న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గ్రాప్-3’ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది.
కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పడు గ్రాప్-3ని ఆచరణలో పెట్టింది. అయితే ఇది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 5.85 కోట్ల జరిమానా విధించింది. గ్రాప్-3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.
శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)417గా ఉంది. శుక్రవారం ఇదే సమయంలో ఏక్యూఐ 396గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం వాయునాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరికి చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతోవున్నవారు మరిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
నిషేధం ఉన్నప్పటికీ బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 550 చలానాలను విధించారు. బీఎస్- 3 పెట్రోల్, బీఎస్- 4 డీజిల్, నాలుగు చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే రూ.20 వేలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు (పీయూసీసీ)లేని వాహనాలకు కూడా పోలీసులు చలానాలు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజునే 4,855 వాహనాలపై మొత్తంగా రూ.5.85 కోట్ల జరిమానా విధించారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment