సందర్భం
సంక్రాంతి తల్లి సకల సౌభాగ్యాలు ఇచ్చే కల్పవల్లి. తెలుగు లోగిళ్ళలో భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజులపాటు వైభవోపేతంగా జరుగుతుంది. సంక్రాంతి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. గత సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే పండుగ. రైతు ఇంటికి పౌష్యలక్ష్మి సమృద్ధిగా వచ్చి చేరే కాలం కాబట్టి రైతు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాడు.
భోగి తెల్లవారు జామున భోగిమంటలు వేసి చలి కాచుకుంటారు. వచ్చిన వారంతా మంటల్లో భోగి పిడకలు వేస్తారు. ఈ మంటలపై మరిగించిన నీళ్ళతో తలంటు స్నానాలు చేస్తారు. యువతులు ఇళ్ళ ముంగిట గొబ్బెమ్మలు పెట్టి, వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈరోజునే ఐదేళ్ల లోపు పిల్లలపై భోగిపళ్ళు పోయడమనే సంప్రదాయముంది. రేగుపళ్ళునే భోగిపళ్ళుగా వినియోగించడం పరిపాటి.
మరుసటి రోజు సంక్రాంతి. ఇది చాలా ముఖ్యమైన రోజు. పెద్దలంతా కోడికూత జామునే నిద్ర లేస్తారు. స్నానాదులు ముగించి, ఉపవాసముంటారు. పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో పొత్తర్లు పెడతారు. పిండివంటలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. కొత్త బట్టలు, మడపళ్ళు మూలన పెట్టి సమర్పిస్తారు.
మూడోరోజు కనుమ. ఇది పశువుల పండగ. ప్రత్యేకించి గోవులకు పూజ చేస్తారు. అందుకే పశువులను అందంగా అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు పూస్తారు. పూల మాలలు కడతారు. వండిన పిండివంటలను పశువులకు తినిపిస్తారు. ఇలాగే ముక్కనుమ రోజున కూడా పశుపూజ ఉంటుంది.
ఇంకా... పల్లెల్లో అడుగడుగునా ధనుర్మాసపు శోభ తాండవిస్తుంది. వీధులన్నీ పచ్చని మామిడి తోరణాలతో, అరటిబోదులతో, చెరకు గడలతో అలంకరించబడతాయి. బొమ్మల కొలువులు, సాము గరిడీలు, సంగిడీలు ఎత్తడాలు, గంగిరెద్దుల వారి నాదస్వర గీతాలు, డూడూ బసవన్న నాట్యాలు, హరిదాసుల కీర్తనలు, రంగస్థల పద్య నాటకాలు, మేలుకొలుపు గీతాలు, బుడబుక్కల వారి పాటలు, కొమ్మదాసరుల విన్యాసాలు, పిట్టల దొరల హాస్య సంభాషణలు, జంగమ దేవరల పొగడ్తలతో పల్లె వాతావరణం పరిమళ భరితమౌతుంది.
అందుకే సంక్రాంతి పండుగను సకల కళల సమాహారంగా కవులు అభివర్ణిస్తారు. కోస్తాంధ్ర అంతటా సంక్రాంతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి. తమిళనాడులో జల్లికట్టు వలె, దక్షిణ కోస్తాలో కోడిపందాలు (ప్రభుత్వ అనుమతి లేనప్పటికీ) జోరుగా నిర్వహిస్తారు. వీటిని ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూస్తారు.
పిల్లలైతే కొత్త బట్టలు ధరించి, గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తారు. పండుగ రోజుల్లో ఇంటి ముంగిళ్ళన్నీ రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతాయి. అన్నావదినలతో, అక్కాబావలతో యువతీ యువకులంతా సరదాగా పండగ సమయాలను గడుపుతారు. సంప్రదాయంగా వస్తున్న ముగ్గుల పోటీలు, ఎడ్లబళ్ళ పందాలు, కబడ్డీ, వాలీబాల్ వంటి గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. మైసూర్–కలకత్తాలలో దసరా ఉత్సవాల వలె, పూణే–హైదరాబాదులో గణపతి నవరాత్రి ఉత్సవాలు మాదిరి కోస్తాంధ్ర అంతటా సంక్రాంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
తమ వారితో కలసి పండుగలో పాల్గొనేందుకు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరమైతే జనం లేక బోసిపోతోంది. ఇలా వచ్చిన వారంతా తమ ఊరిలో పండుగ మూడు రోజులూ ఉత్సాహంగా గడుపుతారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను మదినిండా పదిలపరుచుకుంటారు. పండుగయ్యాక వలస జీవులంతా పట్టణాలకు తిరుగు ప్రయాణ మవుతారు.
పండుగలు మన సంస్కృతీ సాంప్రదాయాలలో భాగంగానే పుట్టాయి. పండుగలు జాతీయ సమైక్యతా భావనకు చిహ్నాలు. వివిధ పండుగలను కులాల, మతాలకతీతంగా సామరస్యంగా జరుపుకోవడం మన కర్తవ్యం. మన వైవిధ్య జీవనానికి పండుగలు గొప్ప ప్రతీకగా నిలుస్తాయి. పండుగల నిర్వహణలో ఆచార వ్యవహారాలు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండవు. ఐనప్పటికీ పండుగ యొక్క సామాజిక, సాంస్కృతిక ధ్యేయం ఒకటే కాబట్టి, అంతటా ఒకేలా ఐక్యత పరిఢవిల్లుతుంది.
భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని కలిగియున్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూతాను ఇష్టపడుతున్న జీవనాన్ని స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. దీనిలో భాగంగానే తాను కోరుకున్న సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన జీవితంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా మేళవించుకోవచ్చు.
పిల్లా తిరుపతిరావు
వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయులు
మొబైల్: 7095184846
Comments
Please login to add a commentAdd a comment