస్తారు. గాలిలో ఈ పీఎం 2.5 (సూక్ష్మ ధూళి కణాలు) 50 నుంచి 60 ఉంటే సాధారణ స్థితిగా పరిగణిస్తారు. అయితే మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో చాలా చోట్ల ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 450 సూచించింది. కొన్నిచోట్ల ఇది 500 దాకా వెళ్లింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 100–120 మధ్య ఉంటుంది. ఈ కాలుష్యానికే మనం ఇబ్బంది పడుతుంటాం. మరి 450 స్థాయిలో కాలుష్యమంటే.. మధ్యాహ్నమైనా సరే.. దట్టమైన పొగమంచు వల్ల 200 మీటర్ల లోపు వస్తువులనూ ఢిల్లీ ప్రజలు చూడలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

భూసారానికీ నష్టమే
ఒక టన్ను వరి గడ్డిని తగలబెడితే.. 5.5 కిలోల నైట్రోజన్, 2.3 కిలోల పాస్పరస్, 25 కేజీల పొటాషియం, 1.2 కిలోల మేరకు సల్ఫర్‌ తగ్గిపోతుంది. దీని వల్ల భూసారానికి ఆమేర నష్టం జరుగుతోంది. పైగా గడ్డిని మండించినపుడు వరి మొదళ్లు మండుతూ భూమిలోపలికి ఒక సెంటీమీటరు వరకు వెళతాయి. ఈ వేడికి భూసారాన్ని పరిరక్షించే సూక్ష్మ క్రిములు చనిపోతాయి.

ఒకరికి చవక.. మరొకరికి చావుకు
పంజాబ్, హరియాణాల్లో రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేస్తారు. అక్టోబర్‌ చివరి నుంచి నవంబర్‌ నెల మధ్యకల్లా వీరు వరిని కోసి పొలాన్ని గోధుమ పంటకు సిద్ధం చేస్తారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను వాడుతున్నారు. అయితే వాటి ద్వారా కోస్తే వరి ముక్కలు ముక్కలవుతుంది. పశువుల మేతకు పనికిరాదు. సాధారణంగా పొలంలో నీళ్లు నిల్వచేసి.. కేజ్‌ వీల్‌తో మొదళ్లను భూమిలోనే తొక్కిస్తుంటారు. అయితే సమయం లేకపోవడం, కాల్చకుండా భూమిని మరో పంటకు సిద్ధం చేయడానికి హెక్టారుకు రూ.3,500 ఖర్చవుతుండటంతో రైతులు పంటను తగులబెడుతున్నారు. పాడి పశువులకు జొన్న గడ్డి అందిస్తారు కాబట్టి వారికి వరిగడ్డితో పనిలేదు. కానీ పంటకు నిప్పు పెట్టడం తీవ్ర వాయుకాలుష్యానికి దారితీసి ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పంజాబ్‌లో గడ్డిని తగలబెట్టడం ద్వారా 15–20 రోజుల్లోనే 2.2 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల అవుతోందని 2014లో జరిపిన అధ్యయనంలో తేలింది. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) 2008–09లో జరిపిన అధ్యయనంలో భారత్‌లో ఆ ఏడాది పంటలను తగులబెట్టినందువల్ల 14.9 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 90 లక్షల టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్, 2.5 లక్షల టన్నుల సల్ఫర్‌ ఆక్సైడ్, 12.8 లక్షల టన్నుల హానికారక సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలోకి విడుదలైనట్లు అంచనా వేసింది. ఢిల్లీ కాలుష్యంలో 26 శాతానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమవుతోంది.

నిజానికి కాల్చడం నిషిద్ధం
జాతీయ హరిత ట్రిబ్యునల్‌ 2015 డిసెంబర్‌ 10న వెలువరించిన ఉత్తర్వుల ద్వారా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లలో పంట మిగులును తగులబెట్టడాన్ని నిషేధించింది. అంతకు ముందే 2014లో కేంద్రం పంట వ్యర్థాల నిర్వహణపై జాతీయ విధానాన్ని విడుదల చేసింది. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు, స్థానికుల్లో అధికారులు అవగాహన పెంచాలని ఇది నిర్దేశిస్తోంది. ఎవరైనా పంట వ్యర్థాలకు నిప్పుపెడితే... అధికారులకు సమాచారమిచ్చేలా వ్యవస్థ ఏర్పరచుకోవాలని కూడా ఈ విధానం సూచించింది. కానీ ఈ విషయంలో రాష్ట్రాలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి. 1981లో తెచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం కూడా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం శిక్షార్హం. కేంద్రం, ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో కొంత కదలిక వచ్చినా... ఎన్నికలు, ఇతర కారణాలతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించ లేదు. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్లను పెంచాలనే నిబంధన కూడా నత్తనడకన సాగుతోంది.

ఆరోగ్యంపై ప్రభావం
అదే పనిగా దగ్గు, ఛాతీలో మంట, ఎలర్జీ ఎక్కువవడం
ఊపిరితిత్తుల పనితీరు మందగించడం
హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం  
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  
ఆస్తమా, బ్రాంకైటిస్‌ రోగులకు ఇబ్బంది  
నెలలు నిండకుండానే శిశు జననాలు జరిగే అవకాశం
పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రతికూల ప్రభావం

ఉపశమనానికి ఏం చేస్తున్నారు
పాఠశాలలకు సెలవు ప్రకటించారు,  
ఇళ్లను వదిలి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు
బహిరంగ ప్రదేశాల్లో ఆటలు, వ్యాయామాలకు దూరంగా ఉండాలని సూచించారు
రోడ్లపై దుమ్మురేగకుండా రహదారులపై నీళ్లు చిమ్ముతున్నారు.
ఎన్‌95 మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement