హరిత దీపావళి జరుపుకొందాం! | Sakshi Guest Column On Diwali Air Pollution | Sakshi
Sakshi News home page

హరిత దీపావళి జరుపుకొందాం!

Published Thu, Oct 31 2024 12:10 AM | Last Updated on Thu, Oct 31 2024 12:10 AM

Sakshi Guest Column On Diwali Air Pollution

భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్‌ వాహనాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. 

కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.

భారత్‌లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్‌’ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ తర్వాత మూడో స్థానంలో భారత్‌ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. 

గడిచిన దశాబ్ద కాలం నుంచి  మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్‌ఏ ఎఫ్‌ఏఆర్‌) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది.  

గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. 

పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.
– సంపతి రమేష్‌ మహారాజ్‌ ‘ ఉపాధ్యాయుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement