
ఈ రోజుల్లో అందరూ ఫోనుకు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా యువత ఫోను(Mobile Phone)తో టైమ్‌పాస్ చేస్తూ చదువులను కూడా పక్కనపెడుతున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం రీవాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రస్తుతం జరుగుతున్న సీబీఎస్‌సీ పదవ తరగతి పరీక్షలకు హాజరవుతోంది. అయితే పుస్తకం చదువుతున్నానని(studying) తల్లికి చెప్పి, ఫోనులో సోషల్ మీడియా పోస్టులను చూస్తోంది. దీనిని గమనించిన తల్లి.. కుమార్తె దగ్గనున్న ఫోనును లాక్కుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ పదవ తరగతి విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏకంగా 13 కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి,అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.
ఆ స్నేహితురాలితో పాటు కలసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న ఒక రైలులో కూర్చుంది. అయితే రైలు టీటీఈ ఆ విద్యార్థినులను ఖాండ్వా రైల్వే స్టేషన్(Railway station)లో ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. వారు తడబడుతూ మాట్లాడుతుండటంతో టీటీఈ వారిని ఆర్‌పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు మైనర్‌లని తేలింది. దీంతోవారిని ఆర్‌పీఎఫ్ పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అక్కడి సిబ్బందికి ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామా చెప్పడంతో వారు ఆ విద్యార్థినులను తీసుకుని స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ వారిలో ఒక విద్యార్థిని వయసు 15 అని, మరొకరి వయసు 17 అని తెలిపారు. వారిద్దరూ ఒకే స్కూలులో చదువుతున్నారని, వారిద్దరికీ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాక వారిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’