
హమ్మయ్యా... ఎట్టకేలకు ఈ–వేస్ట్‌పై కంప్యూటర్ తయారీ కంపెనీలు స్పందించడం మొదలైంది. అంతర్జాతీయ కంపెనీ ఆపిల్ తొలిసారి మొబైల్‌ఫోన్లను రీసైకిల్ చేసే యంత్రాన్ని ఆవిష్కరించింది. డెయిసీ పేరున్న ఈ రోబో ఎంత వేగంగా పనిచేయగలదో తెలుసా? గంటకు 200 ఐఫోన్లను విప్పేయగలిగేంత! వాడేసిన ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లన్నింటినీ కలిపి ఈ–వేస్ట్ అంటారని.. తగిన విధంగా వీటిని రీసైకిల్ చేయకపోవడం వల్ల అనేక కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని మనకు తెలుసు. అన్ని రకాల ఈ–వేస్ట్‌లోనూ బంగారు, వెండి వంటి విలువైన లోహాలు కూడా లేశమాత్రంగా ఉంటాయి. ఒక్క అమెరికాలో ఏటా చెత్తకుప్పల్లోకి చేరే ఈ–వేస్ట్‌లో ఏకంగా ఆరు కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో ఈ–వేస్ట్ సమర్థ రీసైక్లింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూండగా ఆపిల్ డెయిసీని రూపొందించింది.
ఇది తొమ్మిది మోడళ్ల ఐఫోన్లను ఒకదాని తరువాత ఒకటి విడగొట్టడమే కాకుండా వాటి భాగాలన్నింటినీ వేరు చేస్తుంది కూడా. సంప్రదాయ రీసైక్లింగ్ ద్వారా సేకరించలేని విలువైన పదార్థాలను కూడా డెయిసీ చాలా సులువుగా వేరు చేయగలదని ఆపిల్ అంటోంది. అయితే ఇలాంటి రోబోలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రీసైకిల్ చేస్తారా? లేక ప్రధాన కేంద్రాల్లో మాత్రమే వీటిని ఉంచుతారా? అనే విషయం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment